Saturday, August 9, 2025

ధరాలి విపత్తుకు ఎవరిది బాధ్యత?

- Advertisement -
- Advertisement -

ధరాలి. ఇది నేడు దేశమంతా సంచలనమైన పేరు. గత మూడు రోజుల క్రితం అంటే మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు జరిగిన మహా విపత్తు కోట్లాది మందిని కంటతడి పెట్టించింది. ఆ సమయంలో జరిగిన ఆ విపత్తు దృశ్యాలు అందరి నోరు మాట రాకుండా చేశాయి. హఠాత్తుగా కొండల మీదినుంచి మహా వరద, దానితో పాటు రాళ్లు, రప్పలు, బురద కొన్ని క్షణాల్లోనే ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. కొన్ని సెకన్ల కింద రంగు రంగుల భవనాలు ఎంతో అందంగా కనిపించాయి. కానీ ఆ వరద ముంచెత్తడంతో ఆ ఆనవాళ్లు కూడా మిగలకుండాపోయాయి. ఇప్పటి వరకు మృతుల సంఖ్యను ఖచ్చితంగా ప్రకటించలేదు. అయిదుగురు మరణించారు. వంద మంది గల్లంతయ్యారని అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈ సంఖ్య ఎంత మాత్రం వాస్తవం కాదని ప్రత్యక్షంగా అక్కడకు వెళ్లిన పత్రికా ప్రతినిధులు ప్రకటిస్తున్నారు.
ఆ సంఘటన గురించిన వివరాలు, (Details event) ఇప్పటకే మనలో చాలా మందికి అందాయి. వందల వేల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ధరాలి ఘటన కొత్తది కాదు. ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. గత 50 ఏళ్లలో కానీ, అంతకు ముందు కానీ ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు, స్వతంత్ర అధ్యయన సంస్థలు ఆ సంఘటనలను అధ్యయనం చేసి తగు సిఫారసులు చేస్తుంటాయి. ఉత్తరాఖండ్‌లో అటువంటి అధ్యయనాలు జరిగాయి. భవిష్యత్‌లో వరదలు, కొండచరియలు పడిపోవడం లాంటి జరగకుండా ఉండాలంటే లేదా అటువంటివి సహజమైనప్పుడు తక్కువ నష్టం జరిగే విధంగా చర్యలు ఉండాలని ఎన్నో సిఫారసులు ఉన్నాయి.

ధరాలి ఘటన కన్నా ముందు ఉత్తరాఖండ్‌లో హిందువుల పవిత్ర క్షేత్రమైన కేదార్‌నాథ్ దేవాలయం ప్రాంతంలో 2013, జూన్ 16, 17 తేదీల్లో మహా వరద సంభవించింది. ఒకేసారి 260 మిలియన్ లీటర్ల నీరు కొండల నుంచి కిందికి రావడంతో వందల గ్రామాలు జలమయమయ్యాయి. ఇందులో దాదాపు 6వేల మంది మరణించారు. లక్షల మందికి పైగా సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐడిఎం) చాలా లోతైన అధ్యయనం జరిపి ఒక సమగ్రమైన నివేదికను రూపొందించింది. అందులో ప్రధానంగా మూడు సిఫారసులను చేసింది. అయితే ఆ మూడు అంశాలు కూడా ఒకే విషయం పైన కేంద్రీకరించినవి. అందులో ఒకటి, ఎక్కడైతే వరదలు తరచుగా వచ్చే అవకాశముందో, వాటిని గుర్తించి, నూతనంగా వచ్చే నిర్మాణాలను నియంత్రించాలి.

రెండోది, కొత్త నిర్మాణాలు, ప్రాజెక్టులు కట్టేటప్పుడు వాటిని ఎక్కడ నిర్మించాలో, ఎక్కడ నిర్మించకూడదో కూడా సరైన పరిశోధనల ద్వారా గుర్తించాలి. దీనికి ఒక చట్టపరమైన రూపం ఇవ్వాలి. మూడోది, నది ఒడ్డున, పరీవాహక ప్రాంతంలో ఎటువంటి కట్టడాలు రాకుండా చూడాలి. అయితే 2013 తర్వాత మళ్లీ 2021 లో నందాదేవి క్షేత్రం దగ్గర రిషి గంగ, దౌలిగంగ నదులు హఠాత్తుగా ఉప్పొంగి ఫిబ్రవరి 7 రెండు వందల మంది చనిపోయారు. ఈ నదులకు అడ్డంగా రెండు జలవిద్యుత్ కేంద్రాలను నిర్మిస్తున్నారు. ఆ పని సాగుతున్నది. అందులో పని చేస్తున్న వాళ్లందరూ జలసమాధి అయ్యారు. మళ్లీ ఇప్పుడు అంటే గత మూడు రోజుల క్రితం ధరాలి ఘటన జరిగింది.

ఇక్కడ ఒక నిమిషం ఆగి ఆలోచిద్దాం. ధరాలి దృశ్యాలను చూసిన వారందరికీ ఒక విషయం గుర్తు చేయదలచుకున్నాను. ఆ దృశ్యాలలో వరదలో కొట్టుకుపోతున్నవన్నీ ఆధునిక భవనాలు. అవి రంగులతో మెరుస్తున్నవి. రెండోది అవి నది ఒడ్డుననే ఉన్నాయి. కొన్నైతే నదీ ప్రవాహాన్ని అడ్డుకట్టవేసి కట్టినట్టు కనిపిస్తున్నది. అంటే 2013 లో కేదార్‌నాథ్‌లో జరిగిన ఘోర దుర్ఘటన అనంతరం నియమించిన కమిటీ నివేదిక సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇంకొక విషయం, ఇక్కడ ఇండియన్ ఆర్మీ క్యాంపు కూడా ఉంది. అది కూడా వరదలో కొట్టుకుపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఆ సిఫారసులను పట్టించుకోలేదు.

ధరాలి ఘటనకు ప్రకృతి ప్రకోపం, వాతావరణ పరిస్థితులు కూడా కారణమే. కాని ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగడానికి మాత్రం ప్రభుత్వమే కారణం. అయితే ప్రభుత్వాలు అధ్యయన సంస్థలు, నిపుణులు అందించిన సిఫారసులను అమలు చేసినట్లయితే భారీ నష్టం జరగదు. ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. కేంద్ర ప్రభుత్వ మరో సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఎ) భారత దేశంలోని కొండ ప్రాంతాల్లో వరద, ఇతర ప్రమాదాల స్థలాలను కారణాలను తప్ప ఇమేజ్‌ల ద్వారా గుర్తించి ఒక వివరమైన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. అందులో ప్రత్యేకించి మూడు ప్రాంతాలను గుర్తించింది. మొదటిది వాయువ్య రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు ఉన్న ప్రాంతం.

రెండోది ఈశాన్య రాష్ట్రాలు, మూడోది, పశ్చిమ కనుమలు కలిగిన మహారాష్ట్ర, కర్నాటక, కేరళ. అయితే ఇందులో ప్రమాదకరమైన ప్రాంతం వాయువ్య ప్రాంతం అంటే జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్. అంతకు ముందు అధ్యయనం జరిపిన ఎన్‌ఐడిఎం కాని, ఎన్‌ఆర్‌ఎస్‌ఎ కానీ కొన్నివిషయాలను స్పష్టం చేశాయి. ఈ ప్రాంతం కొండలు చాలా మెత్తటి మట్టి కలిగి ఎప్పుడైనా పడిపోవడానికి అవకాశముండే ప్రాంతం. అంతేకాకుండా, కొండల కాలం రీత్యా ఇవి చాలా కొత్తవి. అంటే బలమైన కొండలు కావు. అందువల్ల ఈ కొండల రక్షణ చాలా ముఖ్యం. దానితోపాటు నదుల ప్రవాహాల రక్షణ, పరీవాహక ప్రాంతాల నియంత్రణ కూడా చాలా ముఖ్యం. వర్షాలు అధికంగా కురిస్తే కొండచరియలు విరిగిపడడం సర్వసాధారణం.

అందుకే ఎక్కడ అయితే కొండచరియలు విరిగిపడే అవకాశముందో ఆ ప్రాంతంలో, ఆ సమయాలలో ప్రయాణాలు, మనుషుల ఉనికి ఉండకూడదు. ఇటువంటి ప్రాంతాలను ఎన్‌ఆర్‌ఎస్‌ఎ ఇప్పటికే స్పష్టంగా గుర్తించింది. అందువల్ల ఈ ప్రాంతాలలో ఆధునిక కట్టడాలు రాకూడదు. హోటళ్లు, ఇతర భవనాలు కట్టడం వల్ల అక్కడ భూమి ఉనికిలో మార్పులు వస్తాయి. అంతేకాకుండా అడవిని నరకడం వల్ల మట్టి మరింత కిందికి జారడానికి అవకాశం వస్తుంది. వీటన్నింటికీ తోడు ఇప్పటికే 45 పైగా జల విద్యుత్ కేంద్రాలు ఉత్తరాఖండ్‌లో పని చేస్తున్నాయి. దీని వల్ల కూడా మట్టిలో కదలికలు, భూమిలో ప్రకంపనలు వస్తాయి. దీనికి తోడు ఆధునిక సౌకర్యాల కోసం, రవాణా సౌకర్యాల కోసం ఎన్నో రోడ్లు వచ్చాయి. దీనితో కూడా పర్యావరణ మార్పులు వచ్చాయి. కొన్ని చోట్ల నదుల మార్గాలే మారిపోయాయి.

ఈ కారణాల రీత్యా 1970లో అలకానంద వరదలు, 1978 భగీరథ నది వరదలు, 1991లో ఉత్తరకాశి భూకంపం, 1998లో మల్స కొండచరియల విపత్తు, 1999లో ఛమోలి భూకంపం, 2003లో వరుణవత్ కొండచరియల ఘటన, 2009లో మున్షియాని కొండచరియల ప్రమాదం, 2012లో అసిగంగ, భగీరథ నదుల వరదలు. ఇట్లా ఎడతెగకుండా వరదలు, కొండచరియలు, భూకంపాలు వస్తూనే ఉన్నాయి. వేలాది మంది పొట్టన పెట్టుకుంటూనే ఉన్నాయి. ఇప్పటి వరకు సైన్స్ డెవెక్ట్ సంస్థ అంచనా ప్రకారం 60 వేల మంది మరణించారు. ప్రతి సంవత్సరం దాదాపు కోట్లాది మంది వరదలకు గురవుతున్నారు. ఈ ప్రమాదాల వల్ల దాదాపు 99 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగినట్టు సైన్స్ డెవెక్ట్ అంచనా వేసింది. అందుకే ధరాలి ఘటనను విడిగా చూడడానికి వీలు లేదు. ప్రభుత్వ విధానాలలో మార్పులు రానంత వరకు, అధ్యయన సంస్థలు, శాస్త్ర సాంకేతిక సంస్థల నివేదికను అమలు చేయనంత వరకు ధరాలి లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి.

  • మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News