ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR), 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ‘ఓటర్ చోరీ’ (ఓట్ల దొంగతనం) ఆరోపణలపై నిరసన వ్యక్తం చేస్తూ ఇండియా బ్లాక్ ఎంపీలు పార్లమెంట్ నుండి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఈ మార్చ్‌లో 25 ప్రతిపక్ష పార్టీల నుండి 300 మందికి పైగా ఎంపీలు పాల్గొన్నారు. అయితే, ఇండియా బ్లాక్ నాయకుల ర్యాలీకి అనుమతి లేదంటూ ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. భారీ కేడ్స్ ఏర్పాటు చేసి ర్యాలీని అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సంజయ్ రౌత్, సాగరికా ఘోష్ సహా భారత బ్లాక్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, గురువారం రాహుల్ గాంధీ.. బిజెపి, ఈసీ మధ్య కుమ్మక్కై కర్ణాటకలోని ఒక నియోజకవర్గంలో ఓట్ చోరీ చేశారని ఆరోపించారు. దీంతో ఎమైనా ఆధారాలు ఉంటే తమకు అందజేయాలని.. కానీ, తప్పుడు ఆరోపణలు చేయొద్దని ఈసి పేర్కొంది. ఈ క్రమంలో ఈసిని కలిసేందుకు పార్లమెంట్ నుంచి రాహుల్ నేతృత్వంలో ర్యాలీగా వెళ్లి ఈసిని కలిసేందుకు ఇండియా కూటమి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.