వికారాబాద్ జిల్లా, తాండూరులో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ విక్రయాలపై జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ విక్రయాల గుట్టు రట్టయింది. ఈ సందర్భంగా ఇద్దరు నిందితుల నుంచి పోలీసులు 196 కేజీల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను శుక్రవారం వికారాబాద్ జిల్లా ఎస్‌పి నారాయణరెడ్డి మీడియాకు తెలిపారు. జిల్లా ఎస్‌పి ఆదేశాల మేరకు గురువారం జిల్లా ట్కాస్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాష, బృందం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక మర్రిచెట్టు కూడలి సమీపంలోని మణికంఠ కిరాణాషాపులో యజమాని పోల వీరణ్ణ వద్ద కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ విక్రయాలను గుర్తించారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని పేస్ట్ ఎక్కడి నుంచి వస్తోందని విచారింగా హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఇమ్రాన్ సలీం అనే వ్యక్తి వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపాడు.
పోలీసులు అతనిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు.196 కేజీల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్టు డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. మణికంఠ కిరాణా యజమాని పి. వీరన్న వద్ద నుంచి 30 కిలోల నకిలీ అల్లం, -వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకోగా.. ఇందులో 500 గ్రాముల బాటిళ్లు 38, 200 గ్రాముల బాటిళ్లు 48, 100 గ్రాముల బాటిళ్లు 25 ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో ఇమ్రాన్ వద్ద సుమారు 166 కిలోల నకిలీ అల్లం, -వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 5 కిలోల బాటిళ్లు 32, 1 కిలో బాటిళ్లు 6 ఉన్నాయి. అదనంగా 30 కిలోల కల్తీ అల్లం రెండు బస్తాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రసాయనాలతో పేస్ట్ తయారీని అధికారులు స్వాధీనం చేసుకున్న అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను ఎలా కల్తీ చేశారో విచారించారు. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌లో హానికరమైన రసాయనాలు, కృత్రిమ రంగులు వాడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కల్తీ పేస్ట్‌ను ఆహార పదార్థాల్లో వాడడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు తెలిపారు.
పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి విచారణ నిమిత్తం తాండూరు పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ నకిలీ సరుకు ఎక్కడ తయారవుతోంది, దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనంతరం జిల్లా ఎస్‌పి నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో కల్తీ ఆహార ఉత్పత్తుల నివారణకు భవిష్యత్తులో కూడా దాడులు కొనసాగుతాయని, ఎవరైనా కల్తీ వ్యవహారాలకు పాల్పడితే చట్ట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: విషాదం: హీరోయిన సదాకు పితృవియోగం