Saturday, September 20, 2025

ప్రముఖ అస్సామీ గాయకుడు జుబిన్ గార్గ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ఇమ్రాన్ హష్మీ సినిమా ‘గ్యాంగ్‌స్టర్’ లోని ఫేమస్ సాంగ్ ‘ యా అలీ’ని ఆలపించి అశేష ప్రజాదరణ పొందిన ప్రముఖ అస్సామీ గాయకుడు జుబిన్ గార్గ్ ( 52 )శుక్రవారం తుదిశ్వాస విడిచారు. అసోంకు చెందిన ఈ ప్రముఖ గాయకుడు సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్సపొందుతూ మృతి చెందారు. ఆయన అకాల మరణంతో సంగీత ప్రపంచం, అభిమానుల్లో విషాదం నెలకొంది. జుబిన్ గార్గ్ మరణానికి దేశ వ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సింగపూర్‌లో జరిగిన నార్త్‌ఈస్ట్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వడానికి జుబిన్ వెళ్లిన ఆయన శుక్రవారం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించవలసి ఉండగా ఇంతలోనే ఆయన కన్నుమూయడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్కడ స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

వెంటనే సింగపూర్ పోలీసులు ఆయనను సముద్రం నుంచి రక్షించి, సమీపం లోని ఆస్పత్రికి తరలించారు. అత్యవసర వైద్యం అందినా ప్రాణాలు దక్కలేదు. సింగపూర్ జనరల్ ఆస్పత్రిలో ఐసియులో చికిత్సపొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మృతి చెందారు. జుబిన్ గార్గ్ అస్సామీ, బెంగాలీ, హిందీ, భాషలతోపాటు కన్నడ, నేపాలీ, ఒడియా, సింధి, సంస్కృతం ,ఖాసి, మణిపురి, ఇంగ్లీష్‌తో సహా మొత్తం 40కి పైగా భాషల్లో పాటలు పాడారు. ‘అనామిక’ మోనోర్ నిజనోత్, మాయా, మజులుర్ ఏజొని సువాలీ అనే అస్సామీ ఆల్బమ్ పాటలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. ఆయన నటుడు, రచయిత కూడా.

వ్యక్తిగత జీవితం ..
మేఘాలయ లోని తురాలో జుబిన్ గార్గ్ జన్మించారు. ఆయన తండ్రి మోహిని బోర్‌ఠాకూర్ ఒక మేజిస్ట్రేట్‌కాగా, తల్లి ఈలి బోర్ ఠాకూర్ ఒక గాయని. జుబిన్ సోదరి జోగ్కీ బోర్ ఠాకూర్ ఒక నటి. ఆమె 2002లో కారు ప్రమాదంలో మరణించారు. గార్గ్ 2002లో ఫ్యాషన్ డిజైనర్ గరిమా సైకియాను వివాహం చేసుకున్నారు. 1992 లో ప్రొఫెషనల్ సింగర్‌గా మారారు. తన మొదటి వెస్ట్రన్ సోలో ప్రదర్శనకు గోల్డ్ మెడల్ సాధించారు. 1992 లో తన మొదటి ఆల్బం ‘అనామిక’తో సంగీత ప్రపంచం లోకి అడుగుపెట్టారు. ఆయన మొదటి రికార్డెడ్ సాంగ్ ‘తుమి జును పారిబ హున్’.

సంతాపాల వెల్లువ
జుబిన్ గార్గ్ అకాల మరణానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రులు పబిత్ర మార్ఘెరిటా, సర్వానంద సోనోవాల్, కిరెన్ రిజ్జు, అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగొయ్ తీవ్ర సంతాపాలు తెలియజేశారు. అస్సాం మంత్రి అశోక్ సింఘాల్, సీనియర్ కాంగ్రెస్ నేత రిపున్ బొర, నటుడు అదిల్ హుస్సేన్ సంతాప సందేశాలు అందించారు.

Also Read: ‘ఓజీ’ ప్రీమియర్‌కు తెలంగాణ సర్కార్ అనుమతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News