Saturday, September 20, 2025

మైసూరు ‘దసరా’కు ముస్లిం అతిథి

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన మైసూరు దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను ప్రారంభించడానికి కన్నడ ముస్లిం రచయిత్రి, అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత బాను ముష్తాక్‌ను కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించడం హిందూ మతోన్మాద రాజకీయ నేతలకు నచ్చడం లేదు. దీనిపై లేనిపోని వివాదాలను బిజెపి రెచ్చగొడుతోంది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ ధర్మ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న అపవాదులను అంటగడుతోంది. ఇటీవల కర్ణాటక కోస్తా లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘ధర్మస్థలం’లో అనేక సంవత్సరాలుగా అత్యాచారం హత్యలకు గురైన వందలాది మంది మహిళల మృతదేహాలను ఖననం చేశారనే ఆరోపణలు దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.

దీనిపై సిట్ దర్యాప్తు సాగుతున్నప్పటికీ హిందూమత సంస్కృతి పైన, ఆ క్షేత్రం పైన తీవ్రమైన దాడిగా కాషాయనాథులు చిత్రీకరిస్తున్నారు.మైసూరు పాత రీజియన్‌లోని మద్దూరు టౌన్‌లో గణేశ్ నిమజ్జనం ఊరేగింపులో రెండు మత వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడానికి తోడయ్యింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న మైసూరు దసరా వేడుకలను ప్రారంభించడానికి కన్నడ ముస్లిం రచయిత్రి ముష్తాక్ సిద్ధం కావడం బిజెపి వర్గాల పుండుపై కారం చల్లినట్టు అవుతోంది. హిందూ సంప్రదాయ మూలాలున్న దసరా వేడుకలను ప్రారంభించే అర్హత ఆమెకు ఎక్కడుందని ప్రశ్నిస్తున్నాయి. ఆమె కుంకుమ, పసుపు ధరించి ప్రారంభ వేడుకలకు హాజరవుతారా? అని ఆమెను అడగాలనుకుంటున్నట్టు వాదిస్తోంది. గతంలో కన్నడ భాష సంస్కృతిపై ముష్తాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కన్నడ భాషను భువనేశ్వరీ దేవి స్వరూపంగా మతోన్మాదంతో ఎలా అనువర్తింప చేస్తారని ఆమె హిందూ సంప్రదాయ వాదులను సూటిగా ప్రశ్నించారు. 2023 లో జనసాహిత్య సమ్మేళన్‌లో ముష్తాక్ చేసిన ప్రసంగాలపై కన్నడ సాహిత్య సమ్మేళన్ నిరసన వ్యక్తం చేసింది. తమ ప్యానెల్ నుంచి ముస్లిం రచయితలను బహిష్కరించింది. ఇప్పుడు ఆ సంఘటనలన్నీ బిజెపి తెరపైకి తెస్తోంది. రచయిత్రి ముష్తాక్ కేవలం హిందూమతోన్మాదం పైనే కాదు, దక్షిణ భారతంలోని ముస్లిం సమాజాల్లోని మహిళలు ఎదుర్కొనే మత, సామాజిక, రాజకీయ వివక్ష, హింసను తూర్పారపడుతూ ‘హార్ట్‌ల్యాంప్’ పేరుతో 19902023 మధ్యకాలంలో కన్నడ భాషలో ఆమె రాసిన కథలు సంచలనం కలిగించాయి.

ఈ కథలకు అంతర్జాతీయ బుకర్‌ప్రైజ్ లభించింది. ఈ కథలను ఆంగ్లంలోకి అనువదించిన దక్షిణ కర్ణాటక రచయిత్రి దీపాభస్తికి కూడా అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ దక్కింది. మరి దీపాభస్తిని దసరా వేడుకలకు ఎందుకు పిలవలేదని కర్ణాటక ప్రభుత్వాన్ని బిజెపి ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యం లో మరింత లోతుకు వెళ్తే దసరా వేడుకలను ప్రారంభించడానికి ఆహ్వానం పొందిన మొదటి ముస్లిం ముష్తాక్ ఒక్కరే కాదు, 2017లో దివంగత రచయిత కెఎస్ నిస్సార్ అహ్మద్ అనే కన్నడ రచయిత ఆనాడు దసరా వేడుకలను ప్రారంభించారన్నది చారిత్రక వాస్తవం. అయితే ఇప్పుడు పనిగట్టుకుని ముష్తాక్‌పై బిజెపి తీవ్ర విమర్శల దాడికి కారణం కేవలం ఆమె మతం ఒక్కటే కాదు, సాహిత్యంలో ఆమె ప్రగతిశీల భావాలు, స్త్రీవాదం, మత రాజకీయాలపై ఆమె నిరసన గళం ఇవన్నీ బిజెపికి సింహస్వప్నంలా వెంటాడుతున్నాయి.

ముఖ్యం గా పితృస్వామ్య సంప్రదాయ ముసుగులకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న విమర్శలు బిజెపి చెవులకు శూలాల్లా గుచ్చుకుంటున్నాయి. మైసూరు దసరా వేడుకల్లో హిందూ సంప్రదాయ మూలాలు ఉన్నప్పటికీ కాలక్రమేణా అనేక మార్పులను సంతరించుకున్నాయి. 20 వ శతాబ్ది ప్రారంభంలోనే మైసూర్ వడయార్ రాజవంశ పాలన చివరి కాలం నుంచి వివిధ మతాల కళా సంస్కృతుల సమాహార వేదికలయ్యాయి. కర్ణాటక రాష్ట్ర అస్తిత్వ గుర్తింపు చిహ్నాలుగా, లౌకిక లక్షణాలతో మమేకం చేసే ప్రయత్నాలు జరిగాయి. ఆధునిక భావాలకు పట్టం కట్టిన నల్వాడి క్రిష్ణరాజ వడయార్ తన హయాంలో అనేక ప్రగతిశీల సంస్కరణలను తీసుకు వచ్చారు.

ఆనాడు దసరా వేడుకల్లో చివరి రోజు విజయదశమి పర్వదినాన ఏనుగుల అంబారీ స్వారీ ఊరేగింపులో తనకు అత్యంత నమ్మకస్తుడైన దివాన్ మీర్జా ఇస్మాయిల్‌ను తనతోపాటు పాలుపంచుకునే అవకాశం కల్పించారు. ఆనాడు దీనిని చాలా మంది వ్యతిరేకించినా దసరా వేడుకలు కేవలం ఒక మతానికే పరిమితం కాదన్న విశ్వజనీనతను వడయార్ నిరూపించారు. ప్రస్తుత వడయార్ రాజవంశస్థురాలు, మైసూరు రాజభవన సంప్రదాయ సంరక్షకురాలు ప్రమోద దేవి వడయార్ ఇప్పుడు బిజెపి లేవదీస్తున్న మత సంప్రదాయ దుమారంపై స్పందిస్తూ తమ రాజప్రాసాదంలో సంప్రదాయ పద్ధతిలోనే వేడుకలు నిర్వహిస్తున్నా అందరినీ కలుపుకుని వెళ్తామన్నారు.

మతపరమైన అంశానికి, లౌకిక పంథాకు మధ్య వ్యత్యాసాన్ని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే దసరా వేడుకలకు, తమ రాజకుటుంబం నిర్వహించే వేడుకలకు ఎక్కడా సంబంధం లేదని తేల్చిచెప్పారు. అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించే దసరా వేడుకలను ‘హిందూ వ్యతిరేకం’గా చిత్రించడానికి బిజెపి సర్వశక్తులూ ఒడ్డుతుండడం విచిత్రమే. ముస్లిం ఆస్తుల నిర్వహణకు సంబంధించిన వక్ఫ్ బోర్డులో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకు వచ్చింది. వక్ఫ్ బోర్డు సభ్యుల్లో ముస్లింలే కాకుండా ఇతర హిందూ సభ్యులకు కూడా చోటు కల్పించింది. అలాంటప్పుడు దసరా వేడుకల్లో ముస్లింలు కూడా పాలుపంచుకునేలా అవకాశం కల్పించడంలో తప్పేమిటి? అన్న ప్రశ్న ఎదురవుతోంది.

Also Read : ఫిరాయింపు ఎంఎల్‌ఎలకు మళ్లీ నోటీసులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News