2 లక్షల 37 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
మన తెలంగాణ/నాగర్ కర్నూల్ ప్రతినిధి: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో రెండు లక్షల 37 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులో చేరడంతో 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ వైపుకు 2 లక్షల 2 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 65 వేల క్యూసెక్కుల నీటితో పాటు మొత్తం సాగర్ వైపుకు మొత్తం 2లక్షల75 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నది పొంగి ప్రవహిస్తోంది. కృష్ణా నది నుంచి జూరాలకు 2 లక్షల ఇరవై వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది.
Also Read: తెలంగాణ పూలసింగిడి బతుకమ్మ
జూరాల 29 గేట్లను ఎత్తి శ్రీశైలం వైపుకు రెండు లక్షల పైచిలుకు క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 24 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. సుంకేసుల బ్యారేజ్ కి తుంగభద్రా నది నుంచి పదివేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో రెండు గేటును ఎత్తి 6 వేల700 క్యూసెక్కులను వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి ఈ ఏడాది మే మాసం నుంచి ఇప్పటివరకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో నిరంతరాయంగా హెచ్చు తగ్గుల మధ్య శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.