అమరావతి: సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నయినా చేయవచ్చునని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సరైన సమయంలో సరైన నాయకుడు దేశానికి వచ్చారని అన్నారు. విశాఖ పట్నంలో 28- ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సును బాబు ప్రారంభించడంతో పాటు డిజిటల్ ఎపి సంచికను ఆవిష్కరించారు. విశాఖ వేదికగా ఈ- గవర్నెన్స్ జాతీయ సదస్సును కేంద్ర ఎలక్ట్రానిక్స్, సంచార సాంకేతిక మంత్రిత్వశాఖ, ఎపి ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనుంది. సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ ’ థీమ్ తో సదస్సు, ఎఐ, సైబర్ సెక్యూరిటీ, పౌరసేవలు, అగ్రి-స్టాక్ వంటి అంశాలపై నిపుణులతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా విశాఖలో సిఎం ప్రసంగించారు. ప్రజలకు మేలు జరిగే నూతన సంస్కరణలు తీసుకొచ్చారని, సాంకేతికతకు అనుగుణంగా మనమూ మారాల్సిన పరిస్థితి ఉందని తెలియజేశారు. ఇవాళ ప్రజలకు అన్ని సేవలు ఆన్ లైన్ లోనే అందుబాటులోకి వచ్చాయని, పోటీ ప్రపంచంలో వినూత్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయని అన్నారు.
Also Read : రూ.15 వేల కోట్ల భూమి సేఫ్
ఐటి రంగంలో భారతీయులకు చాలా నైపుణ్యం ఉందని, నాలెడ్జ్ ఎకానమీకి ఆనాడు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే హైదరాబాద్ కు మేలు జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రముఖంగా మారిన పరిస్థితి అని ఇవాళ ప్రపంచంలో ఎక్కడ చూసిన భారతీయులే ఉన్నారని, ఐటి సంస్థల్లో పనిచేస్తున్న భారతీయుల్లో దాదాపు 30 శాతం ఎపి వారేనని అన్నారు. ప్రపంచంలోని నలుగురి ఐటి నిపుణుల్లో ఒకరు భారత్ కు చెందినవారు అని, ఐటి నిపుణులు ప్రతి నలుగురిలో ఒకరు ఎపికి చెందినవారే కావడం విశేషం అని ప్రశంసించారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని లక్ష్యంతో పనిచేస్తన్నాం అని సాంకేతికత, మౌలిక సదుపాయాల కల్పనతో రూపురేఖలు మారాయని చంద్రబాబు స్పష్టం చేశారు.