- Advertisement -
హైదరాబాద్: కృష్ణా జలాల వాటాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఒక మాట, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిది మరో మాట అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పూట పూటకో మాట, ఘడియ ఘడియకో లెక్క చెబుతున్నారని దుయ్యబట్టారు.
కృష్ణ జలాల్లో 299 టిఎంసిల వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని చురకలంటించారు. కృష్ణా జలాల్లో వాటా విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్లా పాత పాటే పాడిండని, ఉత్తర కుమార ప్రగల్భాలే పలికిండని, బేసిన్ల గురించి బేసిక్స్ కూడా తెయదని చురకలంటించారు. నీళ్ల వాటా గురించి అడిగితే నీళ్లు నములుతారని, కనీస అవగాహన లేని, తెలంగాణ సోయి లేని ఇట్లాంటి దద్దమ్మలు మనకు ముఖ్యమంత్రి, నీళ్ల మంత్రి కావడం మన దౌర్భాగ్యమన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఏం మాట్లాడారని అడిగారు. కృష్ణా జలాల్లో 763 టిఎంసిలు ఇవ్వాలని డిమాండ్ చేశామని అని గొప్పగా చెప్పారని, రైట్ షేర్ కోసం తానే స్వయంగా ట్రిబ్యునల్ ముందు అటెండ్ అయినట్లు చెప్పుకున్నారని చురకలంటించారు. హరీష్ రావు తన సోషల్ మీడియా ఖాతా పోస్టులో చేశారు.
Also Read: స్థానిక సమరం… రిజర్వేషన్లు ఖరారు?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18.06.2025 రోజున కృష్ణా బేసిన్ మీద 500 టిఎంసిలకు బ్లాంకెట్ ఎన్ ఓసి ఇచ్చిన తరువాత ఏ ప్రాజెక్టులైన కట్టుకోండి అని ఎపి సిఎం చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చారని దుయ్యబట్టారు. మొన్న సెప్టెంబర్ 13న జరిగిన నీటి పారుదల శాఖ సమీక్షలో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా జలాల్లో 904 టిఎంసిల వాటా సాధించి తీరాలని అంటున్నారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి 763 టిఎంసిల రైట్ షేర్ అంటున్నారని, ముఖ్యమంత్రి ఏమో ఓ సారి 500 టిఎంసిలు అంటున్నారని, మరోసారి 904 టిఎంసిలు అంటున్నారన్నారు. రేవంత్, ఉత్తమ్ అజ్ఞానంతో తెలంగాణ రాష్ట్రం హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోయే పరిస్థితి దాపురించిందన్నారు. ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా? నీళ్ల మంత్రి చెప్పింది కరెక్టా? అసలు ఎవరిది కరెక్టు? అని అడిగారు. కనీస అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నరని, కనీసం ప్రిపరేషన్ లేకుండా ఇలా ఎన్నాళ్లు ఉంటారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కృష్ణా జలాల్లో రైట్ ఫుల్ షేర్ సాధించేందుకు సెక్షన్ 3 కోసం పోరాటం చేసారని, అప్పటి కేంద్ర మంత్రులు ఉమా భారతి, గడ్కరీ, షకావత్, ప్రధాని మోడీలను కలిశారని, సుప్రీం కోర్టు గడప తొక్కి నిర్విరామ పోరాటం చేసి సెక్షన్ 3 సాధించారని, 763 టిఎంసిలు అనేది కెసిఆర్ పట్టుబట్టిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు.
ఒక బాధ్యత లేదు, రాష్ట్రం మీద ప్రేమ లేదు, నీటి ప్రయోజనాల మీద పట్టింపు లేదు, ద్రోహం చేసినోల్లే సుద్దులు చెబుతున్నారని దుయ్యబట్టారు. 299:512 ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పుడు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని,
512:299 నీటి వాటాను బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిందని కాంగ్రెసోళ్లు చెప్పడంతో పాటు చారిత్రక అన్యాయాన్ని సరి చేస్తున్నామనడం సిగ్గుచేటు అని హరీష్ రావు అన్నారు. ఛీ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు అని, ముఖ్యమంత్రి అంతే, నీళ్ల మంత్రి కూడా అంతే. 299:512 హక్కుల విషయంలో తాము సంతకం పెట్టినట్టు నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తావా? అని సవాల్ విసిరారు. కృష్ణా జిలాల్లో 299:512 వాటా ఇచ్చి తెలంగాణ తీరని చారిత్రక ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, 2013లో ఉమ్మడి ఎపి జస్టిస్ శ్రీ కృష్ణ కమిటికి రిపోర్టు ఇచ్చిందని, ఇదే రిపోర్టును శాసనసభలోనూ పెట్టారని, తెలంగాణకు కృష్ణాలో 299, ఎపికి 512 ఇచ్చినం అని అందులో క్లియర్ గా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రాంత హక్కులకు ఉమ్మడి రాష్ట్రంలోనే మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకుల చేతగాని తనం, అడుగులకు మడుగులొత్తడం వల్ల 299 వాటా పరిమితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్ హక్ కు, ఫైనల్ అవార్డుకు తేడా తెలియని తెలివితక్కువ వారు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ అని హరీష్ రావు మండిపడ్డారు.
‘ఈ విషయంలో చారిత్రక తప్పిదం చేసింది మీరు కాదా? అని, తెలంగాణ సాగు నీటి రంగం చరిత్రలో ద్రోహులు మీరే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మక్క సాగర్ పూర్తి చేసింది బిఆర్ఎస్ అని, డబ్బా ప్రచారం చేసుకుంటున్నది కాంగ్రెస్ అని, చంద్రబాబుకు భయపడి బనకచర్లపై మౌనం ఎందుకు అని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆల్మట్టి ఎత్తు పెంపుపై మౌనం ఎందుకు అని నిలదీశారు. సిఎం రేవంత్ రెడ్డికి సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే, పక్క రాష్ట్ర ప్రయోజనలే ఎక్కువ? అని హరీష్ రావు ధ్వజమెత్తారు.
సమ్మక్క సారక్క బ్యారేజ్ కు మంత్రి ఉత్తమ్ అనుమతులు సాధించినట్టు చెప్పుకుంటున్నారని, కొండను తవ్వి ఎలుకను ఉత్తమ్ కూమార్ పట్టుకున్నారని, ఛత్తీస్ ఘడ్ తో కేవలం యాభై ఎకరాల ముంపునకు సంబంధించి సూత్రప్రాయ అంగీకారం కుదిరితే ఏవో గొప్పలు సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారని, కాంగ్రెస్ చేసిన తప్పులను సరిదిద్ది దేవాదులను పటిష్టం చేసేందుకు ఏడు టిఎంసిల సామర్థ్యంతో సమ్మక్క సారక్క బ్యారేజ్ ను కెసిఆర్ నిర్మించారని, 83 మీటర్లకు డిపిఆర్ పంపామని, అన్ని డైరెక్టరేట్ల నుంచి అన్ని రకాల అనుమతులు సాధించామరి, బ్యారేజీ కట్టినామని, నీటిని కూడా లిఫ్టు చేసుకుంటున్నామని,
సమ్మక్క బ్యారేజ్ కు ఛత్తీస్ ఘడ్ నుంచి ఒక్క ఎన్ఓసి మినహా అన్ని అనుమతులు బిఆర్ఎస్ హయాంలోనే వచ్చాయని,
ప్రాజెక్టులకు అనుమతులు ఆపడంలో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ సమ్మక్క సాగర్ విషయంలోనూ అదే చేసిందని దుయ్యబట్టారు.
2023 ఎన్నికల వేళ ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ఇక్కడి కాంగ్రెస్ నాయకులు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్ఒసి రాకుండా చేశారని, ఇప్పుడు అక్కడున్న బిజెపి ప్రభుత్వంతో దోస్తీ కట్టి 50 ఎకరాలకు సూత్రప్రాయ అంగీకారం తీసుకొచ్చారని, మొత్తం ప్రాజెక్టునే కట్టినట్లు బిల్డప్ ఇస్తున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. 50 ఎకరాలపై ఒప్పందం చేసుకుంటేనే కాంగ్రెస్ ఇంత ప్రచారం చేసుకుంటే ఎన్నో ప్రాజెక్టులు ఎంతో కస్టపడి సాధించిన కెసిఆర్ ఎంత ప్రచారం చేసుకోవాలన్నారు. సమ్మక సాగర్ విషయంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, డబ్బా ప్రచారం చేసుకుంటున్నారని, ఆల్మట్టి హైట్ పెంపుపై ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్ కలిసి చేస్తున్న ద్రోహం ఇది అని, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి, బిహార్ కు వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని చురకలంటించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని కర్ణాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తున్నారని హరీష్ రావు నిలదీశారు.
కేవలం 100 టిఎంసిల కోసమే ఆల్మట్టి ఎత్తు పెంచడం లేదని, కృష్ణా జలాల్లోని తెలంగాణ హక్కును బొందపెట్టి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డిలను ఎడారులుగా మార్చేందుకు కర్నాటక కాంగ్రెస్ పన్నుతున్న కుట్ర ఇది అని మండిపడ్డారు. అక్కడా కాంగ్రెస్సే, ఇక్కడా కాంగ్రెస్సే అయినా మాట్లాడే దమ్ము తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. తెలంగాణ రైతుల పొట్టగొడుతుంటే ఆపే ధైర్యం లేదా? అని, జాతీయ పార్టీకి జాతీయ విధానమే లేదని, కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి రైతులను బలిస్తారా? అని అడిగారు. బనకచర్ల రూపంలో కృష్ణా నీళ్లను ఎపి కొల్లగొడితే మౌనం వహించారని, ఇప్పుడు కర్ణాటక కొల్లగొడుతుంటే కూడా మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు చురకలంటించారు.
- Advertisement -