ఎఐ మార్ఫ్‌డ్ ఫోటోలతో తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత ఇమేజ్ అడ్డం పెట్టుకుని బిజినెస్ చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కోర్టు ఆయనకు రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇస్తామని వెల్లడించింది. తన ఇమేజ్ వాడుకుంటూ కొందరు ఎఐ మార్ఫ్‌డ్ ఫోటోస్, వీడియోలు క్రియేట్ చేసుకుని డబ్బులు చేసుకుంటున్నారని హీరో నాగార్జున తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ’యాక్టర్‌గా ఇప్పటికే ఆన్ లైన్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలను ఎఐ ద్వారా మార్ఫింగ్ చేసి నా ప్రతిష్టను దిగజారుస్తున్నారు. అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ దాని ఆధారంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది ఏఐ జనరేటెడ్ కంటెంట్‌గా యూట్యూబ్‌లో వీడియోలో అప్లోడ్ చేశారు.
సదరు వీడియోలు ప్రమోషన్లుగా వాడుతున్నారు. నా హ్యాష్ ట్యాగ్‌తోనే వీటిని మార్కెటింగ్ చేశారు. ఇండస్ట్రీలో నాకున్న ఇమేజ్‌ను ఇలా తప్పుడు మార్గంలో ఉపయోగించి నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తున్నారు. ఇలా అనుమతి లేని ఫోటోస్, కంటెంట్‌తో నా ఇమేజ్ ప్రమాదంలో పడింది.’ అంటూ పిటిషన్‌లో వెల్లడించారు. నాగార్జున తరఫు లాయర్ వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రక్షణ కల్పిస్తామని వెల్లడించింది. ప్రస్తుతం ఎఐ వచ్చిన తర్వాత పెద్ద సమస్యగా తయారైందని జస్టిస్ తేజస్ కరియా అన్నారు. అయితే, గతంలో పలువురు సినీ ప్రముఖులు సైతం ఇదే అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, అనిల్ కపూర్, కరణ్ జోహార్ వంటి వారు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.