Friday, September 26, 2025

పండుగ తరువాత కెటిఆర్ అరెస్టు!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కెటిఆర్ అరెస్ట్ తప్పదని, పండుగ తర్వాత అరెస్టు ఉండే అవకాశం ఉందని పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేసి కెసిఆర్, కెటిఆర్‌లు ఎన్నికల్లో గెలిచారని ఆయన విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం ఏఐసిసి పరిధిలో ఉందని సరైన సమయంలో సరైన నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని పిసిసి అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు.

అభ్యర్థుల ఎంపిక గురించి సర్వేలు చేస్తున్నామని, సర్వేలో ఎవరు ముందుంటే వారికే సీటు ఇస్తామని ఆయన అన్నారు. స్థానికులకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్నారు. సిఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, నవీన్ యాదవ్, బొంతు రాంమ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ తో సహా పలువురు టికెట్ ఆశిస్తున్నారని, జూబ్లీహిల్స్‌లో సామాజికవర్గం కాకుండా గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్నామని ఆయన తెలిపారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని ఆయన అన్నారు. డిసిసిల అంశంపై సమావేశంపై రాహుల్ గాంధీతో మీటింగ్ ఉంటుందని, ఈ సమావేశానికి ఏఐసిసి కొత్తగా ఎంపిక చేసిన 22 మంది అబ్జర్వర్లు హాజరవుతారని ఆయన చెప్పారు. అక్టోబర్ 4వ తేదీన 22 మంది అబ్జర్వర్లు తెలంగాణలో పర్యటిస్తారని పిసిసి అధ్యక్షుడు వెల్లడించారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చట్టబద్దంగా పోతున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చట్టబద్దంగా పోతున్నామని, చాలామంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని, వాళ్లు ఓడిపోతారని తెలిసి రెండు రోజుల ముందు అన్ని ఆధారాలు ధ్వంసం చేశారని పిసిసి అధ్యక్షుడు ఆరోపించారు. ఎన్నికలకు ముందు 14 రోజుల ఫోన్ ట్యాపింగ్ రికార్డు మాత్రమే తమ దగ్గర ఉందని ఆయన అన్నారు. వాళ్ల గవర్నమెంట్ పడిపోయాక టెలికాం సంస్థలు ఫోన్ రికార్డింగ్ వివరాలను ప్రభుత్వానికి ఇచ్చారని, అలా వాళ్లు దొరికి పోయారని పిసిసి అధ్యక్షుడు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద కేసు అని, అందరి వాయిస్ లను రికార్డు చేశారని, తనది, రేవంత్ రెడ్డిది రెండున్నర ఏళ్ల నుంచి గత ప్రభుత్వం రికార్డు చేసిందని ఆయన తెలిపారు. తాను వాడిన జియో సిమ్ కార్డు నెంబర్ జియోసంస్థకు గత ప్రభుత్వం ఇచ్చింది, జియో సంస్థకు రాసిన లేఖ కూడా దొరికిందని పిసిసి అధ్యక్షుడు తెలిపారు.

రెండు రోజుల్లో బిసి రిజర్వేషన్ల జిఓ
బిసి రిజర్వేషన్ల జిఓ రెండు రోజుల్లో వస్తుందని, బిసి రిజర్వేషన్ల అంశంపై మరోసారి ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఏడాది కాలంలో ఎంతో పని చేశామని ఆయన తెలిపారు. గాంధీ భవన్‌లో మంత్రుల ముఖాముఖీ కార్యక్రమం బాగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్లపై బిజెపికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. కాళేశ్వరం విషయంలో సిబిఐ విచారణ విషయంలో బిజెపికి చిత్త శుద్ధి లేదన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో జరిగిన అన్ని అవినీతి ప్రాజెక్టులపై సిబిఐ విచారణ జరిపితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 48 గంటల్లో విచారణ చేస్తామని కిషన్ రెడ్డి అన్నారని, ఇప్పటివరకు దాని గురించి ఆయన మాట్లాడడం లేదన్నారు.

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైన
సిబిఐ విచారణ జరపాలి
రేవంత్ రెడ్డిది రెడ్డి సామాజికవర్గం అయినప్పటికీ బిసిల కొరకు గొప్ప నిర్ణయం తీసుకున్నారని పిసిసి అధ్యక్షుడు తెలిపారు. రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా, సిఎంగా చూశానని ఆయనలో మార్పు ఏమీ లేదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సిఎంగా ఉంటారని ఆయన తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల గెలుపులో రేవంత్ రెడ్డి పాత్ర ఉందని, బిసి రిజర్వేషన్లపై బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఒక్కరోజులో బిసి బిల్లుకు కేంద్ర ఆమోదం తెలపవచ్చని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైన సిబిఐ విచారణ జరిపితే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్‌తో కవితకు ఏం సంబంధం
కవితది ఆస్తుల పంచాయితీ ఉందని, కాంగ్రెస్‌తో కవితకు ఏం సంబంధం ఉందని ఆయన ప్రశ్నించారు. కవితకు ప్రజల్లో ఏం ఇమేజ్ ఉందని ఆయన అన్నారు. దోపిడీ చేసిన వారిని ప్రజలు ఎందుకు ఆదరిస్తారని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ పార్టీ నాలుగు ముక్కలు అయ్యిందని, బిఆర్‌ఎస్ మళ్లీ పునర్జీవం పోసుకోదని ఆయన అన్నారు. ఏంచూసి బిఆర్‌ఎస్ ను ప్రజలు ఆదరిస్తారని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారని ఆయన ఆరోపించారు.

పిసిసి పాదయాత్రపై ఢిల్లీలోనే నిర్ణయం
పిసిసి పాదయాత్ర గురించి సిఎం రేవంత్ రెడ్డికి, ఇంచార్జ్‌కి తెలియకుండా చేశారని కొందరు గతంలో ఆరోపణలు చేశారని, కానీ, ఢిల్లీలో అందరి సమక్షంలోనే ఈ పాదయాత్రపై నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. హైడ్రాతో సామాన్యుడికి ఇబ్బంది లేదని, కబ్జా చేసిన వారికే హైడ్రాతో ఇబ్బందులు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ భూమి పోకుండా ఉండేలా హైడ్రా పని చేస్తుందన్నారు.

Also Read: ఆర్‌టిసి బస్సెక్కితే బహుమతులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News