Thursday, May 2, 2024

వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్‌లపై సమగ్ర నివేదిక

- Advertisement -
- Advertisement -

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

మన తెలంగాణ / హైదరాబాద్ : వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, సహకార శాఖల అనుబంధ కార్పొరేషన్‌ల పనితీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఆయా కార్పొరేషన్‌ల పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భముగా మంత్రి మాట్లాడుతూ కొన్ని కార్పొరేషన్‌ల పనితీరు సంతృప్తికరంగా లేదని అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో వివిధ కార్పొరేషన్‌ల పనితీరు, అమలు చేసిన నిర్ణయాల వల్ల సంస్థకు చేకూరిన ప్రయోజనం, ఒక వేళ సంస్థకు ఆ నిర్ణయాల వల్ల నష్టం చేకూరితే దానికి సంబంధించిన బాధ్యులు ఎవరు?, అవసరమైతే ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి సంస్థకు, రైతులకు మేలు చేకూర్చే విధంగా సూచనలు ఇవ్వవల్సిందిగా కార్యదర్శి ఎం.రఘునందన్ రావును కోరారు.

కొన్ని సంస్థలు తీసుకొన్న నిర్ణయాలు రైతులకు మేలు కల్గించకపోగా ప్రయివేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయని తుమ్మల అన్నారు. కార్పొరేషన్ల వారీగా ఐఎఎస్ అధికారులను విచారణ అధికారులుగా నియమించి, సంబంధిత కార్పొరేషన్‌ల నిర్వహణ పై 10 రోజుల్లోగా సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశానుసారం కార్యదర్శి రఘునందన్‌రావు సంస్థల వారీగా విచారణ అధికారులును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమితి, తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ దృవీకరణ అథారిటీ, తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్, హైదరాబాద్ అగ్రికల్చర్ కో-అపరేటివ్ అసోసియేషన్, సంస్థలకు డైరెక్టర్ అగ్రికల్చర్‌ను విచారణాధికారిగా నియమించారు.

తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేషన్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్, తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ది కార్పొరేషన్, తెలంగాణ రాష్ట్ర కో-అపరేటివ్ రూరల్ ఇరరిగేషన్ కార్పొరేషన్, తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేషన్ యూనియన్, తెలంగాణ రాష్ట్ర కో- అపరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్ సంస్థలకు విచారణాధికారిగా డైరెక్టర్ కొ ఆపరేషన్ తెలంగాణ రాష్ట్ర హార్టీకల్చర్ అభివృద్ది కార్పొరేషన్ సంస్థకు విచారణాధికారిగా డైరెక్టర్ హార్టీకల్చర్‌ను నియమించారు. పై సంస్థలతో పాటు గత ఐదు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర కో-అపరేటివ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ నిర్వహణ తీరు పై ఎపిసి, సెక్రటరి స్వయంగా నివేదిక సమర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కేశవులు మీద వచ్చిన ఆరోపణల పై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తూ అతనిని భాద్యతల నుండి తప్పిస్తూ ఆ స్థానంలో ఐఎఎస్ అధికారి హరిత కు అదనపు భాద్యతలు అప్పగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News