Sunday, April 28, 2024

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ మోసం

- Advertisement -
- Advertisement -

రూ.23 వేల కోట్ల ఎబిజి లోన్ స్కామ్
ఈ కుంభకోణం గురించి పూర్తి వివరాలు

న్యూఢిల్లీ : విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారవేత్త నీరవ్ మోడీ స్కామ్ రూ.13 వేల కోట్లు అనేది అందరికీ తెలుసు. కానీ అంతకంటే పెద్ద మోసం ఎబిజి షిప్‌యార్డ్‌లో వెలుగుచూసింది. ఈ సంస్థపై ఎస్‌బిఐ దాఖలు చేసిన ఫిర్యాదుతో, ఈ కుంభకోణం గురించి ఒక్కొక్క విషయం బయటపడుతోంది. ఇది ఏకంగా రూ.23 వేల కోట్ల అతిపెద్ద బ్యాంకు రుణం మోసం, అయితే ఈ మోసం ఏమిటి? అసలు ఆ సంస్థ వ్యాపారం ఏమిటి? వంటి విరాలను తెలుసుకుందాం. గుజరాత్‌కు చెందిన ఎబిజి షిప్‌యార్డ్ ఒకప్పుడు షిప్‌బిల్డింగ్‌లో పవర్‌హౌస్‌గా ఎంతో పేరుగాంచిన సంస్థ. అయితే ఇప్పుడు అది దేశంలోనే ‘అతిపెద్ద బ్యాంక్ మోసం’ ఆరోపణలు ఎదుర్కొంటోంది. 2020 ఆగస్టు 25న ఈ కుంభకోణంపై ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) సిబిఐకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సిబిఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) 2022 ఫిబ్రవరి 7న రుణ కుంభకోణం కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్‌లతో సహా 28 బ్యాంకుల కన్సార్టియంకు రూ.22,842 కోట్ల నష్టం కలిగించినందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ చర్యలు చేపట్టింది. ఎబిజి షిప్‌యార్డ్, దాని డైరెక్టర్లు, ఎబిజి ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సిబిఐ కేసు నమోదు చేసింది.

ఈ మోసం దేనికి సంబంధించినది?

ఎబిజి గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ ఎబిజి షిప్‌యార్డ్ లిమిటెడ్‌ను 1985 సంవత్సరంలో స్థాపించారు. 28 బ్యాంకులకు (ఎస్‌బిఐ నేతృత్వంలోని కన్సార్టియం) దాదాపు రూ. 22,842 మోసం చేసినట్టు ఈ సంస్థ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటోంది. సిబిఐ ప్రకారం, షిప్‌బిల్డింగ్ సంస్థ 2005 నుంచి రుణాలు పొందింది, కానీ బకాయిలు చెల్లించడంలో ఈ సంస్థ విఫలమైంది. దీంతో 2013లో ఖాతా ఎజిబి ఎన్‌పిఎగా మారింది. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి కంపెనీ భారీగా దెబ్బతినగా, ఆఖరికి మొండి బకాయి లేదా ఎన్‌పిఎగా మారింది. ఇదలా ఉంటే ఈ సంస్థ తన నిధులను ఇతర సంబంధిత కంపెనీలకు మళ్లిస్తూ వచ్చింది. విదేశీ అనుబంధ సంస్థల ద్వారా పెట్టుబడుల కోసం రుణాలను ఉపయోగించినట్లు కూడా వెలుగులోకి వచ్చింది. 2014 మార్చిలో కార్పొరేట్ రుణ పునర్నిర్మాణం కింద ఎబిజి షిప్‌యార్డ్‌కు చెందిన రుణాలను పునరుద్ధరణకు ఎస్‌బిఐ ప్రయత్నించగా, అది చివరికి విఫలమైంది. రెండు సంవత్సరాల తర్వాత 2016 జూలైలో ఎబిజి ఖాతాను మొండి బకాయి లేదా ఎన్‌పిఎగా నిర్ధారించారు. 2019 జనవరిలో ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ ఒక మోసాన్ని గుర్తించగా, ఈ సంవత్సరం నవంబర్ నెలలో ఫిర్యాదు చేసింది. బ్యాంకుల కన్సార్టియంలో ప్రధాన రుణదాత ఐసిఐసిఐ బ్యాంక్‌గా ఉన్నప్పటికీ, అతిపెద్ద పిఎస్‌బి రుణదాత హోదాలో ఎస్‌బిఐ ఈ ఫిర్యాదు దాఖలు చేసింది. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సిబిఐ 2022 ఫిబ్రవరి 7న కేసు నమోదు చేసింది. ఇక 2022 ఫిబ్రవరి 15న ప్రమోటర్ రిషి అగర్వాల్, ఎబిజి ఎగ్జిక్యూటివ్‌లు సంతానం ముత్తుస్వామి, అశ్విని కుమార్‌లపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసింది.

ఏ బ్యాంకుకు ఎంత బకాయి?

28 బ్యాంకులకు రూ. 22,842 మోసం చేసినట్టు గుర్తించారు. అయితే వీటిలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ ఎస్‌బిఐకి రూ.2,925 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంక్‌కు రూ.7,089 కోట్లు, ఐడిబిఐ బ్యాంక్‌కు రూ.3,634 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.1,614 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.1,244, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ.1,228 కోట్లు బకాయిపడినట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని ఎస్‌బిఐ తన ఫిర్యాదులో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News