అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎసిబి వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్‌సి సబ్బవరపు శ్రీనివాస్ రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేశాడు. రూ.25 లక్షల టోకెన్ నగదు తీసుకుంటుండగా ఎసిబికి శ్రీనివాస్ చిక్కాడు. ఎసిబి చరిత్రలో ఇదే అతిపెద్ద ట్రాప్ అని అధికారులు వెల్లడించారు. మరో మూడు వారాల్లో అతడు పదవీ విరమణ చేయాల్సి ఉండగా లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. గిరిజన ప్రాంతాల్లో నిర్మించే ఏకలవ్య పాఠశాలల కాంట్రాక్టును సత్యసాయి కంస్ట్రక్షన్ అధినేత కృష్ణంరాజు దక్కించుకున్నాడు. కృష్ణంరాజుకు ప్రభుత్వం నుండి వచ్చే రూ.35.5 కోట్ల బిల్లు విడుదల కోసం శ్రీనివాస్ రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. దీంతో విశాఖపట్నం, విజయవాడ ఎసిబి అధికారులను కృష్ణంరాజు కలిశాడు. శ్రీనివాస్ కు 25 లక్షల రూపాయలు కృష్ణంరాజు ఇస్తుండగా ఎసిబి అధికారులు అతడిని పట్టుకున్నారు.
- Advertisement -