Thursday, May 2, 2024

చిల్లర కోసం హత్యలు

- Advertisement -
- Advertisement -

Accused of killing for money in Hyderabad

హైదరాబాద్‌లో డబ్బుల కోసం హత్య చేసిన నిందితులు
మద్యం కోసం ఎంతకైనా తెగిస్తున్న మందుబాబులు
బలవుతున్న అమాయకులు

హైదరాబాద్: మద్యం తాగేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు, మందుబాబులు. తమ వద్ద మద్యం తాగేందుకు డబ్బులు కేకపోవడంతో డబ్బుల కోసం అమాయకులను హత్య చేసి వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు అమాయకులను మందుబాబులు డబ్బుల కోసం హత్య చేసి డబ్బులు తీసుకున్నారు. హత్య చేసిన నిందితులు బాధితుల నుంచి డబ్బులు తీసుకుని మద్యం తాగి ఎంజాయ్ చేశారు. వీరికి ఎలాంటి పశ్చాతాపం లేకపోవడమే కాకుండా తమకు సమయానికి మద్యం దొరికిందని ఆనందిస్తున్నారు. వీరి చేతిలో హత్యకు గురైన బాధితుల ఆచూకీ ఇప్పటి వరకు తెలియడంలేదు. సికింద్రాబాద్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యలో కేవలం బాధితుడి వద్ద రూ.500 చూసి వాటి కోసం వెంటపడ్డారు. నిందితులు నలుగురికి బాధితుడు రూ.500 ఇచ్చేందుకు నిరకరించడంతో తమ వెంట ఉన్న వాటిసాయంతో పొడిచి చంపివేశారు. అతడి వద్ద ఉన్న రూ.6,000 తీసుకుని నలుగురు నిందితులు మద్యం కొనుగోలు చేసి ఎంజాయ్ చేశారు.

వీరి చేతిలో హత్యకు గురైన నిందితుడి ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. మరో కేసులో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తిని రూ.169లకు హత్య చేశారు. ఇద్దరు యువకులు మద్యం తాగినతర్వాత స్నేహితులయ్యారు. ఇద్దరు సమీపంలోని బ్రాండీ షాపు నుంచి మద్యం కొనుగోలు చేసి తెచ్చుకుని తాగారు. తర్వాత లక్డీకాపూల్‌లోని బస్టాప్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న వ్యక్తిని లేపారు. అతడి వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలని కోరారు. దానికి బాధితుడు నిరాకరించడంతో మద్యం మత్తులో ఉన్న నిందితులు తవ వద్ద ఉన్న కత్తితో గొంతు కోసి అతడి వద్ద ఉన్న రూ.169 తీసుకుని పారిపోయారు. వాటితో మద్యం కొనుగోలు చేసి తాగారు. ఇలా మద్యానికి బానిసలుగా మారిన నిందితులు మద్యం కోసం డబ్బులు లేకపోవడంతో ఎంతకైనా తెగిస్తున్నారు. అమాయకులను డబ్బుల కోసం హత్య చేసేందుకు కూడా వెనుకాడడంలేదు. రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు గతంలో నేరాలు చేయడంతో జైలుకు వెళ్లివచ్చినవారే ఉన్నారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా వారిలో ఎలాంటి మార్పు రాకుండా మళ్లీ నేరాలు చేస్తున్నారు.

ఫుట్‌పాత్ నివాసం….
మద్యం కోసం హత్యలు చేస్తున్న నిందితులు ఫుట్‌పాత్‌పైనే నివసిస్తున్నారు. పగటి సమయంలో పలు హోటళ్లలో పనిచేసి డబ్బులు తీసుకుంటున్నారు. ఆ డబ్బులు వారికి మద్యం తాగేందుకు సరిపోకపోవడంతో ఇలా ఒంటరిగా ఉన్నవారిని టార్గెట్‌గా చేసుకుని హత్యలు చేస్తున్నారు. వీరికి ఉన్న వ్యసనానికి అమాయకులు బలవుతున్నారు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న నేరస్థులు అక్కడే నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఫుట్‌పాత్‌లను అడ్డాగా చేసుకుని ఉంటున్న వారిపై కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన రెండు నేరాలు ఫుట్‌పాత్‌లపైనే చోటుచేసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News