Saturday, April 27, 2024

కట్టుబట్టలతో పారిపోయి వచ్చా

- Advertisement -
- Advertisement -

Afghan President Ashraf Ghani releases video

అఫ్ఘన్‌లో రక్తపాతాన్ని ఆపేందుకు అదొక్కటే మార్గంగా కనిపించింది
డబ్బు మూటలతో పారిపోయానన్న ఆరోపణలు నిజం కాదు
మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తొలి వీడియో సందేశం

దుబాయి: అఫ్ఘనిస్థాన్‌లో రక్తపాతాన్నినివారించేందుకు తనకు కనిపించిన ఏకైక మార్గం దేశాన్ని వీడడమేనని, అందుకే వెళ్లిపోయానని ఆ దేశ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తెలిపారు. సొంత దేశ ప్రజలు,అధికారులనుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో బుధవారం ఫేస్‌బుక్ వేదికగా ఒక వీడియోసందేశం విడుదల చేశారు. తన నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్నారు. అయితే అందరూ ఆరోపిస్తున్నట్లుగా తాను డబ్బు మూటలు తీసుకెళ్లలేదని, కట్టుబట్టలతో దేశాన్ని విడిచి వచ్చానని చెప్పుకున్నారు. ప్రస్తుతం తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో ఉన్నట్లు తెలిపారు.‘ నా స్వార్థం చూసుకుని వెళ్లలేదు. దేశం మంచి కోసమే వీడాను. అలాగైనా ఈ రక్తపాతం, అల్లర్లు ఆగుతాయని అనుకున్నా. ప్రస్తుతం నేను ఎమిరేట్స్( యుఎఇ)లో ఉన్నాను. నేను మిమ్మల్ని(అఫ్ఘన్ ప్రజలను) అమ్మేసి పారిపోయానని, పెద్ద మొత్తంలో డబ్బులు తరలించానని చాలా మంది ఆరోపిస్తున్నారు.

కానీ అవన్నీ పూర్తిగా నిరాధారమైనవి.. నేను వాటిని తీవ్రంగా ఖండిస్తున్నా. నేను అఫ్ఘనిస్థాన్‌నుంచి ఎలా వెళ్లాల్సి వచ్చిందంటే.. కనీసం నా కాళ్లకున్న చెప్పులను మార్చుకునే అవకాశం కూడా రాలేదు. తీవ్రమైన ముప్పు ఉందని నా భద్రతా సిబ్బంది చెప్పడంతో ఆలోచించుకునే అవకాశం కూడా లేకపోయింది. వెంటనే అధ్యక్ష భవనంనుంచి వెళ్లిపోయాను. కట్టుబట్టలతో ఉత్త చేతులతో వచ్చేశాను. కావాలంటే ఈ విషయాన్ని ఎమిరేట్స్ కస్టమ్స్ అధికారులతో ధ్రువీకరించుకోవచ్చు. నేను అక్కడే ఉంటే అఫ్ఘన్ ప్రజల కళ్ల ముందు ఓ అధ్యక్షుడు ఉరికి వేలాడాల్సి వచ్చేది’ అని అష్రఫ్ చెప్పుకొచ్చారు. అయితే తాను యుఎఇలోనే ఉండిపోనని, అఫ్ఘన్‌కు తిరిగి వస్తానని ఘనీ సూచనప్రాయంగా తెలియజేశారు. తాలిబన్లు, ప్రభుత్వ ప్రతినిధులతో తన మద్దతుదారులు చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే తాను అఫ్ఘనిస్థాన్‌కు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. కాబూల్ వీడిన తర్వాత ఘనీ పోస్ట్ చేసిన తొలి వీడియో సందేశం ఇది.

అంతకు ముందు దేశం వదిలి వెళ్లిన తర్వాత ఫేస్‌బుక్‌లో ఓపోస్ట్ చేసిన ఆయన రక్తపాతాన్ని మహా అనర్థాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని పేర్కొన్నారు. రాజధాని కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ఘనీ గత ఆదివారం దేశం వదిలి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన వెళ్లేటప్పుడు అఫ్ఘన్ ఖజానానుంచి 160 మిలియన్ డాలర్ల డబ్బు తస్కరించారని తజకిస్థాన్‌లోని అఫ్ఘన్ రాయబారి మొహమ్మద్ జహీర్ అఘ్‌బార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఘనీ పెద్ద మొత్తం డబ్బులతో పరారైనట్లు రష్యా కూడా ఆరోపించింది. ఇదిలా ఉండగా ఘనీ, ఆయన కుటుంబ సభ్యులను మానవతా దృక్పథంతో తమ దేశంలో ఉండడానికి అనుమతించినట్లు యుఎఇ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాలిబన్లు, అప్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, సీనియర్ అధికారి అబ్దుల్లా అబ్దుల్లా మధ్య జరిగిన చర్చలను ఘనీ స్వాగతిస్తూ, ఈ ప్రక్రియ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News