న్యూఢిల్లీ : భారత్ ఆయుధ శక్తి అజేయదశకు చేరుకునే ఘట్టం ఆవిష్కృతం అయింది. 2000 కిలోమీటర్ల దూరం వరకూ దూసుకువెళ్లే అణు సామర్థంతో ఉన్న అగ్ని ప్రైమ్ క్షిపణిని మన దేశం తొలిసారి రైలు పై నుంచి విజయవంతంగా పరీక్షించింది. రైలుపై అమర్చి ఉన్న ప్ర యోగస్థలి నుంచి ఓ అజ్ఞాత ప్రదేశం నుంచి ఈ శక్తివంత క్షిపణిని ప్రయోగించారు. ఈ పరీక్ష ఒక్కరోజు క్రితం జరిగిందని తెలిపిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురువారం ప్రకటించారు. డిఆర్‌డిఒ శాస్త్రజ్ఞులు, సాంకేతిక సిబ్బందిని అభినందించారు. శత్రువు నుంచి సవాళ్లు ఎదురయినప్పుడు ముందు పసికట్టి, అత్యంత వేగంగా, ఎవరికి అంతుచిక్కని రీతిలో రైలు లాంఛర్ ద్వారా ఈ క్షిపణిని తీసుకువెళ్లి అవసరం అయినచోట శత్రువుపై ప్రయోగించవ చ్చు. సంబంధిత శక్తి సామర్థాన్ని ఇప్పుడు పరీక్షించడం జరిగిందని రక్షణ మంత్రి తెలిపారు. ఇప్పుడు రూపొందించింది నెక్ట్ జనరేషన్ మిస్సైల్, ప్రయోగం కూడా అత్యంత అధునాతనం, రైలు వాహకం ద్వారా క్షిపణిని ప్రయోగించే అతి కొద్ది దేశాల జాబితాలో ఇప్పుడు మనం చేరామని ఆయన తెలిపారు. డిఆర్‌డిఒతో పాటు స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్‌ఎఫ్‌సి) సంయుక్తంగా ఇప్పటి పరీక్ష నిర్వహించాయి. అగ్ని ప్రైమ్‌ను పరీక్షించగల రైలు రోడ్ సంచార పరీక్షా శకటాలను ఇప్పటికే పలు నమూనాత్మక పరీక్షల తరువాత సైన్యంలోకి ప్రవేశపెట్టారు.
Also Read: ఆర్‌టిసి బస్సెక్కితే బహుమతులు