Sunday, May 5, 2024

హీటెక్కిన ఎంఐఎం, కాంగ్రెస్ పొలిటికల్ వార్

- Advertisement -
- Advertisement -

రేవంత్ లక్ష్యంగా బాణం ఎక్కుపెట్టిన ఓవైసి బ్రదర్స్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ల ఘట్టం ముగిసింది. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార సరళి హీటెక్కింది. తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న ఎంఐఎం కాంగ్రెస్, బిజెపిలు లక్షంగా బాణం ఎక్కుపెట్టింది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఎంఐఎం లక్షంగా రాజకీయ విమర్శలు, ఆరోపణలు తీవ్రతతరం చేసింది. కాంగ్రెస్ బిజెపి ఒక్కటేనని చిత్రీకరించేలా ఓవైసి బ్రదర్స్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విరుచుకు పడుతుంటే ఎఐంఎ, బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రతిదాడులకు దిగుతోంది.

దీంతో రాష్ట్రంలో రాజకీయ ప్రచార వేడి సెగలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓవైసి బ్రదర్స్, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ షేర్వాణీ కింద ఖాకీ నిక్కర్ ధరిస్తాడంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటే అనేలా రేవంత్ చేసిన ఈ విమర్శలపై మైనారిటీ వర్గాల్లోనూ చర్చకు దారితీసిందని ముస్లిం మేధావులు భావిస్తున్నారు. బిజెపితో ఎంఐఎంకు లోపాయికారి అవగాహన ఉందని మైనారిటీలను ఆకర్శించేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ఓవైసి బ్రదర్స్ ధీటుగా స్పందించారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి లక్షంగా భాణాలు ఎక్కుపెట్టారు.

రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ కీలు బొమ్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీకు చెప్పడానికి ఏమి లేనప్పుడు మా బట్టల గురించి మాట్లాడటం మొదలు పెడతారని దీనినే ‘డాగ్ విజిల్ పాలిటిక్స్’ అంటారని ఓవైసి బ్రదర్స్ రేవంత్ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. టిపిసిసి చీఫ్ ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చాడని ఆ సంస్థతో అతడికి ఇప్పటికీ అనుబంధం ఉందని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నియంత్రిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేయడం ఇరు పార్టీల మద్య మాటల యుద్దానికి దారితీసింది. రేవంత్ రెడ్డి మా జోలికి రావొద్దు వస్తే నీ జీవిత చరిత్ర బట్టబయలు అవుతుందని అక్బరుద్దీన్ హెచ్చరించే స్థాయికి వారి మాటల వేడి వెళ్ళింది. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నుండి వచ్చిన రేవంత్ రెడ్డి తర్వాత టిడిపిలోకి వెళ్ళి ఆ పార్టీని సర్వనాశనం చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని అన్నదమ్ములు ఫైర్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News