Sunday, April 28, 2024

మహారాష్ట్రలో పాగాకు కెసిఆర్ యత్నం

- Advertisement -
- Advertisement -

పుణే : మహారాష్ట్రలో పాగావేయడంలో కెసిఆర్ ముందుకు దూసుకువెళ్లుతున్నారని ఎన్‌సిపి సీనియర్ నేత అజిత్ పవార్ కితాబు ఇచ్చారు. బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సిఎం ఈ విషయంలో మాయావతి, ములాయంసింగ్ యాదవ్ చేయలేని పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ వెలుపల, ప్రత్యేకించి తెలంగాణతో పూర్వపు అనుబంధం ఉన్న పొరుగు రాష్ట్రాలలో తమ బిఆర్‌ఎస్ ప్రాబల్యం పెంచుకోవడానికి కెసిఆర్ యత్నిస్తున్నారని తెలిపారు. ఇంతకు ముందు మాయావతి, ఆ ముందు ములాయం సింగ్ మరాఠాల మనసులను గెల్చుకునేందుకు యత్నించారని, కానీ పెద్దగా ఏమీ సాధించలేదని విశ్లేషించారు. పలు ప్రాతిపదికలతో ప్రాంతీయ పార్టీలు తమ బలాన్ని తమ ప్రాంతాలకు వెలుపల కూడా పెంచుకునేందుకు వీలుందని, కెసిఆర్ ఈ క్రమంలోనే పట్టువీడకుండా యత్నిస్తున్నట్లు అన్పిస్తోందని ఎన్‌సిపిలో ద్వితీయ స్థాయిలో ఉన్న అజిత్ తెలిపారు.

ఇంతకు ముందు మహారాష్ట్ర నుంచి కొందరు బిఎస్‌పి, ఎస్‌పి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని, అయితే పార్టీలు వేళ్లూనుకుని పోలేదన్నారు. కెసిఆర్ తన ప్రయత్నాలలో ఏ మేరకు విజయం సాధిస్తాడనేది ఇక ముందు తెలుస్తుందన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో కొన్ని పార్టీల నుంచి బిఆర్‌ఎస్‌లోకి వలసలు ఉన్నట్లు ఆయన అంగీకరించారు. దీనికి అనేక కారణాలు ఉంటాయని తెలిపారు. ఎన్‌సిపి, ఇతర పార్టీలకు చెందిన నేతలు కొందరు ఇటీవలే బిఆర్‌ఎస్‌లో చేరారని, బహుశా వారు తమకు తమ పార్టీల్లో సీట్లు రావనే అపనమ్మకంతో ఈ విధంగా పార్టీ మారి ఉంటారని తెలిపారు. ఇదంతా రాజకీయాలలో భాగం అన్నారు. అయితే బిఆర్‌ఎస్ మహారాష్ట్రలో భారీ ఎత్తున ప్రచార ఆర్బాటానికి దిగడం పెద్ద కటౌట్లు పెట్టడం ,దీనికి విపరీతంగా ఖర్చు పెట్టడం దేనికని ప్రశ్నించారు.

కటౌట్లు, టీవీ ప్రచారాలు కూడా విరివిగా జరుగుతున్నాయన్నారు. కెసిఆర్ ఇటీవలే నాందేడ్ అంతకు ముందు పలు ప్రాంతాలలో ఆలోచనాత్మకంగా సభలు పెడుతున్నారు. దీనికి జనం విశేషంగా తరలివస్తున్నారు. నాగ్‌పూర్ ఇతర ప్రాంతాల్లోని మరాఠీలు బిఆర్‌ఎస్ పథకాలకు ఆకర్షితులు అవుతున్నట్లు స్థానిక రాజకీయ పరిశీలకులే తెలియచేస్తున్నారు. నాందేడ్ సభలో కెసిఆర్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను తూర్పార పట్టారు. రైతులకు, అణగారిన వర్గాలకు కేంద్రంలోని బిజెపి చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తున్న పలు ప్రభుత్వాలు ఈ దేశానికి దిశాదశ నిర్ధేశనం లేకుండా కేవలం ఎన్నికల్లో లబ్ధికోసం ఆరాటపడుతున్నాయని,

దీనితో లక్షరహిత ప్రయాణంగా దేశం సాగుతోందని, మనకంటే అతి చిన్నదేశాలు బాగా ముందుకు సాగుతున్నాయని ఆయన చెప్పిన మాటలు మహారాష్ట్రలో ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలో గత నెల నుంచి బిఆర్‌ఎస్ పార్టీ కమిటీల ఏర్పాట్లు, సభ్యత్వ సేకరణ బాగా జరుగుతోంది.
ప్రకాశ్ అంబేద్కర్‌కు సందర్శన హక్కుంది
వంచిత్ బహుజన్ అఘాదీ (విబిఎ) నేత ప్రకాశ్ అంబేద్కర్ ఇటీవల ఔరంగజీబు సమాధి వద్దకు వెళ్లడం వివాదాస్పదం అయిన విషయంపై అజిత్ పవార్ స్పందించారు. ఆయనకు ఇష్టం వచ్చినచోటకు వెళ్లే హక్కు ఆయనకు ఉందని దీనిని ఇతరులు ఎవరూ కాదనడానికి వీల్లేదన్నారు. అయితే ఆయన అక్కడికి వెళ్లడం ఛత్రపతి శివాజీని విశ్వసించే వారికి రుచించదని, బాబా అంబేద్కర్ మనవడు అయిన ప్రకాశ్‌కు ఎక్కడికి అయినా వెళ్లే హక్కు ఉంటుందని, అయితే ఆయన తన హక్కు ఏ విధంగా ఉపయోగించుకోవాలి? దీని వల్ల ఇతరులు మనోభావాలు దెబ్బతింటాయా? అనేది ఆయనే ఆలోచించుకోవల్సి ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News