Friday, May 3, 2024

భారతీయ సమాజంపై వ్యూహాత్మక కుట్ర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ/ అలహాబాద్ : రుతువులు, కాలాలను బట్టి జీవిత భాగస్వాములను మారుస్తూ పోతూ ఉంటారా? ఇదేం పద్ధతి అని అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కలిసి జీవించు , తరువాత విడిపో అనే ధోరణిని ఎవరో కావాలని భారతీయ సమాజంలో క్రమపద్ధతిలో ప్రవేశపెట్టి, ఇక్కడి వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఉందని హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈరోజు ఒకరితో కలిసి ఉండటం, తరువాతి రోజు మరొక్కరిని ఎంచుకోవడంగా తంతు మారుతోందని, ఈ విధంగా సాగితే దేశంలో ఇన్నేళ్ల వైవాహిక వ్యవస్థ, అనుబంధ దాంపత్య జీవితానుబంధం , చివరికి కుటుంబ వ్యవస్థలు ఎక్కడికి పోతాయని ప్రశ్నించారు. జీవితభాగస్వామిపై అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు వెలువడ్డ ఓ మగాడికి బెయిల్ మంజూరు దశలో హైకోర్టు స్పందించింది. సామాజిక కోణంలో పదునైన వ్యాఖ్యలు వెలువరించింది. జస్టిస్ సిద్ధార్థ్‌తో కూడిన అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ ఇప్పుడున్న వైవాహిక వ్యవస్థలో వ్యక్తులకు సరైన భద్రత, సామాజిక ఆమోదం ఉంటుంది. జీవిత స్థిరత్వం ఏర్పడుతుంది. సామాజికంగా సరైన మంచీ మర్యాదల దిశలో ముందుకు వెళ్లేందుకు వీలేర్పడుతుంది.

కానీ ఇది సర్దుబాట్ల లేదా లైవ్‌పార్టనర్‌షిప్ పద్ధతుల్లోని సహజీవనంలో సాధ్యం అవుతుందా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అవసరం కొద్ది కాలాన్ని బట్టి జీవితభాగస్వామిని మారుస్తూ వెళ్లే విధానం స్థిరమైన ఆరోగ్యకరమైన సమాజానికి ప్రతీక అన్పించుకుంటుందా? అని నిలదీశారు. సరైన కట్టుబాట్లు లేకుండా కలిసి జీవించే వారి మధ్య అంతర్గతంగా ఏం జరుగుతుందనేది వైపరీత్యాలు జరిగినప్పుడే బయటి ప్రపంచానికి తెలిసివస్తాయని , ఇది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. దేశంలో మధ్యతరగతి జీవిత నైతికతను విస్మరించరాదని తెలిపారు. జీవిత భాగస్వామ్య విధానం ఇక్కడి సమాజానికి అసాధారణం అవుతుంది. జుగుప్సాకరమే అవుతుంది. దేశంలో వైవాహిక వ్యవస్థలు పనికిరావని తేలినట్లు అయితే వేరే విధానాలను ఎంచుకోవల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. సంపన్న దేశాలలో కలిసి విడిపోయే సంస్కృతి అక్కడి ప్రజలకు దేశానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. పలుచోట్ల అరాచకాలకు, సామాజిక అభద్రతకు ఇటువంటి జీవన పరిణామాలు కారణం అవుతున్నాయి.

మరి ఇక్కడ కూడా ఇటువంటి చిచ్చు రగిలితే ఇక ఇక్కడి వ్యవస్థలను రక్షించుకోవల్సిన కొత్త అవసరం ఏర్పడుతుంది, అక్కడక్కడే ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయని భావించుకుంటూ ఉపేక్షిస్తే ఇదే చినుకుచినుకు వానై భవిష్యత్తు తరాలకు పెను ముప్పు అవుతుందని , బాధాకరం ఏమిటంటే ఇప్పటి యువతరం రేపటి తమ అగమ్యగోచర పరిస్థితిని తమంత తాము ఇటువంటి విధానాలతో కొని తెచ్చుకోవడం అని న్యాయమూర్తి స్పందించారు. యువతకు తాత్కాలిక కృత్రిమ ఆకర్షణలకు లోనయ్యి చివరికి శాశ్వతమైన ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో అధ్నాన్ అనే వ్యక్తి ఏడాదిగా సహ్రాన్‌పూర్‌కు చెందిన 19 ఏండ్ల యువతితో కలిసి ఉంటున్నాడు. తరువాత పెళ్లి చేసుకుందామని చెప్పి తనను భౌతికంగా అనుభవించాడని, తాను గర్భవతిని అయ్యానని , తరువాత పెళ్లికి నిరాకరించాడని యువతి ఈ వ్యక్తిపై రేప్ కేసు పెట్టింది. సంబంధిత కేసులో యువకుడి బెయిల్ విషయం ధర్మాసనం విచారణకు వచ్చింది.
…………………..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News