Sunday, April 28, 2024

కోలుకుంటున్న అమెరికా

- Advertisement -
- Advertisement -

America

 

 

న్యూయార్క్, న్యూజెర్సీలలో నెల రోజుల కనిష్టానికి మరణాలు
మరణాలు 70 వేలకు చేరొచ్చు: ట్రంప్
దశలవారీగా ఆంక్షలు సడలించేందుకు ప్రణాళికలు
అదే బాటలో ఫ్రాన్స్, స్పెయిన్
స్కూళ్లు తెరవడంపైనే డైలమా
మరో హాట్‌స్పాట్‌గా మారుతున్న బ్రెజిల్

న్యూయార్క్/పారిస్: కరోనా వైరస్ ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో మృతుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో అగ్రరాజ్యం అమెరికా కరోనా కోరలనుంచి క్రమంగా బయటపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక రాజధాని న్యూయార్క్‌లో సోమవారం కేవలం 337 మంది మాత్రమే వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు నెల రోజుల తర్వాత మృతుల సంఖ్య ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే మొదటి సారి. కాగా, న్యూయార్క్‌ను ఆనుకుని ఉన్న న్యూజెర్సీలో కూడా మృతుల సంఖ్య తక్కువగానే ఉంది. సోమవారం కేవలం 106 మరణాలు మాత్రమే నమోదైనట్లు న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీ తెలియజేశారు. అమెరికాలో సంభవించిన మొత్తం మరణాల్లో దాదాపు సగం దాకా ఈ రెండు రాష్ట్రాల్లోనే నోదైన విషయం తెలిసింది. వైరస్ తీవ్రత తారస్థాయికి చేరుకున్న సమయంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఒక రోజులో సంభవించిన మరణాలతో పోలిస్తే ఇప్పుడు మరణాల సంఖ్య సగం కూడా లేదని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఇంతకు ముందు ప్రకటించినట్లుగా మే 15న షట్‌డౌన్ ముగిసిన తర్వాత వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్రమంగా ఆంక్షలను సడలించనున్నామని, అయితే అదే సమయంలో తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు మరికొంత కాలం షట్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉందని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. కాగా కరోనా వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రజలు, ఆర్థిక రంగం తీవ్రంగా నష్టపోతుండడంతో దశలవారీగా రాష్ట్రంలోని వివిధ రంగాలను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మొదటి దశలో వైరస్ ఇన్‌ఫెక్షన్ ప్రభావం తక్కువగా ఉండే కన్‌స్ట్రక్షన్, మాన్యుఫాక్చరింగ్ రంగాలను తెరవనుంది. మొదటి దశ అమలు చేశాక వైరస్ వ్యాప్తి, ప్రమాదస్థాయిని పరిగణనలోకి తీసుకుని రెండో దశను అమలు చేస్తారు. మొదటి దశను అమలు చేసిన రెండు వారాల తర్వాత రెండో దశను అమలు చేయనున్నట్లు క్యూమో తెలిపారు. ఈ రెండు వారాల సమయంలో వివిధ రంగాలను తెరవడం వల్ల వైరస్ వ్యాప్తి ఏ విధంగా ఉందో పరిశీలిస్తామన్నారు.

కాగా న్యూయార్క్ రాష్ట్రప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో కలిసి పని చేస్తామని న్యూజెర్సీ గవర్నర్ మర్ఫీ చెప్పారు. అంతేకాదు రాష్టంరంలో వ్యాపారాలు, స్కూళ్లను తిరిగి తెరవడానికి ముందు వైరస్ కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య, ఇన్‌ఫెక్షన్ రేటు దీర్ఘకాలం తగ్గడంతో పాటుగా వైరస్ పరీక్షల నిర్వహణ, కాంటాక్ట్‌ల గుర్తింపు మరింతగా విస్తరించడం, మరిన్ని ప్రాంతాల్లో కరోనా రోగులు కోలుకోవడం లాంటివి ఉండాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే జూన్ చివరి నాటికి పాఠశాలలు తిరిగి తెరుచుకోవచ్చన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మరణాలు 70 వేలకు చేరొచ్చు: ట్రంప్
ఇదిలా ఉండగా కరోనా కారణంగా అమెరికాలో మృతుల సంఖ్య 70 వేలకు చేరుకోవచ్చని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు. అసలు అంచనా వేసిన సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని ఆయన చెప్పారు. సోమవారం రాత్రి శ్వేతసౌధంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 60వేలకు చేరొచ్చని ట్రంప్ గతంలో అనేక సార్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన నవంబర్‌లో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికలపైనా స్పందించారు. అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదని విలేఖరుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం తనకు ఏమీ కనిపించడం లేదని అన్నారు.

ఫ్రాన్స్. స్పెయిన్ డైలమా
మరో వైపు అమెరికా తర్వాత కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఫ్రాన్స్,స్పెయిన్ దేశాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. మరో వైపు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో కరోనా వైరస్ దాదాపుగా కనుమరుగైన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూరప్ దేశాల్లో వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతుండడంతో ఆయా దేశాలు లాక్‌డౌన్ నిబంధనలను సడలించి దాదాపు పూర్తిగా స్తంభించి పోయిన తమ ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నప్పటికీ విద్యాసంస్థలను తెరవడంపై మాత్రం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ పాఠశాలలను తిరిగి తెరిస్తే పిల్లలు సామాజిక దూరాన్ని పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం లాంటి అలవాట్లను కచ్చితంగా పాటించేలా చూడడం చాలా కష్టమవుతుందని అటు తల్లిదండ్రులతో పాటుగా ఇటు టీచర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే తమ ఆరోగ్యాల విషయంలోను ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. మే 11 నాటికి స్కూళ్లు తిరిగి ప్రారంభం కావాలని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ భావిస్తున్నప్పటికీ తమ పిల్లలను తిరిగి పంపాలా వదా అనే విషయాన్ని తల్లిదండ్రులే నిర్ణయించుకోవాలని ప్రభుత్వం అంటోంది. కాగా, పాఠశాలలు తిరిగి తెరుచుకోవడానికి సంబంధించి మంగళవారం సాయంత్రానికి వివరాలు వెల్లడి కావచ్చని భావిస్తున్నారు. అయితే దేశంలోని పారిస్ సహా చాలా నగరాల మేయర్లు మాత్రం ఇప్పుడే పాఠశాలలను తిరిగి తెరవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇటలీ, గ్రీస్ లాంటి ఇతర ఐరోనా దేశాలు కూడా లాక్‌డౌన్ నిబంధనలను సడలించాలని భావిస్తున్నాయి. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు కలిపి 21 వేల మందికి పైగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

మరో హాట్‌స్పాట్‌గా బ్రెజిల్?
ఓ వైపు అమెరికాతో పాటుగా కరోనా వైరస్ తీవ్రతకు అతలాకుతలమయిన చాలా దేశాల్లో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తూ ఉంటే లాటిన్ అమెరికాలో అతి పెద్ద దేశమైన బ్రెజిల్ ఈ వైరస్‌కు సంబంధించి మరో హాట్‌స్పాట్‌గా మారుతోంది. అయితే అధ్యక్షుడు బోల్సొనారో మాత్రం ఇది ఓ చిన్నపాటి జ్వరం మాత్రమేనని, అందువల్ల తీవ్రమైన ఆంక్షలు అవసరం లేదని అంటూ ఉండడం గమనార్హం. 21 కోట్లకు పైగా జనాభా కలిగిన బ్రెజిల్‌లో అధికారిక లెక్కల ప్రకారమే 62 వేల మంది కరోనా వైరస్‌బారిన పడగా 4,200 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు.

దేశ రాజధాని రియోడిజనిరోతో పాటుగా ప్రధాన నగరాల్లోని ఆస్పత్రులన్నీ కరోనా పోషెంట్లతో నిండిపోవడంతో ఇకపై రోగులను చేర్చుకోలేమంటూ ఆస్పత్రులు చేతులెత్తేశాయి. దీంతో చాలా మంది రోగులు ఇళ్లలోనే ప్రాణాలు వదిలే పరిస్థితి తలెత్తింది. కరోనా మరింత ప్రమాదకరంగా మారే పరిస్థితులు దేశంలో ఉన్నాయని సావోపాలో యూనివర్సిటీలో వైరాలజిస్టుగా పని చేస్తున్న పావ్లో బ్రాండావో అంటున్నారు. దేశంలో పది లక్షల మందికి ఈ వైరస్ సోకి ఉంటుందని , శీతాకాలం దగ్గరపడుతుండడంతో శ్వాస సంబంధమైన అనారోగ్యాలు పెరిగిపోయి పరిస్థితి మరింత తీవ్రం కావచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,00,000ను దాటిపోగా, వీరిలో ఒక్క అమెరికాలోనే 55,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

America recovering from corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News