Thursday, May 2, 2024

50 ఏళ్ల తర్వాత చంద్రుని పైకి అమెరికా ల్యాండర్

- Advertisement -
- Advertisement -

తెల్లవారు జామున నాసా ప్రయోగం విజయవంతం
వాషింగ్టన్ : ఆర్టెమిస్2 ప్రయోగం ద్వారా ఈ ఏడాది చివర్లో మరోసారి చంద్రుని ఉపరితలం పైకి నలుగురు వ్యోమగాములను పంపడానికి అమెరికాకు చెందిన నాసా సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే . ఇందులో భాగంగా సోమవారం తెల్లవారు జామున లూనార్ ల్యాండర్‌ను నాసా విజయవంతంగా ప్రయోగించింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే జాబిల్లి పైకి అమెరికా పెరిగ్రీన్ ల్యాండర్‌ను పంపించడం విశేషం. ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ అనే ప్రైవేట్ కంపెనీ ఈ పెరిగ్రీన్ ల్యాండర్‌ను రూపొందించింది.

ఫ్లోరిడా లోని ప్రయోగ కేంద్రం నుంచి యునైటెడ్ లాంచ్ అలయన్స్‌కు చెందిన ‘పల్కన్ ’ రాకెట్ ఈ ల్యాండర్‌ను నింగి లోకి తీసుకెళ్లింది. ఫిబ్రవరి 23న ఇది జాబిల్లి ఉపరితలంపై దిగనుంది. ఈ పెరిగ్రీన్ ల్యాండర్ అనేక సైంటిఫిక్ పరికరాలను మోసుకెళ్లింది. పెరిగ్రీన్‌లో నాసాకు చెందిన మొత్తం 5 పేలోడ్స్ ఉండగా, మిగతా దేశాలకు చెందిన మరో 15 పేలోడ్స్ ఉన్నాయి. ఇవి జాబిల్లి ఉపరితలంపై అధ్యయనం చేయగా వచ్చిన సమాచారాన్ని నాసాకు పంపిస్తాయి. చంద్రుడిపై ఉన్న రేడియేషన్ స్థాయిలు, సర్ఫేస్, సబ్‌సర్ఫేస్ నీటి స్థాయి, అయస్కాంత శక్తిని ఈ పరికరాలు పసి గడతాయి. చంద్రుడి పైకి వ్యోమగాములు వెళ్లినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆ డేటా ద్వారా తెలుసుకోనున్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని విస్తరింపజేసే లక్షంతో నాసా కీలక చర్యలు చేపడుతోంది.

సొంతంగా లూనార్ ల్యాండర్స్‌ను అభివృద్ధి చేసేందుకు ఇటీవల రెండు కంపెనీలకు కాంట్రాక్టులిచ్చింది. పెరిగ్రీన్ ల్యాండర్ కోసం 108 మిలియన్ డాలర్లకు ఆస్ట్రోబోటిక్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. చంద్రుడి పైకి అడుగు పెట్టే తొలి ప్రైవేట్ కంపెనీగా ఘనత సాధించాలని ఆస్ట్రోబోటిక్ లక్షంగా పెట్టుకున్నప్పటికీ, అంతకంటే ముందుగా హ్యూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషిన్స్ కంపెనీ త్వరలోనే ల్యాండర్ ప్రయోగాన్ని చేపట్టనుంది. తాజాగా ప్రయోగించిన పెరిగ్రీన్ ల్యాండర్ మాత్రం కక్షలన్నీ తిరుగుతూ జాబిల్లిని చేరనుండగా, హ్యూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్ ల్యాండర్ ను నేరుగా చంద్రుడి పైకి వెళ్లే మార్గంలో పంపించనున్నారు. 1969లో అపోలో 11 రాకెట్‌లో వెళ్లిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ , బుజ్ ఆల్డ్రిన్, మైఖేల్ కాలిన్స్ చంద్రుని పై అడుగుపెట్టారు. ఆ తరువాత 1972 వరకు ఆరుసార్లు మానవ రహిత చంద్రయాత్రలు జరిగాయి. అనేకసార్లు మెషిన్ ల్యాండర్లను నాసా పంపించింది. చంద్రయాన్ 3 ప్రయోగంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశంగా కూడా కీర్తి సాధించింది. అంతకు ముందు అమెరికా, రష్యా, చైనా చంద్రుడిని చేరుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News