Sunday, June 16, 2024

జాతీయ భద్రతతో రాజీనా ?: అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

ఓటు బ్యాంకు కోసం జాతీయ భద్రతతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీపడుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధ్వజమెత్తారు. ఆమె చొరబాటుదారులను రాష్ట్రం లోకి అనుమతించడం ద్వారా ఆ ప్రభావం రాష్ట్రం పైనే కాకుండా యావద్దేశంపై పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈస్ట్ మిడ్నాపూర్‌లోని కాంతిలో బుధవారం జరిగిన ర్యాలీలో అమిత్‌షా మాట్లాడారు. రాష్ట్రం లోని 42 లోక్‌సభ సీట్లలో 30 సీట్లు బీజేపీ గెలుచుకుంటే తృణమూల్ కాంగ్రెస్‌కు బీటలు పడతాయని, తద్వారా మమతా బెనర్జీ పాలనను సాగనంపడానికి సంకేతమవుతుందని పేర్కొన్నారు. రామకృష్ణ మిషన్ , భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన కొందరు సన్యాసులు ఢిల్లీలో బీజేపీ నాయకుల ప్రభావంతో పనిచేస్తున్నారని మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను అమిత్‌షా తోసి పుచ్చారు.

సేవకు, నైతికతకు కట్టుబడిన సంస్థలను టీఎంసీ తన ఓటు బ్యాంకును కాపాడుకోడానికి బెదిరిస్తోందని విమర్శించారు. భారత్‌సేవాశ్రమ్ సంఘ లేకుంటే బంగ్లాదేశ్‌లో ఒక భాగం గానే పశ్చిమబెంగాల్ మిగిలి పోయేదని , ఆ వాస్తవం మమతా బెనర్జీకి తెలియక పోవచ్చని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో రాజకీయ హింస దాదాపు ప్రజాస్వామ్యాన్ని తుడిచిపెట్టేసిందని, పంచాయతీ ఎన్నికల్లో 200 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కాంతి ప్రజలు భయపడాల్సిన పనిలేదని, ఐదు విడతల పోలింగ్‌లో మమత గూండాలు ఏ ఒక్కరినీ టచ్ చేయలేక పోయారని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ తర్వాత కూడా పారామిలిటరీ కంపెనీలను ఇక్కడే ఉంచాలని తాను ఈసీకి విజ్ఞప్తి చేస్తామని అమిత్‌షా భరోసా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News