Sunday, April 28, 2024

ఎన్నికలకు ముందే సిఎఎ అమలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని, ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘ముస్లిం సోదరులను తప్పుదారి పట్టిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. సీఏఏ పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లో హింసను ఎదుర్కొని భారత దేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ఇది ఎవరి భారత పౌరసత్వానిన లాక్కోవడానికి కాదు” అని అమిత్ షా వివరించారు. సీఎఎ అమలుకు ముందు దానికి సంబంధించిన నిబంధనలను జారీ చేస్తామన్నారు. ఢిల్లీలో గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024 లో అమిత్ షా మాట్లాడారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు మొత్తం 400 స్థానాలు వస్తాయని నిర్ధారిస్తూ ఈ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి సస్పెన్స్ లేదని, మళ్లీ ప్రతిపక్ష బెంచీలపై కూర్చోవాల్సి వస్తుందని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా గ్రహించినట్టు పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేశాం. కాబట్టి దేశ ప్రజలు బీజేపీని ఆశీర్వదిస్తారని అన్నారు. జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్, శిరోమణి అకాలీదళ్, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేలో చేరే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు… మేం కుటుంబ నియంత్రణకు పరిధి ఉంది. దాన్ని నమ్ముతాం. కానీ రాజకీయాల్లో కాదు. అని సమాధానమిచ్చారు.

భారత్ జోడో యాత్రపై విమర్శలు…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర పై విమర్శలు సంధించారు. 1947లో దేశ విభజనకు కారణమైన ఆ పార్టీ నేతకు ఈ తరహా యాత్రతో ముందుకు వెళ్లే అర్హత లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన శ్వేతపత్రం గురించి మాట్లాడుతూ 2014లో భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో ఉందని, అంతటా కుంభకోణాలే జరిగాయని, విదేశీ పెట్టుబడులు రావడం లేదని, అప్పుడే శ్వేతపత్రం తెచ్చి ఉంటే ప్రపంచానికి తప్పుడు సందేశం వెళ్లేదని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News