కార్డియాక్ అరెస్ట్‌తో హైకోర్టులో మరో న్యాయవాది మృతి చెందారు. మృతుడిని ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని గేట్ కారేపల్లి గ్రామానికి చెందిన పరస అనంత నాగేశ్వరరావు (45)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం విధుల్లో భాగంగా నాగేశ్వరరావు గురువారం హైదరాబాద్‌లోని హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ఆవరణలో కేసులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చింది. గుండెపోటు రావడంతో కోర్టు ప్రాంగణంలోని కుప్పకూలారు. తోటి లాయర్లు, సిబ్బంది హుటాహుటిన స్పందించి వెనువెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధితుడు ఒక్కసారిగా కుప్పకూలడ ం అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. మధ్యాహ్నం 2.15 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.
కాగా.. నాగేశ్వరరావుకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కాగా, గతంలో హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే న్యాయవాది పసునూరు వేణుగోపాలరావు(66) గుండెపోటుతో కోర్టు హాలులోనే కుప్పకూలిపోయారు. భోజన విరామానికి ముందు 21వ కోర్టు హాలులో ఈ ఘటన జరిగింది. అక్కడే ఉన్న న్యాయవాదులు వెంటనే ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. వేణుగోపాలరావు మృతితో 21వ కోర్టు హాలుతోపాటు ఇతర కోర్టుల్లోనూ న్యాయమూర్తులు అత్యవసర పిటిషన్‌లు మినహా ఇతర విచారణలను నిలిపివేశారు. సూర్యాపేట జిల్లాకు చెందిన వేణుగోపాలరావు వనస్థలిపురంలోని హిల్‌కాలనీలో నివాసం ఉండేవారు.