Thursday, May 2, 2024

5 వరకు అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

Assembly session will continue until October 5

 

మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్నాయి. శాసనసభలోని స్పీకర్ చాంబర్‌లో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం బిఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా సభల నిర్వహణ, సమావేశ తేదీలు, ఎజెండాల ఖరారుపై సభ్యులు చర్చించారు. ఈ సమావేశంలో సిఎం కెసిఆర్, మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. సమావేశాల్లో భాగంగా ఈనెల 25, 26 (శని, ఆదివారాలు), అక్టోబర్ 2న గాంధీ జయంతి, 3వ తేదీ (ఆదివారం) తేదీల్లో సభలకు సెలవు దినాలుగా ప్రకటించింది. మొత్తంగా ఏడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

ఈసారి ఎక్కువ రోజులు నిర్వహించాలని…

అయితే శాసనసభ సమావేశాలను వీలైనన్ని ఎక్కువ రోజులు జరపాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఏసి) నిర్ణయించగా, కరోనా అదుపులో ఉండటం వల్ల ఎక్కువ రోజులు జరపాలని సభ్యులు సైతం విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో 7 రోజుల పాటు సమావేశాలు నిర్వహించా లని ప్రభుత్వం స్పీకర్‌కు ప్రతిపాదించింది.

12 అంశాలకు సంబంధించిన జాబితాను అందించాం: భట్టి

20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ తరఫున కోరామని, 12 అంశాలకు సంబంధించిన జాబితాను బిఏసికి అందజేశామని సిఎల్పీ నేత భట్టివిక్రమార్క పేర్కొన్నారు. చర్చించాల్సిన అంశాలపై అన్ని పక్షాల నుంచి జాబితా రావాలని సభాపతి తెలిపారని ఆయన పేర్కొన్నారు. జాబితా వచ్చాక పనిదినాలు నిర్ణయించే అవకాశం ఉందని భట్టి పేర్కొన్నారు. సభ ఎక్కువ రోజులు జరగాలని కోరినట్లు సిఎల్పీ నేత భట్టివిక్రమార్క తెలిపారు. చాలా అంశాలపై చర్చ జరపాలని సభాపతిని కోరినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం కొన్ని అంశాలపై చర్చ జరపాలనుకుంటోందని, తాము అడిగినన్నీ రోజులు సభ నడుపుతామని స్పీకర్ తెలిపినట్టు భట్టి పేర్కొన్నారు.

ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అసెంబ్లీ వేదికగా…

విపక్షాలు లేవనెత్తే అంశాలతో పాటు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని, కనీసం పక్షం రోజులైనా సమావేశాలు నిర్వహిద్దామని ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశంలో అన్నట్లుగా సమాచారం. గతంలో కరోనా కారణంగా తక్కువ రోజుల పాటు సమావేశాలు నిర్వహించినందున ఈసారి ఎక్కువ రోజుల పాటు నిర్వహించాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమయ్యింది. సమావేశాల్లో భాగంగా రెండు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులతో పాటు మరికొన్ని ఇతర బిల్లులు సభ ముందుకు రానున్నాయి.

చర్చించే అంశాల జాబితా..

నిరుద్యోగం, దళితబంధు, జలవివాదాలు, విద్య, పోడుభూములు, వ్యవసాయం, వైద్యం, ధరణి పోర్టల్, నీటిపారుదల ప్రాజెక్టులు, నిత్యావసర ధరలు, శాంతిభద్రతలు, డ్రగ్స్ సంబంధిత అంశాలపై సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ శాసన సభాపక్షం లిఖితపూర్వకంగా కోరింది. మైనార్టీ సంక్షేమం, పాతబస్తీలో అభివృద్ధి పనులు, తదితర అంశాలపై చర్చించాలని మజ్లిస్ కోరింది. వ్యవసాయం, హరితహారం, ఐటి -పరిశ్రమలు మూడు అంశాలతో పాటు మరో ఏడు అంశాలు ఇస్తామని టిఆర్‌ఎస్ తెలిపింది. అన్నింటిని పరిశీలించిన సభాపతి పోచారం సోమవారం వీటిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

బిజెపి ఎమ్మెల్యేల అసంతృప్తి…

బిఏసి సమావేశానికి ఆహ్వానం అందలేదని బిజెపి ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు ఆహ్వానం అందలేదని ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన సారి ఇలాగే జరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం లేకుండా బిఏసి సమావేశం ఏర్పాటు చేయడం వారికే చెల్లిందని రాజాసింగ్, రఘునందన్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News