Wednesday, May 1, 2024

పివికి భారతరత్న ఎప్పుడిస్తారు?

- Advertisement -
- Advertisement -

Assembly to pass resolution on Bharat Ratna to PV

1921 వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా లక్నెపల్లి అనే చిన్న గ్రామంలో జన్మించి, స్వామి రామానంద తీర్ధ శిష్యరికంలో రాజకీయాలు నేర్చుకుని, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, ముప్ఫయి ఆరు సంవత్సరాల ప్రాయంలో శాసనసభ్యునిగా మంథని నియోజకవర్గ ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టి, ఇరవై ఏళ్లపాటు రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసి, భూసంస్కరణలకు ఆద్యుడుగా ఖ్యాతి గడించి, కొంతమంది ఆంధ్రా భూస్వాముల కుట్ర ఫలితంగా జరిగిన జై ఆంధ్ర ఉద్యమాన్ని చల్లార్చడం కోసం పదవిని పోగొట్టుకుని, ఆ తరువాత జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మంత్రివర్గాల్లో ముఖ్యమైన శాఖలను నిర్వహించి, అఖండ మేధావిగా ప్రజలతో, రాజకీయ వర్గాల్లో పేరు తెచ్చుకుని, ఆ తరువాత రాజీవ్ గాంధీ హత్య కారణంగా ప్రధాని అభ్యర్థిగా సోనియా గాంధీ, మరికొందరు సీనియర్ నాయకులు ప్రతిపాదించడంతో అత్యున్నతమైన రాజకీయ పదవిని అలంకరించి, ఆ తరువాత ఆ పదవికే అలంకారంగా భాసించి, తనదైన ఆర్ధిక సంస్కరణలతో దివాలా తీసిన దేశాన్ని అంబరాన్ని తాకించిన తెలంగాణ ముద్దుబిడ్డడు శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు.

తనదైన ప్రతిభతో ఆయన దేశానికే ముద్దుబిడ్డగా వెలుగొందారు. మైనారిటీ ప్రభుత్వమే అయినప్పటికీ, అయిదేళ్లపాటు సుస్థిరంగా నడపడమే కాక, ఆ పరిస్థితుల్లోనూ సంస్కరణలను ఉక్కు సంకల్పంతో అమలు చేశారు. ఇవాళ మనం చూస్తున్న అనేక ఐటి కంపెనీలు, పరిశ్రమలు, వందల రకాల కార్లు, కమ్యూనికేషన్ సదుపాయాలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, ఒకటేమిటి… ఇవాళ దేశంలో కనిపిస్తున్న సమస్త సౌకర్యాలు పివి పుణ్యమే. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్ మొదలగు అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం కూడా సగర్వంగా తలెత్తుకుని నిలబడగలింది అంటే అది పివి ఘనతే. పివి సంస్కరణల ఫలితంగా భారతదేశం ఆర్ధికంగా నిలదొక్కుకున్నది అంటే అతిశయోక్తి లేదు. ఇక పివి నరసింహారావు ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న నవోదయ గురుకుల పాఠశాలలు సాధించిన ప్రగతి అసామాన్యం. విద్యార్థులను మానవ వనరులు అనే పేరుతో గౌరవించిన ఏకైక ప్రధానమంత్రి పివి నరసింహారావు. ఇవాళ కొన్ని కోట్ల మంది యువతీ యువకులు ఇంజినీరింగ్ కోర్సులను చదివి విదేశాల్లో ఉద్యోగాలు సాధించి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారంటే అదంతా పివి చలువే. అసలు 1991 లోనే రాజకీయాల మీద వైరాగ్యం కలిగి సన్యాసం పుచ్చుకుని కుర్తాళం పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టడానికి సర్వం సిద్ధం చేసుకున్న పివి దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది అంటే అది విధి విలాసం కాబోలు!

ఇక ఇందిరాగాంధీ తరువాత దేశంలో అణుపరీక్షలు నిర్వహించింది అటల్ బిహారీ వాజపేయి అని చాలా మంది నమ్ముతుంటారు. కానీ, దానికి కావలసిన ఏర్పాట్లను అన్నీ సిద్ధం చేసింది, చేయించింది పివి నరసింహారావే. వాజపేయి ప్రమాణస్వీకారానికి హాజరైన పివి వాజపేయిని హత్తుకునే సమయంలో ఒక చీటీని ఆయన చేతిలో పెట్టారని, దానిలో ‘అంతా సిద్ధంగా ఉన్నది…పరీక్షించడమే తరువాయి‘ అని రాసి ఉన్నదని ఒక కథనం చలామణిలో ఉన్నది. నిజానికి పోక్రాన్ లో జరపాలని తలపెట్టిన ఆ అణుపరీక్ష పివి హయాంలోనే జరగాల్సి ఉండగా, అమెరికా ఒత్తిడికి తలొగ్గి జరపలేదని అంటారు. మరొక గొప్ప విశేషం ఏమిటంటే పివి నరసింహారావు దక్షిణ భారత దేశం నుంచి ఎన్నికైన తొలి ప్రధానిగా ఒక రికార్డు చరిత్రలో నమోదయింది.

పివి నరసింహరావులో మరొక విశిష్ఠ కోణం ఆయన భాషాపరిజ్ఞానం. పదిహేడు భాషల్లో పట్టును సాధించడమే కాక రచయితగా అనేక గ్రంధాలను ప్రచురించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విరచిత ‘వేయి పడగలు’ నవలను ‘సహస్రఫణ్’ పేరుతో హిందీ భాషలోకి అనువదించారంటే పివి సాహిత్య వైభవానికి అంతకన్నా నిదర్శనం ఇంకేమి కావాలి? అలాగే ది ఇన్సైడర్, అయోధ్య లాంటి మరికొన్ని నవలలు రాశారు. 1940ల లోనే కథలు రాశారు. అవధాన కార్యక్రమాల్లో పృచ్ఛకుడుగా పాల్గొన్నారు. కవి కాళోజీకి అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆయన ప్రధాని అయ్యాక ఒక సభలో కాళోజీ పివిని గౌరవవాచకంతో సంబోధిస్తే ‘నువ్వు నన్ను ఏరా అని పిలవడమే ఇష్టం’ అన్నారట! అంత గొప్ప సంస్కారి పివి.

అలాంటి మహా నాయకుడు, ఆర్ధిక పండితుడు, సాహిత్యధురంధరుడు పదవిని కోల్పోయాక అత్యంత దారుణంగా అవమానించింది కాంగ్రెస్ పార్టీ. ఆయనను ప్రత్యర్ధులు కుంభకోణాల్లో ఇరికిస్తే కనీసం న్యాయ సహాయం కూడా చెయ్యలేదు. తన తరపున వాదించిన న్యాయవాదుల ఫీజును చెల్లించలేక జూబిలీ హిల్స్‌లోని తన గృహాన్ని అమ్మి వారి బాకీని తీర్చమని ఒకప్పటి తన సహాయకుడిగా పనిచేసిన ఐఎఎస్ అధికారి స్వర్గీయ పివిఆర్కే ప్రసాద్ గారిని కోరారట పివి! అలాంటి వ్యక్తిత్వాన్ని మనం ఎక్కడైనా చూడగలమా? ఆయన మరణానంతరం ఆయన పార్ధివదేహాన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లోకి కూడా అనుమతించలేదు! దేశాధినేతలకు ప్రోటోకోల్ ప్రకారం దేశరాజధాని ఢిల్లీలో అంత్యక్రియలు జరగాల్సి ఉండగా ఆ మర్యాదకు కూడా పివికి దక్కకుండా అడ్డుకున్నారు కాంగ్రెస్ అధినాయకులు. ఆరు నెలలు కూడా పాలించని ప్రధాని చౌధురి చరణ్ సింగ్‌కు ఢిల్లీలో ఘాట్ ఉండగా ఐదేళ్లు సుస్థిరంగా ప్రభుత్వాన్ని నడిపిన పివికి సూది మొన మోపినంత స్థలం కూడా ఇవ్వడానికి నిరాకరించారు కాంగ్రెస్ పెద్దలు. ఆయన అంత్యక్రియలు హైద్రాబాద్‌లో జరిగినపుడు కూడా సరైన మర్యాదలు దక్కలేదు. ఆయన మృతదేహం పూర్తిగా దహనం కాకుండానే అందరూ వెళ్లిపోయారట!

ఇప్పుడు పివి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనప్పటికీ, టిఆర్‌ఎస్ ప్రభుత్వాధినేత కె చంద్రశేఖర రావు పివి శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని తలపెట్టడం ముదావహం. టిఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయం తరువాత హడావిడిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మేలుకుని తాము కూడా పివి నూరేళ్ళ పండుగ ఉత్సవాలని జరుపుతామని, అందుకు అనుమతి ఇవ్వమని సోనియా గాంధీని బతిమాలడం సిగ్గుచేటు. కెసిఆర్ మరో అడుగు ముందుకేసి పివికి భారతరత్న పురస్కారం ప్రదానం చెయ్యాలని శాసనసభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని ప్రకటించారు!

కేంద్రంలో ఉన్నది బిజెపి ప్రభుత్వం. బిజెపి ప్రధానమంత్రి వాజపేయికి, పివికి అత్యంత ఆత్మీయమైన సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి నాలుగైదు దశాబ్దాలు రాజకీయసావాసం చేశారు. పార్లమెంట్‌లో ఇద్దరూ సహాధ్యాయులు. పివి ఎక్కువకాలం అధికార పక్షంలో ఉన్నప్పటికీ వాజపేయిని అమితంగా గౌరవించారు. ఇద్దరి నడుమా సాహిత్య బంధం కూడా పెనవేసుకుని ఉన్నది. పివిని గురువుగా వాజపేయి భావిస్తే, వాజపేయిని గురుతుల్యుడుగా పివి సంభావించారు. పివి ప్రధానిగా ఉన్న సమయంలో విదేశాలకు వెళ్లే పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్షంలో ఉన్న వాజపేయిని కూడా చేర్చి భారత్ గొంతును విదేశాల్లో వినిపించారు. కాంగ్రెస్ నాయకుడైన సర్దార్ పటేల్‌ను మోడీ ప్రభుత్వం అమితంగా గౌరవించింది. ఆయన విగ్రహాన్ని మూడు వేల అయిదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించింది. అలాగే బిజెపి నాయకులతో సుహృద్భావ సంబంధాలను కలిగిన పివి నరసింహారావును కూడా భారతరత్న బిరుదంతో మోడీ ప్రభుత్వం గౌరవించాలి. ఢిల్లీలో పివికి స్మృతివనాన్ని ఏర్పాటు చెయ్యాలి. తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి నలుగురు ఎంపిలు ఉన్నారు. వారంతా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పివికి సముచిత గౌరవ మర్యాదలు దక్కేట్లు చెయ్యాలి. ఇది తెలంగాణ వాసుల కనీస కోరిక. పివి అభిమానుల ఆశ.

ఇలపావులూరి-  మురళీ మోహన రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News