Thursday, May 2, 2024

వివిఐపిల కోసం బి777 విమానం రాక..

- Advertisement -
- Advertisement -

వివిఐపిల కోసం బి777 విమానం 
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని కోసం ప్రత్యేకం
2 విమానాల ఖర్చు రూ. 8,400 కోట్లు
క్షిపణి దాడిని తట్టుకునే రక్షణ వ్యవస్థ

B777 Plane for VVIP Travel Arrive India from US

న్యూఢిల్లీ: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన బి777 విమానం గురువారం అమెరికా నుంచి ఢిల్లీ చేరుకుంది. విమానాల తయారీ సంస్థ బోయింగ్ ఈ ఏడాది జులైలోనే బి777 విమానాన్ని ఎయిర్ ఇండియాకు అందచేయవలసి ఉండగా కొవిడ్ 19 కారణంగా ఇది కొద్ది వారాలు జాప్యం జరిగింది. కాగా..ఆగస్టులో అప్పగించవలసి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా మరి కొన్ని వారాలు ఇది వాయిదాపడినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా ఒన్‌గా వ్యవహరించే ఈ బి777 గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో టెక్సాస్ నుంచి ఢిల్లీ విమానాశ్రయాన్ని చేరుకుందని అధికారులు చెప్పారు. బోయింగ్ నుంచి విమానాన్ని స్వీకరించడానికి ఎయిర్ ఇండియాకు చెందిన సీనియర్ అధికారులు ఆగస్టు ప్రథమార్ధంలో అమెరికా వెళ్లినట్లు వారు తెలిపారు. మరి కొన్ని రోజుల తర్వాత ప్రత్యేకంగా వివిఐపిల కోసమే మరో బి777 విమానం కూడా రానున్నట్లు వారు వెల్లడించారు.

ఈ రెండు విమానాలు 2018లో ఎయిర్ ఇండియాలో ప్రయాణికుల రవాణా కోసం పనిచేశాయి. అయితే వీటిని వివిఐపిల ప్రయాణ అవసరాల కోసం మార్పులు చేసేందుకు బోయింగ్‌కు పంపించడం జరిగినట్లు వారు చెప్పారు. ఈ రెండు విమానాల కొనుగోలు, మార్పులు చేర్పుల కోసం దాదాపు రూ. 8,400 కోట్లు ఖర్చయినట్లు వారు వివరించారు. బి777 విమానాలలో లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రారెడ్ కౌంటర్ మెజర్స్(ఎల్‌ఎఐఆర్‌సిఎం) అని పిలిచే క్షిపణి రక్షణ వ్యవస్థలతోపాటు స్వీయ రక్షణ సూట్స్(ఎస్‌పిఎస్) ఉంటాయి. ఈ రెండు రక్షణ వ్యవస్థలను 190 మిలియన్ డాలర్లకు భారత్‌కు విక్రయించడానికి అమెరికా ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగీకరించింది. వివిఐపిలు ప్రయాణించే సమయంలో బి777 విమానాన్ని ఎయిర్ ఇండియా పైలట్లు కాకుండా భారతీయ వైమానికి దళానికి చెందిన పైలట్లు నడుపుతారని అధికారులు చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి యిర్ ఇండియాకు చెందిన బి747 విమానాలను ఉపయోగిస్తున్నారు. వీటిని ఎయిర్ ఇండియా ఒన్‌గా వ్యవహరిస్తున్నారు. వివిఐపిలు ప్రయాణించే సమయంలో బి747 విమానాన్ని ఎయిర్ ఇండియా పైలట్లు నడుపుతుండగా ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ వీటి నిర్వహణా బాధ్యతలు చూసుకుంటోంది. వివిఐపిలు ప్రయాణించని సమయంలో బి747 విమానాలను కమర్షియల్ ఆపరేషన్స్ కోసం ఎయిర్ ఇండియా ఉపయోగిస్తోంది. అయితే బి777 విమానాలను మాత్రం కేవలం వివిఐపిల కోసం మాత్రమే ఉపయోగిస్తారు.

B777 Plane for VVIP Travel Arrive India from US

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News