Thursday, May 2, 2024

ఐపిఎల్ కోసం బిసిసిఐ ‘భారీ కసరత్తు’!

- Advertisement -
- Advertisement -

BCCI is making huge arrangements for second phase of IPL

 

ముంబై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వేదికగా త్వరలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) రెండో దశ మ్యాచ్‌ల కోసం భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) తన దూకుడును మరింత పెంచింది. ఇప్పటికే యుఎఇలో ఐపిఎల్ రెండో దశ ఉంటుందని ప్రకటించిన బిసిసిఐ దీని కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే యుఎఇ క్రికెట్ బోర్డుతో ఈ విషయమై పలు దఫాలుగా చర్చలు జరిపి టోర్నీ సజావుగా సాగేలా చర్యలు చేపట్టింది. ఈసారి ఐపిఎల్‌లో అభిమానులకు ప్రవేశం ఉండేలా యుఎఇ క్రికెట్ బోర్డును ఒప్పించడంలో బిసిసిఐ సఫలమైంది. ఐపిఎల్‌ను చూసేందుకు పరిమిత సంఖ్యలో అభిమానులకు ప్రవేశం కల్పించేందుకు యుఎఇ బోర్డు అంగీకరించింది. మరోవైపు ప్రేక్షకుల సమక్షంలో ఐపిఎల్ సాగనుండడంతో బిసిసిఐలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. కిందటి ఐపిఎల్ సీజన్‌ను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించిన విషయం తెలిసిందే. అంతేగాక ఈసారి భారత్‌లో జరిగిన తొలి దశ ఐపిఎల్ కూడా అభిమానులు లేకుండానే సాగిపోయింది.

కానీ కరోనా వల్ల వాయిదా పడిన ఐపిఎల్‌ను యుఎఇకి తరలించడంతో అభిమానులకు మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఏర్పడింది. ఇదిలావుండగా కరోనా నేపథ్యంలో ఐపిఎల్‌ను సజావుగా నిర్వహించడం భారత క్రికెట్ బోర్డుకు సవాలుగా పరిణమించింది. అయితే ఎన్ని అవరోధాలు ఎదురైనా ఐపిఎల్‌ను జయప్రదంగా ముగించాలనే పట్టుదలతో బిసిసిఐ ఉంది. దీని కోసం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు పోతోంది. ఇక టోర్నీకి హాజరయ్యే ప్రతి క్రికెటర్‌కు పూర్తి ఆరోగ్య రక్షణ కల్పించడంపై దృష్టి సారించింది. మరోవైపు విదేశీ క్రికెటర్లు రాకున్నా అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఎలాంటి ఆటంకం లేకుండా ఐపిఎల్‌ను నిర్వహించాలనే పట్టుదలతో బిసిసిఐ అధికారులు ఉన్నారు. ఇక ఐపిఎల్ రెండో దశ మ్యాచ్‌లకు సెప్టెంబర్ మూడో వారంలో తెరలేవనుంది. మలి విడతలో మొత్తం 31 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లను 25 రోజుల్లోనే పూర్తి చేసేందుకు బిసిసిఐ షెడ్యూల్‌ను రూపొందిస్తోంది.

రానున్న ట్వంటీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా ఐపిఎల్‌ను ముగించాలనే లక్షంతో బిసిసిఐ ఉంది. అంతేగాక ఐపిఎల్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు వచ్చేలా బిసిసిఐ పావులు కదుపుతోంది. ఈ మేరకు ఆయా దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులతో సంప్రదింపులను జరుపుతోంది. బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరుల పర్యవేక్షణలో ఐపిఎల్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News