Saturday, April 27, 2024

గిరిజనులకు బిజెపి ప్రభుత్వం వ్యతిరేకం

- Advertisement -
- Advertisement -

కేంద్రమంత్రి బిశ్వేశ్వర్‌ను బర్తరఫ్ చేయాలి
గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపి ఉత్తమ్‌కుమార్‌పై మండిపాటు

 BJP government is against tribals
మనతెలంగాణ/హైదరాబాద్/ మహబూబాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దళిత, గిరిజన, పేదల వ్యతిరేకమని, ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించి, తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ కోరారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్లను పెంచలేదని, దళితుల వర్గీకరణ చేయలేదని, పేదలకు మేలు చేసే ఏ కార్యక్రమం చేపట్ట లేదన్నారు. రాష్ట్ర గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ అసెంబ్లీ నుంచి తమకు ఎలాంటి బిల్లు ప్రతిపాదన రాలేదని అబద్ధాలు చెప్పిన కేంద్రమంత్రి బిశ్వేశ్వర తుడుపై మంత్రి మండిపడ్డారు. గిరిజన సమస్యలు పట్టని ఈ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

గిరిజన రిజర్వేషన్ల బిల్లుకు 2017లో శాసనసభలో పిసిసి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా మద్దతు పలికిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేడు ఎంపిగా పార్లమెంటులో గిరిజన రిజర్వేషన్ల బిల్లు పెంపుపై ప్రతిపాదన వచ్చిందా? అని ప్రశ్న అడగడం ఆయన దివాలా కోరుతనానికి నిదర్శనం అన్నారు. బిజెపి శాసనసభా పక్ష నాయకుడిగా ఉండి ఈ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలిపిన కిషన్‌రెడ్డి నేడు కేంద్రమంత్రిగా పార్లమెంటులో అబద్ధాలు చెప్పించడం వారి గిరిజన వ్యతిరేక విధానానికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 4 శాతంగా ఉన్న గిరిజన రిజర్వేషన్లను 6 శాతానికి పెంచారని గుర్తుచేశారు. ఉద్యమ నేతగా కెసిఆర్ పెరిగిన గిరిజన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను మళ్లీ పెంచాలని ఉద్యమంలో రాష్ట్రమంతా తిరిగినప్పుడు చెప్పారు. 2014లో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక వెంటనే 2015 లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చెల్లప్ప అధ్యక్షతన కమిషన్ వేశారు.

ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గిరిజనులు 10 శాతం ఉన్నారని నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను అనుసరించి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి 2017 ఏప్రిల్ 15వ తేదీన కేబినెట్ ఆమోదం తెలిపింది. 2017 మే 17న రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపించడం జరిగిందని మంత్రి సత్యవతిరాథోడ్ గుర్తుశారు. 2018లో ఆగస్టు 4న ప్రధానికి సిఎం కేసిఆర్ లేఖ రాశారు. గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం…వెంటనే రిజర్వేషన్లను పెంచాలని స్వయంగా కోరారు. ఆ తర్వాత పట్టించుకోకపోతే మరోసారి కూడా లేఖ ఇచ్చారు. సిఎం ఆదేశాల మేరకు రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర మంత్రి అర్జున్ ముండాకు స్వయంగా లేఖ రాశానని మంత్రి తెలిపారు. 9.08 తగ్గకుండా రిజర్వేషన్లు ఉండాలని మద్దతిస్తూ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ రాష్ట్రానికి లేఖ రాసిందని గుర్తుచేశారు. ఎస్టీ రిజర్వేషన్లు పెంచకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బిసి రిజర్వేషన్లతో కలిపి ఈ బిల్లును పంపించారని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

అందువల్లే ఎస్టీ రిజర్వేషన్లు పెంచలేకపోతున్నట్లు తప్పుగా మాట్లాడుతున్నారు. మరి ఎస్సీ వర్గీకరణ చేయమని ప్రత్యేకంగా కేంద్రానికి పంపాము.. కానీ నేటి వరకు ఎందుకు చేయలేదు? ఈ తప్పుగా మాట్లాడే నేతలు చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. రిజర్వేషన్ల పెంపుపై కేంద్రమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తే .. సుప్రీం కోర్టులో ఈ కేసు ఉంది. రాజ్యాంగం ప్రకారం 50 శాతం దాటోద్దు అని సమాధానంతో లేఖ పంపారు. ఇన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగితే ఇవేవి పట్టించుకోకుండా కేంద్ర గిరిజన సహాయ శాఖ మంత్రి బిశ్వేశ్వర తుడు పార్లమెంట్‌లో అబద్దాలు చెప్పారు. దేశంలో 16 నుంచి 20 కోట్ల మంది గిరిజనులు ఉంటే వారికి ప్రాతినిధ్యం వహించే నేతకు రిజర్వేషన్ల పెంపుపై, వారి సమస్యలపై కనీస సోయి లేదని మండిపడ్డారు. ఇలాంటి చేతగాని దద్దమ్మను కేంద్రములో కొనసాగించవద్దని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News