Tuesday, April 30, 2024

ఉపాధి హామీకి బిజెపి ఉరి!

- Advertisement -
- Advertisement -

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ)వల్ల దేశ వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మందికి మేలు జరుగుతోందని నివేదికలు చెబుతున్నా గత తొమ్మిదేళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ. 2 లక్షల కోట్లు సమకూరాయని వివరిస్తున్నాయి. కరోనా సంక్షోభంలో ఏ దిక్కులేని ఎందరో కూలీలకు ఇది ఊతంగా నిలిచిందని చెబుతున్నాయి. అంతేకాదు ఈ పథకం కింద ఎన్నో ప్రయోజనకరమైన పనులు జరుగుతున్నాయి. భూగర్భ జల నిల్వలు పెరగడం, సాగు భూమి విస్తరించడం, నీటి లభ్యత పెంపొందడం వంటి సత్ఫలితాలు కలుగుతున్నాయి. ఇంతటి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, ప్రయోజనకరమైన ఈ పథకం గత రెండు మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వ అలక్షం వల్ల నిర్వీర్యమవుతోంది. బడ్జెట్‌లో కేటాయింపులు పెరగక, కూలీలకు సకాలంలో వేతనాలు అందక, కొన్ని చోట్ల అందినా వ్యత్యాసాలు వీడక, నిర్దేశించిన పనులు సమకూరక, రాష్ట్రాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

రానురాను ఈ పథకానికి ఉద్వాసన పలుకుతున్నారన్న అపోహలు ముసురుకొంటున్నాయి. ఈ ఏడాది (2022 23) బడ్జెట్‌లో సవరించిన అంచనాల ప్రకారం గతం కన్నా 25 శాతం వరకు కేటాయింపులు తగ్గాయి. అంతేకాదు ఈ పథకం పనులకు చెల్లించవలసిన పాత బకాయిలు రూ.3360 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిల్లో పశ్చిమ బెంగాల్‌కు రూ. 752 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ.597 కోట్లు, రాజస్థాన్‌కు రూ. 555 కోట్లు, చెల్లించవలసి ఉంది. ఈ విధంగా పాత బకాయిలు పెండింగ్‌లో ఉంటే వచ్చే ఏడాది కూడా గ్రామీణ కూలీలకు వేతనాలు అందించలేని దుస్థితి ఏర్పడుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ పథకం ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వెబ్‌సైట్‌లో పరికరాల కొనుగోలుకు వెచ్చించిన వ్యయమే ఈ ఏడాది ఫిబ్రవరి 2 నాటికి రూ. 11,027 కోట్లు బకాయిగా ఉందని బయటపడింది. గత సంవత్సరం బడ్జెట్‌లో సవరించిన అంచనాల కన్నా ఈ 2020 23 బడ్జెట్‌లో నిధుల కేటాయింపు 25 శాతం వరకు కోతపడడం విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటి వరకు చెల్లించవలసిన బకాయిలన్నిటినీ లెక్కలోకి తీసుకుంటే వచ్చే సంవత్సరానికి కేవలం రూ. 54,650 కోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఎన్‌ఆర్‌ఇజిఎ సంఘర్ష్ మోర్చా అంచనా వేసింది.

ప్రతి యేటా ఈ పథకం కింద కేటాయించిన నిధుల్లో దాదాపు 80 నుంచి 90 శాతం మొదటి ఆరు నెలల్లోనే ఖర్చయిపోతున్నాయని సంఘర్ష్ మోర్చా వెల్లడించింది. ఫలితంగా క్షేత్రస్థాయిలో పనుల్లో భారీ కోత పడుతోంది. ఉపాధి కార్డు ఉన్న కుటుంబాలన్నిటికీ చట్టప్రకారం సమకూర్చవలసిన పనులు ప్రభుత్వం అప్పగించలేకపోతోంది. ఒక్కొక్కరికీ రోజువారీ వేతనం కనీసం రూ. 334 చెల్లిస్తూ వంద రోజుల వరకు పని దినాలు అప్పగించడానికి బదులు, ఇప్పుడు 16 రోజులకు మాత్రమే పనులు అప్పగిస్తున్నారు. గ్రామీణ పేదలకు అదనపు పనులు కల్పించడంలో ఉపాధి హామీ కీలకంగా నిలుస్తున్నట్టు తెలంగాణలోని రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

గ్రామీణ మహిళలు సంపాదన మార్గంలో పడి, కుటుంబ ఆదాయాల్లో 15 శాతం మేర, వృద్ధి నమోదైందని కేంద్ర ప్రభుత్వ అధ్యయనం వెల్లడించింది. గత రెండేళ్లుగా కరోనా సంక్షోభంలో స్థానిక పేదలు, వలస కూలీలు, యువత ఉపాధి కోల్పోయారు. 2020 ఏప్రిల్ మే నెలల మధ్యకాలంలో లాక్‌డౌన్ అమలైనప్పుడు ఉపాధి కోల్పోయిన కోటి మందిలో 85 లక్షల మంది క్రమంగా తరువాత ఎలాగోలా తిరిగి ఉద్యోగాలు దక్కించుకోగలిగినా, ఇంకా 15 లక్షల మంది ఎలాంటి ఉపాధి దొరక్క అల్లాడుతున్నారు. దాదాపు 23 కోట్ల మంది కనీస దినసరి వేతనం రూ. 275 కన్నా తక్కువే పొందవలసి వస్తోంది. ఇలాంటి కష్టకాలంలో ఉపాధి హామీ పథకం పెద్ద దిక్కుగా నిలుస్తుందని గ్రామీణ ప్రాంతాలు ఆశించాయి. కానీ ఈ పథకంలో ఎన్నో సమస్యల చిక్కుముళ్లు పడడం దురదృష్టకరం. పాత బకాయిలు చెల్లింపు కాకపోవడం, సంబంధిత నిధులు ఇతర పథకాలకు మళ్లించడం, వంటి పెడ ధోరణులు కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. వేతనాల చెల్లింపులో కేంద్ర ప్రభుత్వ అలక్షంపై సుప్రీం కోర్టు కూడా గట్టిగా మందలించింది. రోజువారీ వేతనాల్లో వ్యత్యాసాలు కన్పిస్తున్నాయి.

బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో అత్యల్పంగా, కర్ణాటక వంటి చోట్ల అత్యధికంగా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మధ్యస్థంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ముఖ్యంగా 2016 నుంచి 2020 మధ్యకాలంలో వేతనాలు బాగా తగ్గాయి. వ్యవసాయేతర వేతనాలు 2020 ఏప్రిల్ నవంబర్ కాలంలో 7.9 శాతం వరకు తగ్గగా, 2021 ఏప్రిల్ నవంబర్‌లో 1.8 శాతం వరకు తగ్గింది. ఉపాధి హామీ పథకానికి 2022 జనవరి 28 వరకు 2.97 బిలియన్ పని దినాలు కార్మికులకు అప్పగించగా, దీని వల్ల ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య 67. 1 మిలియన్ వరకు ఉంది. ఇందులో 100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాల సంఖ్య 3 మిలియన్ వరకు ఉన్నట్టు లెక్కలు తేలా యి. ఏదెలాగున్నా ప్రతివ్యక్తికి సరాసరి వేతన రేటు రోజువారీ 2022 లో రూ. 209.31 వరకు ఉంది. 2021 సంవత్సరం కన్నా ఇది (రూ. 200.71) కొద్దిగా ఎక్కువ. ఇక రోజువారీ వ్యవసాయ కూలీ రేటు రూ. 317, రోజువారీ వ్యవసాయేతర కూలిరేటు రూ. 401 కన్నా చాలా తక్కువ.

202122 ఆర్థిక సంవత్సరంలో నిధుల కేటాయింపు అంతకు ముందు సంవత్సరం కన్నా 34 శాతం తక్కువగా ఉన్నట్టు పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ (పిఎఇజి ) నివేదిక వెల్లడించింది. 2021 నవంబర్ నాటికి రూ. 8 కోట్ల వరకు పాత బకాయిలు పేరుకుపోయాయి. 2021 22 లో రూ. 8921 కోట్లు ఈ పథకం కింద అందుబాటులోకి వచ్చాయని ప్రభుత్వం ప్రకటించినా అందులో నిజం కనిపించలేదు. ఎందుకంటే అంతకు ముందు నుంచి పేరుకుపోయిన రూ. 17,543 కోట్ల పాత బకాయిలు ప్రభుత్వ లెక్కలోకి రాలేదు. గత ఏడాది ఒడిశా, తమిళనాడు వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిధుల కేటాయింపులు పెంచాలని ఎంత మొత్తుకున్నా కేంద్రం నుంచి ఏవో సాకులు వినిపించాయి తప్ప ఫలితం దక్కలేదు. సాధారణంగా ఈ పథకంలో వేతనాల చెల్లింపు రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ఉపాధి పనులు పూర్తయిన ఎనిమిది రోజుల్లో పనుల పూర్తి వివరాల జాబితాలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. కార్మికుల పేర్లు, చిరునామా, వారి బ్యాంకు అకౌంట్ల వివరాలన్నీ అందులో తప్పనిసరిగా ఉండాలి. దీన్ని సామూలాగ్రంగా పరిశీలించాకనే నేరుగా కార్మికుల బ్యాంకు అకౌంట్లకు కేంద్రం నుంచి వేతనాల సొమ్ము జమ అవుతుంది. రెండో దశలో ఈ పరిశీలనను ఏడు రోజుల్లో కేంద్రం పూర్తి చేయాలి. ఇందులో జాప్యం జరుగుతుండడంతో సుప్రీంకోర్టు స్పందించి 2018 లో ఉత్తర్వులు జారీ చేసిన తరువాత మొదటి దశ పరిశీలనలో చాలావరకు జాప్యం తగ్గింది కానీ రెండోదశ లోని జాప్యం మాత్రం యథా ప్రకారం కొనసాగుతోంది. ఈ రెండు దశల పరిశీలనలో 15 రోజుల కన్నా మించి జాప్యం జరిగితే రోజుల వారీగా కార్మికులకు నష్ట పరిహారాన్ని చెల్లించాలని చట్టంలో నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఆ నిబంధనలు, సుప్రీం ఆదేశాలు పాటింపునకు రావడం లేదు.

సాంకేతిక ఇబ్బందుల సాకుతో జాప్యం కొనసాగుతోంది. గతంలో పనుల అప్పగింతలో కులాలు, వర్గాల వారీగా నిబంధనలు ఉండేవి కావు. గత ఏడాది నుంచి ఎస్‌సి, ఎస్‌టి వర్గాల కూలీలకు ఈ పథకం కింద ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించి, ఆ మేరకు రాష్ట్రాలకు నిధులు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. దీని ప్రకారం ఒక్కో వర్గానికి ఒక్కో జాబితాను తయారు చేయడం సిబ్బంది తలకు మించిన భారంగా తయారైంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో 10 రాష్ట్రాల నుంచి వచ్చిన 18 లక్షల జాబితాలను పరిశీలించడం ఎంతో కష్టసాధ్యమైంది. రెండోదశలో ఏడు రోజుల గడువులో 29 శాతం మాత్రమే పరిశీలించడమైంది. జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల జాబితాల పరిశీలనకు రెండో దశలో 15 రోజుల కన్నా ఎక్కువ కాలం పట్టింది. ఈ జాప్యం నిధుల కేటాయింపునకు ఆటంకంగా తయారవుతోంది. ఈ విధంగా కులాలు, వర్గాల జాబితాల పరిశీలన పద్ధతిని పక్కన పెట్టి కొత్తగా ఆధార్ పేమెంట్ బ్రిడ్జి సిస్టమ్ (ఎపిబిఎస్)ను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఇందులో కూడా ఆధార్ కార్డుల ఆధారంగా పరిశీలించడంలో సాంకేతిక చిక్కులు తప్పడం లేదు. ఒక వ్యక్తి ఆధార్ వేరే వ్యక్తి బ్యాంకు అకౌంట్‌తో అనుసంధానం అయ్యే సమస్యలు ఎదురయ్యాయి. దాంతో లబ్ధిదారుల అకౌంట్లలో నేరుగా వేతనాల సొమ్ము జమకావడం లేని సంఘటనలు కోకొల్లలు. బ్యాంకుల అధికార్లు లేదా బ్లాక్‌స్థాయి అధికారులు ఈ సాంకేతిక చిక్కులను సరిచేయలేకపోతున్నారు.

పి.వెంకటేశం
9985725591

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News