Saturday, April 27, 2024

ఎవరేమంటే నాకేమిటి

- Advertisement -
- Advertisement -

కన్నూర్ : ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని, తన పనితాను చేసుకుంటూ పోతానని కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ స్పష్టం చేశారు. గత 14 సంవత్సరాలుగా తాను కేరళ రాష్ట్ర ప్రజల కోసం పాటుపడుతున్నానని, ఇదే దిశలో సాగుతానని శనివారం ఆయన స్పష్టం చేశారు. థరూర్ ఉద్ధేశపూరితంగానే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో జోక్యం చేసుకుంటున్నారని, ఆయన వ్యవహారం మితిమీరిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై తిరువనంతపురం ఎంపి స్పందించారు. తనకు పలు వర్గాల నుంచి ఆహ్వానాలు అందుతాయని, సభలు, సమావేశాలకు రావాలని కోరుతారని, ఇతర నేతలు చేస్తున్నట్లే తాను కూడా కార్యక్రమాలకు వెళ్లుతున్నానని , ఇందులో కొత్తేముంది? వింతేముంది? అని ఆయన ప్రశ్నించారు.

తిరువనంతపురంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో థరూర్ పాల్గొనడంపై సీనియర్ నేత రమేష్ చెన్నితాల విమర్శలకు దిగారు. ఈ మధ్యలో థరూర్‌కు రాష్ట్ర రాజకీయాలపై మక్కువ పెరిగినట్లుందని వ్యాఖ్యానించారు. 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో తాను కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిని అయితే తప్పేమిటని థరూర్ చెప్పడాన్ని చెన్నితాల తప్పుపట్టారు. ఈ విధంగా ఎవరికి వారు తమ రాజకీయ ఆకాంక్షలను ప్రకటించుకుంటూ పోతే పార్టీ అంతర్గత క్రమశిక్షణ దెబ్బతింటుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ స్పందించారు.

బిజెపికి 50 సీట్లు తగ్గుతాయిః థరూర్

వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ప్రాబల్యం ఇంతకు ముందటి స్థాయిలో ఉండటం కష్టం అని కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ చెప్పారు. కోజికోడ్‌లో శుక్రవారం ఆయన ఓ సభలో ఈ విషయం తెలిపారు. అధికార బిజెపి ఈ ఎన్నికలలో కనీసం 50 సీట్లు కోల్పోతుందని చెప్పారు. కేరళ సాహిత్య ఉత్సవానికి ఆయన అతిధిగా హాజరయిన దశలో విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. బిజెపికి ఆధిక్యత ఉంటుందని ఆయన అంగీకరించారు. కొన్ని రాష్ట్రాలలో బిజెపి అధికారంలోకి రాకపోవచ్చు. అయితే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాకపోవడం అసాధ్యమని, అయితే 50 స్థానాలు తగ్గుతాయని తన అంచనా పలు పరిస్థితులను బేరీజు వేసుకున్న తరువాత తేలిన విషయం అని తెలిపారు. అప్పట్లో పుల్వామా దాడులు, తరువాత బాలాకోట్ పరిణామం వంటివి చివరి క్షణంలో బిజెపికి లబ్ధిని చేకూర్చాయని, ఇప్పుడు 2024 ఎన్నికలలో పునరావృతం కావడం కుదరదని తెలిపారు. బిజెపి 50 స్థానాలను పోగొట్టుకోవడం ద్వారా ఆ మేరకు విపక్ష బలం పెరుగుతుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News