Friday, April 26, 2024

ఈశాన్యంలో సరిహద్దు పేచీలు!

- Advertisement -
- Advertisement -

అసోం అరుణాచల్‌ప్రదేశ్‌ల మధ్య సరిహద్దు వివాదం పరిష్కారానికి చేరువలో వున్నట్టు వచ్చిన సమాచారం హర్షించదగినది. ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు తరచూ భగ్గుమంటున్నాయి. అసోంతో ఇతర ఈశాన్య రాష్ట్రాలకు గల పేచీలు ఎప్పటికీ పరిష్కారం కాకపోడం హింసాయుత ఘటనలకు దారి తీస్తున్నది. గత నవంబర్ 22న అసోం, మేఘాలయ సరిహద్దుల్లో సంభవించిన కాల్పులు ఈ విషయాన్ని మరొకసారి రుజువు పరిచాయి. ఈ కాల్పుల్లో మేఘాలయకు చెందిన ఐదుగురు గ్రామస్థులు అసోం అటవీ రక్షణ దళ సభ్యుడొకరు దుర్మరణం పాలయ్యారు. కలప దోచుకుపోతున్నారని భావించి ఒక వాహనాన్ని వెంటాడుతూ అసోం పోలీసులు సరిహద్దులు దాటి తమ భూభాగంలో ప్రవేశించగా మేఘాలయ గ్రామస్థులు వారిని చుట్టుముట్టడంతో ఈ ఘర్షణ సంభవించింది. అసోం మేఘాలయ మధ్య 884.9 కి.మీ వివాదాస్పద సరిహద్దు వుంది. అలాగే అసోం మిజోరం, అసోం నాగాలాండ్‌ల మధ్య సరిహద్దు వివాదాలున్నాయి.

అసోం అరుణాచల్ ప్రదేశ్ మధ్య 804.10 కి.మీ మేర అస్పష్ట సరిహద్దు వుంది. ఈశాన్య రాష్ట్రాల మధ్య పేచీల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం 1949 2005 మధ్య 13 శాంతి ఒప్పందాలపై సంతకాలు చేసింది. అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు వంటి చర్యలు తీసుకొన్నది. అయినా ప్రయోజనం సిద్ధించలేదు. అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మేఘాలయలు అసోం నుంచి విడిపోయిన భూభాగాలతో నెలకొన్న రాష్ట్రాలే. అందుచేత వాటికి అసోంతో సరిహద్దు వివాదాలు ఏర్పడ్డాయి. ఈ రాష్ట్రాలకు అసోంకు మధ్య పరస్పరం పంటలను నాశనం చేసుకోడం, ఘర్షణలకు దిగడం జరుగుతున్నాయి. 1979 2021 మధ జరిగిన ఘర్షణల్లో 157 మంది మరణించగా, 361 మంది గాయపడ్డారు. 65,729 మంది నిర్వాసితులయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది అసోం, నాగాలాండ్ మధ్య సంభవించిన ఘర్షణల్లో చనిపోయిన వారే. 136 మంది ఈ రెండు రాష్ట్రాల మధ్య హింసాకాండకు బలయ్యారు.

అసోం అరుణాచల్‌ప్రదేశ్‌ల మధ్య ఘర్షణల్లో పది మంది, అసోం మిజోరంల మధ్య ఏడు మంది మృతి చెందారు. మేఘాలయతో సంభవించిన సరిహద్దు ఘర్షణల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. అసోం, అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు వివాదంపై ముగ్గురు సభ్యుల పరిష్కార కమిషన్ చేసిన సిఫారసులను అసోం తిరస్కరించింది. ఈ కమిషన్ 2014లో సమర్పించిన నివేదికలో 70 80 శాతం వివాదాస్పద భూభాగాన్ని అరుణాచల్‌ప్రదేశ్‌కు అప్పగించాలని సిఫారసు చేసింది. సరిహద్దు వివాదానికి కోర్టు బయట పరిష్కారాన్ని సాధించుకోవాలని తమ రెండు రాష్ట్రాలు నిర్ణయించుకొన్నట్టు 2021 జులైలో అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. కాని అదింతవరకు ఒక కొలిక్కి రాలేదు. ప్రాంతీయ కమిటీ స్థాయిలో గువాహతిలో తాజాగా జరిగిన మూడో విడత చర్చలు ఫలించినట్టు రెండు రాష్ట్రాలు బుధవారం నాడు ప్రకటించాయి.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని నమ్‌సాయి, లోహిత్ జిల్లాలలో అసోంలోని తినుస్కీయా జిల్లాలోనూ కమిటీ సభ్యులు పర్యటించారని సరిహద్దులకు రెండు వైపులా గల విద్రోహ శక్తులే ఘర్షణలను సృష్టిస్తున్నారని, శాంతియుత సహజీవనం చేయాలన్నదే తమ లక్షమని రెండు రాష్ట్రాల మంత్రులు ప్రకటించడం హర్షించవలసిన విషయం. మహారాష్ట్ర, కర్నాటకల మధ్య సరిహద్దు వివాదం ఇటీవల భగ్గుమన్న సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు చెబుతున్నాయి. ఈ దశలో మహారాష్ట్రకు చెందిన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ (శివసేన ఉద్ధవ్ థాక్రే) మాట్లాడుతూ ఇండియాలోకి చైనా చొచ్చుకు వచ్చిన విధంగా తాము కర్నాటకలోకి ప్రవేశిస్తామని అనడం ఎంత మాత్రం సమంజసం కాదు. సరిహద్దు వివాదంపై కర్నాటకతో మాట్లాడే ధైర్యం ముఖ్యమంత్రి షిండేకి లేదని ఆయన ఇంతకు ముందు ఎద్దేవా చేశారు.

ఇటువంటి రెచ్చగొట్టే ప్రకటనల వల్ల వివాదాలు పరిష్కారం కాకపోగా మరింత ముదురుతాయి. రౌత్ ప్రకటనలో చైనా మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చినా ప్రధాని మోడీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతున్నదనే పరోక్ష వ్యాఖ్య కూడా ఇమిడి వుంది. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లోని తవాంగ్ సెక్టార్‌లోకి చైనా సేనలు ప్రవేశించి మన సైన్యంతో ఘర్షణకు దిగిన ఘటనపై ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేయకపోడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కర్నాటక మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడవలసి వుంది. అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో పూర్తి సహకారం అందించ గల ఉపగ్రహ మ్యాపింగ్ వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో వున్నాయి. రాజకీయ స్థాయిలో సత్సంకల్పం కొరవడినందునే ఈ వివాదాలు కొనసాగుతున్నాయి. దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఏళ్ళ తరబడి అపరిష్కృతంగా మిగిలిపోడాన్ని అర్థం చేసుకోవచ్చుగాని, ఒకే దేశంలోని రాష్ట్రాల మధ్య పేచీలు ఎప్పటికీ ఒక కొలిక్కి రాకపోడం ఎంతైనా ఆందోళనకరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News