Saturday, July 27, 2024

 ప్రచారంలో ‘కాల్‌ఫర్ ఓట్స్’

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha elections) ప్రచారం హోరు కొత్తదారుల్లో సాగుతోంది. ఒకవైపు ప్రచార రథాలు పాటలతో మార్మోగుతుంటే, మరోవైపు ఎన్నికల ర్యాలీలు రోడ్లపై జాతరలా సాగుతున్నాయి. ఇంటింటికీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభ్యర్థులు వెళ్లి ఓటర్లను కలుసుకుంటున్నారు. ఇదే కాకుండా మొబైల్ ఫోన్ల ద్వారా వినియోగదారులకు నేరుగా పార్టీల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఫలానా పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపించండని కాల్స్ గళం విప్పుతున్నాయి. అయితే మన ఫోన్ నెంబరు ఆయా పార్టీలకు ఎలా తెలుస్తోంది? రాజకీయ పార్టీలు థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా వ్యక్తుల ఫోన్ నెంబర్లను సేకరించి తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయండని అభ్యర్థించడం ప్రతిరోజూ పరిపాటి అయింది.ఈ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎప్పుడూ వినని ప్రదేశాల నుంచి ఫోన్‌కాల్స్ రావడం హైదరాబాద్ వాసులకు సర్వసాధారమైంది.

ప్రతిసారీ ఏదో ఒక కొత్త నెంబరు మన మొబైల్‌కు వస్తోంది. కొందరికి మధ్యప్రదేశ్ నుంచి ఫోన్ కాల్ వస్తున్నాయి. తరువాత కర్ణాటక నుంచి, కొన్నిసార్లు ఆటో రికార్డెడ్ మెసేజ్ ఏ పార్టీకి ఓటు వేయాలో చెబుతోంది. మరొకసారి అభ్యర్థి నుంచే అభ్యర్థన వినిపిస్తోంది.దాదాపు నెలన్నర రోజుల నుంచి తెలంగాణ ఓటర్ల ఫోన్లు ఎన్నికల సంబంధిత కాల్స్, మెసేజ్‌లతో నిండిపోతున్నాయి. అవతల వ్యక్తులెవరో మనకు తెలీదు. వారి నెంబర్లు మనకు తెలీవు. ఇదంతా ప్రైవసీకి ఆందోళన కలిగించే అంశం. అక్రమంగా డార్క్ వెబ్ లేదా బ్యాంకుల నుంచి వివిధ రుణ సర్వీస్‌ల తాలూకు థర్డ్ పార్టీ వెండర్ల నుంచి మన నెంబర్లు సేకరించే వ్యవహారం. ఈ విధమైన అవాంఛిత ఇ మెయిల్స్ (స్పామర్స్) ఓటర్ల వాట్సాప్‌ల్లో పెచ్చుపెరుగుతున్నాయి.

ఏ అభ్యర్థికి ఓటు వేయాలో తెలియజేస్తూ ముందుగా రాసిన సందేశంతో ఓటర్ స్లిప్‌ను నకలు చేస్తున్నాయి. కెనడాలో ఉండే 24 ఏళ్ల యువకునికి కూడా ఇటీవల ఈ విధమైన మెసేజ్ అందింది. ఎలెక్షస్ సర్వే యాప్ పేరు చెప్పి సామూహికంగా కొన్ని కాల్స్ వస్తున్నాయి, ఈ విధంగా ఫోన్ నెంబర్ల ద్వారా ఓట్లు అడిగే అవకాశం పార్టీలకు బహుశా ఇదే ఆఖరుది కావచ్చు. ఈ విధంగా ఫోన్ నెంబర్లను తెలుసుకోవడం ప్రైవసీకి భంగం కలిగించడమే. దీన్ని నివారించడానికి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డిపిడిపి) యాక్ట్ ఉన్నప్పటికీ, దీనికి తగిన మార్గదర్శకాలు, నిబంధనలు ఇంకా చట్టంలో చేర్చలేదు. అందుకే ఈ చట్టం ఇంకా సరిగ్గా అమలు కావడం లేదు. వచ్చే జూన్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక నిబంధనలు ఖరారు అవుతాయని భావిస్తున్నారు.

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డిపిడిపి) చట్టం 2023 ఆగస్టులో పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. డేటా కనిష్టీకరణ (మినిమైజేషన్), ప్రయోజనం పరిమితి, నిల్వపరిమితి (స్టోరేజి లిమిటేషన్) అన్నవి ఈ చట్టంలోని ప్రధాన లక్షాలు. డేటా మినిమైజేషన్ అంటే ఎంటిటీలు అవసరమైన డేటాను మాత్రమే సేకరించగలవు. పర్పస్ లిమిటేషన్ (ప్రయోజనం పరిమితి) అంటే అవసరమైన సేవల ప్రయోజనం మేరకు డేటా వినియోగాన్ని పరిమితం చేస్తుంది. డేటా స్టోరేజి లిమిటేషన్‌కు(Data Storage Limitation) సేవలు పంపిణీ అయిన తరువాత ఎంటిటీలు ఆ డేటాను తొలగించవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఏయే ఫోన్ నెంబర్లను తాము కోరుకుంటున్నారో ఆయా ఫోన్ వినియోగదారుల నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. ఏ ప్రయోజనం కోసం ఈ ఫోన్ నెంబర్లు(phone numbers) కావాలో, ఎందుకు వాటిని వినియోగిస్తారో ఈ వివరాలన్నీ స్పష్టం చేసి వినియోగదారుల నుంచి అనుమతి పొందాలి. వాటిని వినియోగించాక డిలీట్ చేయాలి. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే అత్యధికంగా రూ. 250 కోట్ల వరకు పెనాల్టీ చెల్లించే పరిస్థితి ఏర్పడుతుంది. డేటా సోర్స్ చేయబడిన ఎంటిటీలు కూడా బుక్ అవుతాయి. ప్రస్తుతం డేటా ఉల్లంఘన ఫిర్యాదులు కూడా 2011 ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల కింద చేయవచ్చు.

కానీ తగిన శిక్షలు అమలు లేవు. రాజకీయ పార్టీలు ప్రస్తుతం వాయిస్ కమ్యూనికేషన్ కాల్స్(communication skills) (ఐవిఆర్ కాల్స్) కోసం ఎస్‌ఎంఎస్ కోసం థర్డ్ పార్టీ ద్వారా టెలిఫోన్ సర్వీస్‌ను ఉపయోగిస్తున్నాయి. భారీ ఎత్తున డేటా సేకరిస్తున్నాయి. అయితే ఇది కేవలం వ్యక్తుల పేర్లు, ఫోన్‌నెంబర్లకే పరిమితం కాదు. కులం, మతం, ఆదాయం తదితర వివరాలు కూడా అవతలి వారికి చేరతాయి. దీని ద్వారా ప్రచారంలో ఓటర్లను టార్గెట్ చేయడానికి పార్టీలకు ఉపయోగపడతాయి. ఈ విధమైన ఐవిఆర్ కాల్స్ కోసం 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే పార్టీలు చాలా వరకు రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు అంచనా. అయితే ఈసారి మాత్రం ముఖ్యంగా విపక్షాలు తక్కువగానే ఖర్చు పెట్టి ఉండవచ్చని తెలుస్తోంది.ఇప్పుడు డేటా ప్రొటెక్షన్ బిల్లు పకడ్బందీగా అమలులోకి వచ్చే డేటా ఉల్లంఘన ఫిర్యాదులన్నీ పరిష్కారమవుతాయి. ఫోన్ వినియోగదారుల నుంచి ఎలా అనుమతి పొందాలో, ఎంతవరకు వారి ఫోన్ నెంబర్లను వినియోగించాలో ఒక క్రమపద్ధతి ఏర్పడుతుంది. అప్పుడు పార్టీలు టెలిక్యాంపైన్ ఎలా చేయాలో దానికి తగ్గట్టు పద్ధతులు మార్చుకోవలసి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News