Saturday, July 27, 2024

ప్రాధాన్యతలు మారకుంటే అధోగతే

- Advertisement -
- Advertisement -

ఇది పద్దెనిమిదో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల సమయం. ‘మేం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇదిగో! ఇది చేస్తాం, ఇవిగో! ఇవే మా ప్రాధాన్యతలు, ప్రాథమ్యాలు’ అంటూ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలను ఏకరువు పెట్టడం మనం చూస్తున్నాం. మంచిదే, ఏం చేస్తారో చెప్పడం రాజకీయ పార్టీల ధర్మం.అధికార పీఠం ఎక్కగానే చెప్పింది చెప్పినట్టే చేసి చూపడం పార్టీల నైతికత. ఏం చేస్తారో తెలుసుకోవడం పౌరుల కనీస హక్కు.చెప్పిందే చేసినపుడు మెచ్చుకోవడం, తిరిగి ఎన్నుకోవడం ప్రజలకు ఉండాల్సిన కృతజ్ఞత. చెప్పిందే ధర్మంగా చేసే ప్రభుత్వాలున్నప్పుడు, చేసిన మంచిని ఆస్వాదించే ప్రజలున్నప్పుడు ప్రజాస్వామ్యంలో అంతకంటే సుగుణం ఏముంటది? కానీ, అవసరానికి అడుగడుగు దండాలు, అక్కర తీరగానే తీరొక్క గండాలు చందంగా సాగిన క్షుద్ర రాజకీయ క్రీడలెన్నిటినో దేశం చవిచూసింది.

అందుకే ప్రజలు తమకున్న కొద్దిపాటి ప్రజాస్వామిక చైతన్యస్థాయి మేరకు ఏర్పడబోయే ప్రభుత్వాలు పరిపాలనలో ఏయే అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నాయో గమనిస్తారు. ఒకవేళ ప్రజలు తమకున్న ఆ కొద్దిపాటి చైతన్యస్థాయిని ప్రదర్శించలేనపుడు ప్రజలను వెన్నంటి ఉండాల్సిన బాధ్యత సమాజంలోని మేధో బృందా లు, మేధో సమూహాలది.ఫలానా పథకాలు, కార్యక్రమాలు మీకు చాలా ముఖ్యం అంటూ ప్రజలకు విశదపరుస్తూ, ప్రభుత్వాలకూ సూచనలు, సలహాలు ఇచ్చే మేధో బృందాన్నే అభివృద్ధి చెందిన దేశాల్లో ‘థింక్ ట్యాంక్( Think Tank)’ అంటారు. ఈ థింక్ ట్యాంక్ ఇచ్చే సూచనలు, సలహాలనే యూరోపు, అమెరికాల్లో ప్రధానులు, అధ్యక్షులు సైతం వింటూ నిర్ణయాలు తీసుకుంటుంటారు. నిజానికి క్షేత్రస్థాయి అనుభవమున్న కొద్దిమంది నాయకులను మినహాయిస్తే ప్రజల అవసరాలు ఏమిటి? ఎట్లా వాటిని సాధించాలనే దానిపైన రాజకీయ పార్టీల కంటే మేధావులకే బాగా తెలుస్తుంది.ఉదాహరణకు Hollis B.Chenry (1918-1994) అనే పెద్దాయన్నే తీసుకుందాం.

ఈయన హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఆచార్యుడు, అభివృద్ధి ఆర్థిక శాస్త్రవేత్త. ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్‌గా పని చేశాడు. ఈయన తన సహచరులు కలసి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో సాధారణ ఆర్థిక నమూనాలను, నిర్మాణాత్మక మార్పులను గుర్తించడానికి పలు విధాల ప్రయత్నించారు. ముఖ్యంగా పేదరికం, అసమానతల నిర్మూలనకు 1970ల లో హెన్స్ సింగర్ చెప్పిన ‘అభివృద్ధి నుండి వచ్చే ఆదాయాన్ని పేదల ఆస్తులుగా (విద్య) పెంచడం ద్వారా పేదరికాన్ని త్వరిత గతిన తగ్గించ వచ్చుననే ప్రతిపాదనను అధ్యయనం చేసి ‘వృద్ధి పునః పంపిణీ (Redis tribution of Growth)’ గ్రంథంతో సమాజ మార్పులో అర్థశాస్త్రానికున్న గుణాత్మక భాగస్వామ్యాన్ని వివరించారు. మన ఆర్థికవేత్త మాంటేక్ సింగ్ అహ్లూవాలియా ప్రొఫెసర్ చెనరీ అనుయాయుడే.

ప్రజల అవసరాల విషయంలో పార్టీలది, మేధావులది ప్రజాకోణం అయినపుడు ఇబ్బందిలేదు. కాకపోతే పార్టీలది రాజకీయ కోణం, ఎన్నికల కోణం కావడమే బాధాకరం. ఇందులో సాంప్రదాయ పార్టీలది, ప్రగతిశీల పార్టీలది వేర్వేరు దృక్కోణం. సెక్యులర్, నాన్ సెక్యులర్ పార్టీలది విరుద్ధ మార్గం. ఇక్కడే మేధో బృందాల (Think Tanks) అవసరం దేశానికి ఎంతో ఉంది. సమాజంలో ఏ పొరలో ఏ సమస్య ఎంత కాలంగా ఏ మేరకు తిష్ఠ వేసి ఉందో, రూపుమాపేందుకు ఏ సమస్యకు ఏ పథకం, ప్రణాళికలు అవసరమో, నినాదప్రాయంగా కాకుండా ‘సమ్మిళిత అభివృద్ధి’కి ఏ పనులను ప్రాధాన్యతా క్రమంలో ఎట్లా చేయాల్నో మేధావులు, పరిశోధకులు ఎప్పటికప్పుడు చెపుతుంటారు. ప్రజల్లో పేరు ప్రఖ్యాతులుంటాయి, పార్టీల్లో బలం పలుకుబడి ఉండవు. అందుకే మన పార్లమెంటరీ వ్యవస్థలో ఎగువ సభలను ఏర్పరచారు. మొదట్లో మేధావులను ఆయా పార్టీలు నామినేట్ చేసేవి. మేధో చర్చలు ఎగువ సభల్లో జరిగేవి. పెద్దల సభకు పిన్నలు, అచ్చు రాజకీయ నాయకులే ప్రవేశిస్తుండటంతో ఇప్పుడా మేధో చర్చలు కరువైనాయి. ఇక ప్రాథమ్యాలు, ప్రాధాన్యతల విషయానికొస్తే, ప్రాథమ్యాలు, ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడం ద్వారా ప్రభుత్వాలు పరధ్యానంలోకి వెళ్లవు.

అనవసరమైన పనులలో చిక్కుకోకుండా నివారిస్తాయి, తద్వారా లక్ష్యాలను మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా సాధించడానికి వీలు కలుగుతుంది. ప్రాధాన్యతలను నిర్దేశించుకోవడం అనేది అడ్డంకులను అధిగమించడానికి, సవాళ్లను ఎదుర్కొనేందుకు స్థిరంగా ఉండటానికి కూడా సహాయపడుతుందంటారు సామాజికవేత్తలు. ఆలోచనలనూ, తాత్త్వికతలనూ అందించే మేధావులు థింక్ ట్యాంక్, ఫ్యాక్ట్ ట్యాంక్ అయితే, అనుకున్నవీ ప్రజలకు అవసరమైనవి అమలు పరచే ‘యాక్ట్ ట్యాంక్’ దేశాభివృద్ధికి ఎప్పుడూ అవసరం, ఇప్పుడు మరీ అవసరం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాలు వేటికవి విలక్షణంగా మేనిఫెస్టోలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటా యి. అధికారం కట్టబెట్టినపుడు ఎవరేం చేశారన్నది ప్రజల అనుభవంలో ఉంది.

ఇప్పుడు దేశం ముందున్న సమస్యలేమిటి? వేటికి ప్రాధాన్యత ఇస్తారు? అంతర్జాతీయంగా ఏ విధానాలను అవలంబించడం ద్వారా దేశ ప్రతిష్ఠ ఇనుమడిస్తుందో కూడా పౌరులు ఆలోచిస్తారు, ఆలోచించాలి. ఆ మేరకే ఓటర్లుగా తమ వివేకాన్ని ప్రదర్శిస్తారు, ప్రదర్శించాలి. ఇదిట్లా ఉంటే సమాజాభివృద్ధి శ్రేయస్సు లక్ష్యంగా వివిధ కోణాల్లో పని చేసే వివిధ ఎన్‌పిఒ (Non Profit Organisation) లను, స్వచ్ఛంద సంస్థలను కూడా థింక్ ట్యాంక్‌లుగానే మనం పరిగణించాల్సి వుంది. ఇప్పుడు ముంబై కేంద్రంగా నడుస్తున్న చెప్పుకోదగిన స్వచ్ఛంద సంస్థల్లో ‘PRICE (People Research of Indian Consumer Economy)’ ఒకటి. దేశ ఆర్థిక వ్యవహారాలపై లోతైన సమీక్షలను, సమగ్ర విశ్లేషణలను ‘ప్రైస్’ అందిస్తుంది. ప్రధానంగా దేశానికి సంబంధించిన వస్తువులు సదుపాయాల సముపార్జన (earnings), ఖర్చు ( spending), పొదుపు (savings), జీవనం (lives) సమాలోచన (thinking), అనుబంధాలు అనుసరణలు ( Accesses)ను తాజా నివేదికల ద్వారా బహిర్గత పరుస్తుంది. మరి, ఇప్పుడు లోక్‌సభ ఫలితాల అనంతరం ఏ పక్షానికి మెజార్టీ వచ్చి అధికారం చేపట్టినా, వాళ్ల ముందు ఎంత పెద్ద పనుల చిట్టా ఉన్నా దేనిదేనికి ప్రాధాన్యత ఇవ్వాలో కూడా తన వంతు బాధ్యతగా ‘ప్రైస్’ ముందస్తుగానే సూచించింది. అయితే ఏ అంశాలనైనా ప్రాధాన్యతల క్రమంలో గుర్తించేటప్పుడు ‘8R’లు (Reflect, Reflect again, Review, Rank, Refine, Review, Reconsider, Refin further)లను పరిగణనలోకి తీసుకోవాలంటాడు జెరెమీ గాడ్విన్.

అనుకున్న అంశాలకు నిజంగానే ప్రాధాన్యత లభించి అమలు జరిగే దశను ముందస్తుగానే పరికల్పన (Hypotheses)లో – ప్రతిబింబంగా, పునః ప్రతిబింబంగా ఊహించి సమీక్షించుకొని, దానికి స్థాయినిచ్చుకొని, శుద్ధపరచుకొని, పునః సమీక్షించుకొని, పునః పరిశీలన చేసుకొని, మరింత మెరుగు పరచుకొని ఫలితాలను నిర్ధారించుకున్న మీదటనే విషయాలకు ప్రాథమ్య క్రమం ఇవ్వాలని 8Rs చెబుతున్నాయి. ప్రపంచపటం మీద మనది యువక దేశమని జబ్బలు చరచుకుంటున్నా ఇది నినాదానికి, ఒక స్థాయి ప్రేరణకే పనికొచ్చేది మాత్రమే. దేశంలో 42 కోట్ల మంది యువత ఉండగా, గ్రామాల్లో 26 కోట్ల 80 లక్షలమంది, పట్టణాల్లో 15 కోట్ల 20 లక్షల మంది యువత నివసిస్తున్నారు. యువత ప్రతిభా నైపుణ్యాలే ప్రస్తుతానికైనా భవిషత్తులోనైనా దేశానికి మంచి వనరు. పార్టీలేవైనా ఒక దాన్ని మించి ఒకటి జనాకర్షక పథకాలకే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో యువత శక్తియుక్తులను వెలికితేసే ప్రభుత్వా లు కొన్ని మాత్రమే, వాటి ప్రయత్నాలు కొంత మేరకే. సర్వీసు అంతా ఆదివాసీ, గ్రామీణ ప్రాంతాల్లో పని చేసిన అధ్యాపకుడిగా యధార్థమే చెప్పాల్సి వస్తే గ్రామీణ యువతకు అందుతున్న విద్య, ఉపాధి, నైపుణ్య శిక్షణ, ప్రోత్సాహం సరిపోయేటంతటివి ఎంతమాత్రం కావని చెప్పగలను. అట్లాగని పట్టణ యువత అంతా పెద్ద పెద్ద చదువుల్లో తలమునకలైనారని కాదు, అర్బన్ లేబర్‌గా మాత్రమే నగర యువత బతుకీడుస్తున్నారు. దేశ ప్రగతి నిజమైన వేగం పుంజుకోవాలంటే రానున్న కేంద్ర ప్రభుత్వానికి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ‘ప్రైస్’ తనవంతుగా తగు ప్రాథమ్యాలను సూచించింది.

‘నైపుణ్యంతో కూడిన వర్క్ ఫోర్స్ రూపొందడం కోసం అందరికీ నాణ్యమైన విద్యను అందించడం, వస్తువులు సేవలు అందరికీ అందుబాటులో ఉండేట్టు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, వైద్యసేవలను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక తోడ్పాటును అనుసంధానించడం, జనాభాకు తగ్గట్టుగా ఉద్యోగాల కల్పనకు పూనుకోవడం, అభివృద్ధి పంపిణీని పెంచి అసమానతలను తగ్గించడం’ అనే ఈ ఆరు ప్రాథమ్యాలతో పాటు సామాజిక భద్రతనూ ‘ప్రైస్’ ఘోషించింది. ఈ ఆరు ప్రాథమ్యాల్లో మొదటి అంశంగా ‘నాణ్యమైన విద్య’ ఉండటం చూస్తే దేశ భవిష్యత్తుకు విద్య ఎంతటి కీలకరంగమో తెలుస్తుంది. మనం అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగంలో పనిచేస్తున్నందుకు ఉపాధ్యాయులం అందరం గర్వపడదాం, మనవంతుగా విద్యా నైపుణ్యాభివృద్ధికి కృషి చేద్దాం. ఈ సందర్భంలో తమ సంస్థ పేర్కొన్న ప్రాథమ్యాల ఆమోదకుడుగానే కాకుండా, తాము జాతి ముందుంచిన ఆరు ప్రాథమ్యాలకు కట్టుబడి ప్రభుత్వాలు పని చేయనట్లైతే దేశం అధోగతిపాలే అంటున్న ‘ప్రైస్’ ఎం.డి & సిఇఒ రాజేష్ శుక్లాను అందరం అభినందించి తీరవలసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News