Sunday, April 28, 2024

ఉపాధి, నైపుణ్యం నిల్, విద్వేషం ఫుల్!

- Advertisement -
- Advertisement -

ఈ మధ్య రెండు అంశాలపై వార్తలు వచ్చాయి.ఒకటి దేశంలో నిపుణులైన కార్మికుల లేమి గురించి ఒక నివేదిక వెలువడింది. నైపుణ్య శిక్షణ పేరుతో చేసిన హడావుడి ఎలా విఫలమైందో అంతకు ముందే విశ్లేషణలు వచ్చాయి. విద్వేష ప్రసంగాల మీద నమోదైన కేసుల గురించి ఒక కమిటీని ఆగస్టు 18లోగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విద్వేష ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన యంత్రాంగం కొన్ని చోట్ల పని చేయటం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. రెండింటిలోనూ కేంద్ర వైఫల్యం స్పష్టమైంది. నిజానికి సుప్రీంకోర్టు ఆదేశం మోడీ సర్కార్‌ను పరోక్షంగా అభిశంసించటం తప్ప వేరు కాదు. నైపుణ్య మెరుగుదల కోసం ఎన్నో పథకాలు, ఏకంగా మంత్రినే ఏర్పాటు చేసిన ఘనత తమదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. ఇతర పథకాలు, ప్రకటనల మాదిరే ఇది కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. 2023 ఆగస్టు రెండవ వారంలో స్కిల్ ఫైనాన్సింగ్ రిపోర్టు 2023 కొన్ని అంశాలను వెల్లడించింది.

దేశంలోని 78% మంది యువతరానికి అభ్యాస సిద్ధమైన నైపుణ్యాలు లేవు.జనాభాలో 1524 సంవత్సరాల యువత 25.4 కోట్ల మంది ఉన్నారు. ఉపాధికి అవసరమైన ఉన్నత నైపుణ్యాలు కలిగిన వారు కేవలం 46.2% మందే ఉన్నారు. మొత్తం మీద నైపుణ్యాల ర్యాంకులో మన దేశం ప్రపంచంలో 60 వ స్థానంలో ఉంది. 2015 వరకు మన దేశంలోని కార్మికుల్లో 4.7 శాతమే నైపుణ్య శిక్షణ పొందగా, దక్షిణ కొరియాలో 90, జపాన్‌లో 80, బ్రిటన్‌లో 68, అమెరికాలో 52 శాతం ఉన్నారు. ఇక ప్రతి దాన్ని వాణిజ్య ప్రాతిపదికన లెక్కిస్తున్నారు గనుక 2030 నాటికి ప్రపంచ వృత్తి విద్యా మార్కెట్ విలువ పెరుగుదల 1,585 బిలియన్ డాలర్లకు పెరుగుతుందట. ఇక 2031 నాటికి విద్యా రుణాల మార్కెట్ విలువ 8,750 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. మన దేశంలో శిక్షణ పెద్ద ఎత్తున అవసరం గనుక నిధుల కేటాయింపు పెద్ద ఎత్తున పెంచాల్సి ఉంటుందని కూడా సదరు నివేదిక సలహా ఇచ్చింది. నైపుణ్యాలు, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ మార్కెట్ విలువ 2020లో మన దేశంలో 180 బిలియన్ డాలర్లు ఉందని, 2030 నాటికి అది 313 బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా.

2022 నాటికి 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు 2015లో ప్రధాని నరేంద్ర మోడీ ఆర్భాటంగా ప్రకటించారు. ఎన్‌డిటివీ వార్త ప్రకారం సంబంధిత మంత్రిత్వశాఖ సమాచారం మేరకు 2021 జనవరి 19 నాటికి దేశమంతటా 1.07 కోట్ల మందికి శిక్షణ ఇచ్చారు. వారిలో 46.27 లక్షల మందికి స్వల్పకాల శిక్షణ ఇచ్చారు. మిగిలిన వారికి అంతకు ముందు వారు నేర్చుకున్న దాని గురించి పునశ్చరణ తరగతులు నిర్వహించారు. వారిలో 19 లక్షల మందికి ఉపాధి దొరికింది. స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సమాచారం మేరకు 2023 ఫిబ్రవరి 6నాటికి 142 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 137 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. 124 లక్షల మందిని విశ్లేషించి 110 లక్షల మందికి సర్టిఫికెట్లు ఇచ్చారు. తరువాత ఈ పథకంలో కొన్ని మార్పులు చేశారు. ప్రభుత్వ విధానాల పరిశోధనా సంస్థ (సిపిపిఆర్) వెబ్‌సైట్‌లో 2023 ఫిబ్రవరి 4న ‘కొనసాగుతున్న యువ నైపుణ్య శిక్షణ నిర్లక్ష్యానికి దేశం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అనే శీర్షికతో ప్రచురించిన ఒక విశ్లేషణలోని అంశాల సారాంశం ఇలా ఉంది. ప్రభుత్వం గత అనేక సంవత్సరాలుగా చేసిన వాగ్దానాలు, సాధించిన దానికి చాలా తేడా ఉంది.

యువత నైపుణ్యానికి వస్తే దాని పునాదులు ఇప్పటికీ బలహీనంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అది ఇవ్వదు. రాష్ర్టపతి ద్రౌపది ముర్ము తన తొలి పార్లమెంటు ప్రసంగంలో ఏడు సార్లు యువత అనే పదాన్ని ఉచ్ఛరించారు తప్ప ఒక్కసారి కూడా నైపుణ్యం గురించి చెప్పలేదు. (అది మోడీ సర్కార్ రాసి ఇచ్చిన ప్రసంగమే) 2023 బడ్జెట్‌లో ప్రకటించిన నైపుణ్య శిక్షణ పథకాలు వాస్తవ రూపం ధరించాలంటే సంవత్సరాలు పడుతుంది. లోక్‌సభలో 2022 మార్చి 14న ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ప్రకారం పిఎంకెవివై 1.0 కింద 18.04 లక్షల మంది నమోదై శిక్షణ పొందగా వారిలో 13.32 లక్షల మందికి నైపుణ్య సర్టిఫికెట్లు ఇచ్చారు. వారిలో కేవలం 2.53 లక్షల మందికే లేదా 19 శాతం మందికి మాత్రమే ఉపాధి దొరికింది. పిఎంకెవివై 3.0 ప్రకారం స్థానిక అవసరాలకు అనుగుణ్యంగా నైపుణ్యంఇవ్వాలని నిర్ణయించారు. తమిళనాడు వంటి పారిశ్రామిక రాష్ర్టంలో కూడా మొత్తంగా అది విఫలమైంది. పిఎంకెవివై 3.0లో 4.98 లక్షల మంది నమోదు చేసుకోగా 4.45 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. వారిలో 1.72 లక్షల మంది సర్టిఫికెట్లను పొందారు.

వారిలో కేవలం 15,450 మందికిమాత్రమే ఉపాధి దొరికింది. పిఎంకెవివై 1.0లో 12,218 నైపుణ్య శిక్షణ కేంద్రాలుండగా, 2.0 నాటికి 9,030 కేంద్రాలు, 3.0లో కేవలం 683 మాత్రమే ఉన్నాయి. ఇదీ ఆ విశ్లేషణ సారం. యువ భారతం అని, తగినంత మంది పని చేసే వారున్నారని గొప్పలు చెప్పుకుంటే చాలదు. ఏటా కోటి మంది కొత్తగా పని కోసం వస్తున్నారు. ఏటికేడు కొత్త సాంకేతికతలు ముందుకు వస్తున్నాయి. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తే తప్ప ప్రయోజనం ఉండదు. ప్రైవేటు రంగం ఆ బాధ్యత తీసుకొనేందుకు ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. గతేడాది జూన్‌లో భారత్ కోసం కృత్రిమ మేథ అనే ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.పాతిక లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని చెప్పారు. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడపదాటడం లేదు. ఏ దేశానికైనా నిపుణులైన కార్మికులు అవసరం. అది వారి జీవన పరిస్థితులను మెరుగుపరుస్తుంది. అమెరికా మీడియా యుఎస్ న్యూస్ 2022 సెప్టెంబరులో 85 దేశాల పరిస్థితుల మీద సర్వే చేసి జాబితాను ప్రకటించింది.

కార్మిక నైపుణ్యంలో జపాన్, దక్షిణ కొరియా తరువాత చైనా మూడవ స్థానంలో ఉంది. మన దేశం ఇరవై ఒకటవ స్థానంలో ఉంది. మొత్తం మీద అన్ని రకాల నైపుణ్యాల్లో చైనా 17 వ దేశం కాగా, మనది 31వదిగా ఉంది. అమెరికా సిఐఎ ఫాక్ట్‌బుక్ పేరుతో సమాచారాన్ని విడుదల చేస్తుంది. దాని ప్రకారం 2021లో చైనాలో నిపుణులైన కార్మికులు 79 కోట్ల 14 లక్షల 83 వేల మంది ఉండగా, మన దేశంలో 46 కోట్ల, 66 లక్షల 70 వేల వంద మంది ఉన్నారు. నిజానికి ఈ సంఖ్య తక్కువేమీ కాదు గానీ పని చేసే వారికి అవకాశాలు కల్పించటమే కీలకం, మన దగ్గర అది లేదు. గడచిన నాలుగు దశాబ్దాల్లో నైపుణ్యం పెంచేందుకు చైనా ప్రభుత్వమే భారీ ఎత్తున ఖర్చు చేసింది. అందుకే నిపుణులైన కార్మికుల మీద పెట్టే ఖర్చు తప్పుతుంది గనుక అమెరికా, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయి, చైనా 17.7 లక్షల కోట్ల జిడిపిని సృష్టించగలిగింది. దాని తలసరి జిడిపి (పిపిపి) 19,338 డాలర్లు, మన దేశం 3.17 లక్షల కోట్ల డాలర్లు, తలసరి 7,334 డాలర్లతో ఉంది. ఏ దేశమైనా నైపుణ్యం పెంచటమే కాదు, పరిశోధన అభివృద్ధికి భారీ మొత్తాలను ఖర్చు చేయాల్సి ఉంది.

మన దేశంలో ఆ రెండూ లేవు. మరి మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అన్నది ప్రశ్న. చేసేందుకు ఉపాధి లేక, ఉపాధికి అవసరమైన నైపుణ్యం లేక నామ మాత్ర వేతనాలతో పని చేసే యువతను తప్పు దారి పట్టించటానికి అనువైన పరిస్థితులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నాలుగవతరం పారిశ్రామిక విప్లవం కాలంలో ఉన్నాం. దానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వైపు చూడకుండా ఆవుపేడ, మూత్రంలో ఉన్న బంగారాన్ని వెలికి తీస్తే ధనిక దేశంగా మారతాం అనే ఆలోచనలో ఇంకా ఉన్నామంటే అతిశయోక్తికాదు. బహుశా ఏదేశంలోనూ లేని విధంగా వాట్సాప్ ద్వారా తప్పుడు, విద్వేష సమాచారాన్ని క్షణాల్లో ఎలా వ్యాపింప చేయాలో మన పండితులు ప్రపంచానికి పాఠాలు నేర్పేవారిగా ఉన్నారు. టెక్నాలజీ పరుగులో ముందుండాలంటే పరిశోధన, అభివృద్ధి ఖర్చు లేకుండా కుదరదు. అందుకుగాను జిడిపిలో మన దేశ ఖర్చు 0.7% కాగా చైనా ఖర్చు 2.1శాతంగా ఉంది. ప్రతి లక్ష మంది జనాభాకు ఇజ్రాయెల్‌లో 834, దక్షిణ కొరియా 749, అమెరికాలో 441, చైనాలో 130 మంది పరిశోధకులు ఉండగా మన దేశంలో కేవలం 25 మంది మాత్రమే ఉన్నారంటే కేటాయింపు లేకుండా కేవలం కబుర్లు చెబుతున్నారన్నది స్పష్టం.

2022 అక్టోబరు 21న సుప్రీంకోర్టు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం తోడైంది. న్యాయమూర్తులు కెఎం జోసెఫ్, హృషీకేష్ రాయి బెంచ్ ‘ఇది 21వ శతాబ్దం, మనం దేవుడిని ఎంతకు దిగజార్చాము? మనకు శాస్త్రీయ దృష్టి ఉండాలని ఆర్టికల్ 51 చెబుతున్నది. మతం పేరుతో జరుగుతున్నదేమిటి? ఇది విషాదం’ అని చెప్పింది. మతం తటస్థంగా ఉండే దేశంలో విద్వేష వాతావరణం ఉందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తాము చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదని, ఏ మతానికి వ్యతిరేకంగా ఎవరు చేసిన వాటికైనా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు అలాంటి ద్వేషపూరిత ప్రసంగాలు ఏ మతం వారు చేసినప్పటికీ వాటి గురించి ఎవరూ ఫిర్యాదు చేసినా, చేయకున్నా స్వంతంగా కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు పాటించకుంటే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆర్టికల్ 51(ఎ) ప్రకారం ప్రతి ఒక్కరూ మౌలిక విధుల్లో భాగంగా శాస్త్రీయ దృష్టి, మానవత్వం, పరిశీలన, సంస్కరణ దృక్పథాన్ని పాటించాలని, భారత్ ఒక లౌకిక దేశంగా రాజ్యాంగం ఆలోచించిందని, భిన్నమతాలు, కులాలకు చెందిన వారు సామరస్య పూర్వకంగా జీవించనట్లైతే సోదరభావం ఉండదని కోర్టు పేర్కొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News