Sunday, April 28, 2024

రాష్ట్రంలో కులగణన

- Advertisement -
- Advertisement -

సమాజం కొత్త అడుగు వేసినప్పుడెల్లా ఆనందాశ్రువులు రాలుతాయి. సాంఘిక ఎత్తుపల్లాలను సరిచేయడానికి అపూర్వ చర్యకు శ్రీకారం చుట్టినప్పుడు సంతోషం కలుగుతుంది. దేశ రాజకీయాల్లో ఇప్పుడు వీస్తున్న గాలి కులగణన, అంటే వెనుకబడిన తరగతుల జనాభా లెక్కలు తేల్చడం, కులాల వారీగా జన గణనను చేపట్టడం. జాతీయ స్థాయిలో దీనిని నిర్వహించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరాకరించిన తర్వాత బీహార్‌లోని నితీశ్ కుమార్ నాయకత్వంలోని జెడి (యు)-, ఆర్‌జెడిల మహాఘట్ బంధన్ ప్రభుత్వం తొలిసారిగా ఆ రాష్ట్రంలో కులప్రాతిపదిక జనాభాలెక్కల సేకరణను విజయవంతంగా పూర్తి చేసింది. మన పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ కూడా దీనిని చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కులగణన ఆవశ్యకతను గుర్తించి తాము అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో దీనిని జరిపిస్తామని ప్రకటించారు. తెలంగాణలో కులగణనను చేపడతామని మొన్న జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ వాగ్దానం చేశారు.

అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతున్నది. త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లోనే కుల గణనకు సంబంధించిన బిల్లు ప్రవేశపెడతారని తెలుస్తున్నది. దీనికి సంబంధించిన విధివిధానాల ఖరారుకు ప్రత్యేక కమిటీ వేసి బీహార్‌లో జరిగిన పద్ధతిని అధ్యయనం చేయించనున్నారని సమాచారం. రాష్ట్రంలో కులగణన చేపట్టబోతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ అభినందించారు. కులగణన న్యాయసాధన పంథాలో తొలి అడుగు అని అన్నారు. సమాజ సాంఘిక, ఆర్ధిక ఆరోగ్యం గురించి తెలియకుండా దాని వికాసానికి, పేదరిక నిర్మూలనకు సరైన పథక రచన చేయలేమని ఆయన అన్నారు. దేశంలో అత్యధిక జనం ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. సగానికి మించిన జన సంఖ్య సరైన తిండి, ఇల్లు, ఇతర మానవీయ జీవన సౌకర్యాలకు దూరంగా బతుకుతున్నారు. ఈ పేదరికం కులాన్ని అంటిపెట్టుకొని ఉన్నమాట వాస్తవం. భారత దేశంలో శ్రామిక సేవక కులాలకు చెందిన బహుజనులు ఇప్పటికీ దుర్భర దారిద్య్రంలో ఉన్నారు.

వీరికి సరైన న్యాయం జరగాలంటే కులాలవారీ జనగణన అవసరమే. కొత్తగా మరికొన్ని కులాల వారికి రిజర్వేషన్లు కల్పించాలన్నా ఉన్న వాటిని పెంచాలన్నా ఈ లెక్క అత్యంత అవసరం. ఇందు కోసం బ్రిటిష్ వారు 1931లో సేకరించిన కులాలవారీ లెక్కల పైనే ప్రభుత్వాలు ఇప్పటికీ ఆధారపడుతున్నాయి. ప్రభుత్వాలు ఏ వర్గానికి, ఏ మేలు చేయాలన్నా సమగ్ర సామాజిక సర్వే తప్పనిసరి. అది లేకుండా అంచనా మీద ఆధారపడి ఇచ్చే సౌకర్యాలు కోర్టుల్లో నిలబడలేకపోతున్నాయి. బీహార్‌లో బిసిలు 62% పైగా ఉన్నారని అక్కడ తాజాగా జరిపిన కులగణనలో తేలింది. బీహార్ రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోని 214 కులాల్లో బిసి కులాలుగా గుర్తింపు పొందినవి 30 ఉండగా, అత్యంత వెనుకబడిన కులాలు 113, అగ్రవర్ణాలు 7ఉన్నట్టు తేలింది. మొత్తం జనాభా 130,725,310 కాగా, బిసిలు 82,544,450 (63.14%)గా వెల్లడైంది. బీహార్ జనాభాలో యాదవులు (14.26%) అత్యధికంగా ఉన్నట్టు బయటపడింది. ఉద్యోగాల్లో వీరికి వీరి జనాభాకు తగినట్టు ప్రాతినిధ్యం లేదని, యాదవుల కంటే కోయిరిలు, కుర్మలు ఎక్కువగా ఉన్నారని గణన విభజన తేల్చింది.

తెలంగాణలో కూడా బిసిలు జనాభాలో సగం కంటే అధికంగా ఉంటారు. దేశ వ్యాప్తంగానూ బిసిలు ఏభై శాతానికి పైగా ఉండగలరని భావిస్తున్నారు. కాని వారికి విద్య, ఉద్యోగాల్లో దక్కుతున్న రిజర్వేషన్లు 27 శాతమే. అన్ని రకాల రిజర్వేషన్లు కలిసి ఏభై శాతానికి మించకూడదని సుప్రీం కోర్టు గీసిన హద్దు గీత ఒకటి భయపెడుతున్నది. బిసిలకు, ఎంబిసిలకు వేరువేరుగా గణనీయమైన రిజర్వేషన్లు కల్పించిన తమిళనాడులో అవి 69% ఉన్నాయి.రాజ్యాంగం 9వ షెడ్యూలు కింద రక్షణ పొందుతున్నాయి. ఇంకొక వైపు దేశంలో ప్రైవేటైజేషన్‌ను ఒక యజ్ఞంలా జరిపిస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగం లో ఉద్యోగాలకు గుండు సున్నా చుడుతున్నది.ఈ నేపథ్యంలో వెనుకబడిన తరగతులకు సరైన న్యాయం జరగాలంటే వారి జనాభా లెక్కలు కులాలవారీగా తేలాల్సిందే. సుప్రీం కోర్టు విధించిన 50% పరిమితిని రద్దు చేయించేందుకు ఉద్యమ నిర్మాణ అవసరాన్ని కులగణన ముందు కు తీసుకు వచ్చే అవకాశముంది. సమీపంలో గల లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి, కాంగ్రెస్ పార్టీ కులగణనను ప్రధాన నినాదంగా చేసుకోనున్నాయి. ఈ అన్నింటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న బిసిల జనగణనకు ప్రత్యేక ప్రాధాన్యముంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News