Sunday, April 28, 2024

నితీశ్ చర్య అర్థతాత్పర్యాలు

- Advertisement -
- Advertisement -

అధికారం కోసం, డబ్బు కోసం నాయకులు పార్టీలు మారటం దేశ రాజకీయాలలో సర్వసాధారణమైపోయినందున ప్రజలకు ఒకప్పటి వలే ఇప్పుడు ఏవగింపు ఏమీ కలుగుతున్నట్లు లేదు. అయినప్పటికీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చర్య కొంత విస్తుపోయేట్లు చేసింది. ఆయనకు కొంత ప్రతిష్ఠ వుండడం కేవలం ఎంఎల్‌ఎగా కాక ముఖ్యమంత్రి స్థాయి కలిగి ఇంత త్వరత్వరగా ఐక్య సంఘటనలను మార్చటం, అది కూడా తన వంటి సామాజిక భావజాలమే గల లాలూప్రసాద్‌ను కాదని ఒక హిందూత్వ పార్టీతో చేరటం ఈ ఆశ్చర్యానికి కారణం. ఆ విధంగా మారటానికి నితీశ్ తన కారణాలు తానేవో చెప్తున్నారు. లాలూ నాయకత్వాన గల ఆర్‌జెడి తనకు తగిన గౌరవ మర్యాదలు ఇవ్వటం లేదన్నది ఆయన మాటల సారాంశం. ఇది కనీసం బయటకు వినేందుకు నమ్మదగినట్లు తోచదు. పూర్తి విషయాలు గాని, అసలు నిజాలు గాని ఇప్పట్లో తెలిసేవి కావు. బీహార్ పరిణామాలను గమనిస్తున్న వారికి కలుగుతున్నఅభిప్రాయాలు మాత్రం కొన్నున్నాయి.

యథాతథంగా నితీశ్ జెడియు కన్న లాలూ ఆర్‌జెడి బలమైన పార్టీ. గత అసెంబ్లీ ఎన్నికలలో జెడియు గెలిచిన సీట్లు 45 కాగా, ఆర్‌జెడి బలం 79. ఆ తర్వాత ఆర్‌జెడి బలం ఇంకా పెరుగుతూ వస్తున్నది. ఇదే స్థితి కొనసాగితే వచ్చే సంవత్సరం మళ్లీ ఎన్నికలలో ఈ సీట్ల వ్యత్యాసం కూడా పెరగవచ్చు. మరొక కోణం నుంచి చూసినప్పుడు నితీశ్‌కు వార్ధక్యం పైబడుతుండగా (జన్మించింది 1951లో), లాలూ కుమారుడైన ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు గత ఎన్నికలలోనే అనూహ్యమైన స్థాయిలో ప్రజాదరణ లభించింది. ఈ స్థితిలో వచ్చే ఎన్నికల తర్వాత ఒకవేళ మహాఘట్ బంధన్‌కు తిరిగి మెజారిటీ లభించినా నితీశ్ ముఖ్యమంత్రి కాగలగటం తేలిక కాదు. ఇది తానే గాక, తన సామాజిక వర్గమైన కుర్మీలు, కొన్ని ఇతర చిన్న వర్గాలు ఆమోదించ గలది కాదు. అట్లా గాక ఒక వేల తాము ఈ లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి సహకరించిన పక్షంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలప్పుడు తాను మళ్లీ ముఖ్యమంత్రి కాగల అవకాశం వుంటుంది.

ఇది గాక, ఇప్పటికే చర్చల్లో నలుగుతున్న మరొక కారణం కూడా కనిపిస్తున్నది. ‘ఇండియా’ కూటమి ఏర్పాటుకు చొరవ చూపింది నితీశ్ అన్నది తెలిసిందే. దానికి న్యాయంగా ఆలోచిస్తే కన్వీనర్ కావలసింది తనే. కాని, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రతిపక్ష ఐక్యత కోసం “ఎటువంటి త్యాగం అయినా” చేయగలమని, తమకు బిజెపి నుంచి దేశాన్ని రక్షించడం తప్ప నాయకత్వంపై ఏ మోజూ లేదని అంటూనే, మరొక వైపు చదరంగాలు సాగించి ఖర్గేను కన్వీనర్ చేసింది. ఒకవేళ తమ కూటమి గెలిచినట్లయితే ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని పార్టీ నాయకులతో అనిపిస్తున్నది. ఇట్లా పలు విధాలుగా, కాంగ్రెస్ “త్యాగం” ఎటువంటిదో ఎన్నికల కన్న ముందే తెలిసిపోయింది. నితీశ్‌కే కాదు, ‘ఇండియా’ కూటమి భాగస్వాములు అందరికీ. కనుకనే వారందరూ కాంగ్రెస్‌ను ఏ విధంగా ముప్పుతిప్పలు పెడుతున్నారో చూస్తూనే వున్నాం. ఈ తరహా కాంగ్రెస్ రాజకీయాల మధ్య, మరొక స్థాయిలో అసలు రాజకీయ మంటేనే నగ్నమైన అధికార క్రీడగా మారిన కాలంలో, నితీశ్ నిర్ణయంపై ఈ నేపథ్యం, భవిష్యత్తు గురించిన అనిశ్చితి వంటివి ప్రభావం చూపి వుంటే ఆశ్చర్యం లేదు.

అదెట్లున్నా గత పదేళ్ళలో అయిదు సార్లు, పోయిన 2020 ఎన్నికల తర్వాతనే మూడుసార్లు వేర్వేరు ఐక్య సంఘటనలలోకి మారిన నితీశ్, ఆయారాం గయారాం రాజకీయాలను పరాకాష్ఠ స్థాయికి తీసుకు పోయారని మాత్రం అనక తప్పదు. ఆ విధంగా ఇది ఆయా నితీశ్, గయా నితీశ్ రాజకీయంగా మారింది. ఈ ఆదివారం నాడు మళ్ళీ ముఖ్యమంత్రిగా తొమ్మిదవ సారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లేదా బిజెపి కూటమిలో తిరిగి రెండవసారి చేరిన వెనుక “తానిక ఎటూ వెళ్ళే ప్రసక్తిలే” దన్నారు. ఆ మాటకు వుండగల విశ్వసనీయత ఏమిటో చెప్పనక్కర లేదు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి ఏదైనా జరగవచ్చు, జరగకపోవచ్చు.ఈ సందర్భంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. నితీశ్ నిర్ణయం పై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యానిస్తూ దేశంలో ఆయారాం గయారాంలు చాలా మంది వున్నారని, నితీశ్ మోసం చేయటంలో నిపుణుడని అన్నారు. ఊసరవెల్లితో పోలికను కాంగ్రెస్ నాయకులు మరి కొందరు తెచ్చారు. ఆ పార్టీ ఇంగ్లీషు పండితులు శశిథరూర్ అయితే స్నోలీ గాస్లర్ (snolly goster) అనే అమెరికన్ ఇంగ్లీష్ పదాన్ని వాడుతూ నితీశ్ అంతకన్నా అథమం అన్నారు.

ఆ మాటకు అర్థం ఎంత మాత్రం నీతిలేని జిత్తులమారి రాజకీయ నాయకుడని, ఇంకా అనేక వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ వాదల నుంచి వినిపించాయి. ఇదంతా వినేందుకు బాగానే వుంటుంది. యథాతథంగా ఇవన్నీ సమంజసమైన విమర్శలే కూడా. కాని మన దేశంలో ఈ ఆయారాం గయారాం సంస్కృతిని ఆరంభించింది ఎవరు? 75 సంవత్సరాల ప్రజాస్వామ్యం తర్వాత దేశ రాజకీయాలు ఈ స్థితికి ఎందువల్ల పతన మయ్యాయి? మరొక స్థాయిలో బడుగు బలహీన వర్గాల ప్రత్యామ్నాయ రాజకీయాలు క్రమంగా స్థిరపడి పురోగమించడానికి బదులు ఏ కారణాల మూలంగా చిందర వందరగా తయారవుతున్నాయి? తాము బలపడి కాంగ్రెస్, బిజెపిలు రెండింటినీ శాసించడానికి బదులు ఆ రెండింటి మధ్య ఆటుపోట్లకు గురవుతున్నాయి? అన్నవి ఆలోచించవలసిన ప్రశ్నలు.ఆయారాం గయారాం సంస్కృతిని స్వయంగా కాంగ్రెస్ పార్టీయే ఇప్పటికి సరిగా 56 సంవత్సరాల క్రితం 1967లో హర్యానాలో మొదలు పెట్టిన విషయం అందరికీ తెలుసు. అప్పటి నుంచి వారు వివిధ రాష్ట్రాలలో , కేంద్రంలో తమ అధికారం కోసం ఎన్నెన్ని పార్టీలను ఎన్నెన్ని సార్లు చీల్చారో లెక్కించడం కూడా అసాధ్యం. విచిత్రమేమంటే, రాజీవ్ గాంధీ హయాంలో తామే పార్టీ ఫిరాయింపుల నిషేధం చట్టాన్ని చేసి కూడా తామే ఉల్లంఘిస్తూ పోయారు.

ఇదే విద్యను ఇతర పార్టీలు కూడా నేర్చుకున్నాయి. తొలుత కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అభివృద్ధి, సంక్షేమ విషయాలలో విఫలమై క్రమంగా ప్రజాదరణను కోల్పోసాగింది. ఆ కారణంగా అసెంబ్లీ, లోక్‌సభలలో మెజారిటీలను కూడా. కాని తనను తాను సరిదిద్దుకునే రాచమార్గానికి బదులు ఇతర పార్టీలను, సభ్యులను ప్రలోభపెట్టి చీల్చి అధికారం సంపాదించే వక్రమార్గాలను అనుసరించ సాగింది. ఈ జాడ్యం ఇతర పార్టీలకు వ్యాపించి మనం ఈ రోజున చూస్తున్న క్షీణ దశలోకి ప్రవేశించాము. ఇక బిజెపి అయితే ఈ విషయంలో ఎటువంటి సంకోచాలు చూపటం లేదు.అటువంటప్పుడు నితీశ్ గురించిన చర్చ అంతిమంగా గొంగట్లో తింటూ వెంట్రుకలను ఏరడం వంటిదే. విచారించవలసింది మన రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామిక వ్యవస్థ క్షీణత గురించి. మరొక స్థాయిలో విచారించవలసింది కొన్ని దశాబ్దాల పాటు ప్రత్యామ్నాయ రాజకీయం విషయమై దేశానికి హామీ ఇచ్చిన బడుగు, బలహీన వర్గాల, సాధారణ ప్రజల ప్రాతినిధ్య శక్తులు ఒక దశ తర్వాత నుంచి బలహీన పడుతుండడం గురించి. అదేగాని జరిగి వుండకపోతే నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్‌లు బీహార్‌లో గాని, అఖిలేశ్ యాదవ్, మాయావతిలు ఉత్తరప్రదేశ్‌గాని, వారి స్ఫూర్తితో అవే రాష్ట్రాలతో పాటు ఇంకా పలు చోట్ల పలువురు గాని, ‘ఇండియా’, ఎన్‌డిఎ కూటముల మధ్య రాజకీయాలను గడపవలసిన అవసరం గాని, ప్రస్తుతం నితీశ్ వలే విమర్శలకు గురయ్యే పరిస్థితిగాని వుండేవి కావు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News