Sunday, May 5, 2024

ఆమ్రపాలి సంస్థ ఎండీ పై హత్యకేసు నమోదు చేసిన సిబిఐ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఆమ్రపాలి గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్‌శర్మపై హత్య కేసు నమోదు చేసింది. పాట్నాహైకోర్టు గత నెల ఆదేశాలు జారీ చేయడంతో సిబిఐ బుధవారం శర్మను అరెస్టు చేసింది. బీహార్ లోని లఖిసరాయ్ లోని బాలికా విద్యాపీఠం కార్యదర్శి డాక్టర్ శరద్ చంద్ 2014 ఆగస్టు 8 ఉదయం 6.30 గంటల సమయంలో తన నివాసం లోని బాల్కనీలో వార్తాపత్రిక చదువుతుండగా హత్యకు గురయ్యారు. బాలికా విద్యాపీఠ్, లఖిసరాయ్ భూములు, ఆస్తులను లాక్కోవడానికి కుట్రలో భాగంగా ఈ హత్య చేశారని చంద్ భార్య ఉమాశర్మ ఆరోపించింది.

ఈ కేసును రాష్ట్ర పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని ఆరోపిస్తూ పాట్నాహైకోర్టును ఆశ్రయించింది. పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కేసు దర్యాప్తును సిబిఐకి కోర్టు అప్పగించింది. దీంతో గత నెల రంగం లోకి దిగిన సిబిఐ విద్యాసంస్థకు చెందిన భూమి, ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే ఈ కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. శర్మతోపాటు మరో ఐదుగురు కుట్ర పన్నారని అందులో భాగంగా ఈ హత్య జరిగిందని తెలియజేసింది. ఇందులో భాగంగా అనిల్ శర్మ మరికొందరి సహాయంతో శరద్ చంద్‌ను కార్యదర్శి పదవి నుంచి 2009లో తొలగించారని, అనంతరం విద్యాసంస్థకు చెందిన భూములు, ఆస్తులను స్వాధీనం చేసుకున్నారని తెలియజేసింది.

అయితే విద్యాసంస్థ నిర్వహణ విషయంపై చంద్ తరచూ ప్రశ్నిస్తుండటంతో చంద్ అడ్డును తొలగించుకోవాలని కుట్ర పన్నారని వెల్లడించింది. ఇందులో భాగంగా 2014 ఆగస్టు 8న తన ఇంట్లోని బాల్కనీలో వార్తా పత్రిక చదువుకుంటుండగా, కొందరు దుండగులు చంద్ర ఇంటిపై దాడి చేశారని , అనంతరం ఆయనను కాల్చి చంపారని ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. బ్యాంకును మోసగించిన కేసుల్లో ఉన్న శర్మ ఈ హత్యలో లఖిసరాయ్‌కు చెందిన ప్రవీణ్ సిన్హా, శ్యామ్‌సుందర్ ప్రసాద్, రాజేంద్ర సింఘానియా, శంభుశరణ్ సింగ్, అనితాసింఘ్ (అప్పటి బాలికా విద్యాపీఠ్ ప్రిన్సిపాల్) సహాయం తీసుకున్నారని ఆరోపించింది. సిన్హా, సింగ్ తమ పర్సనల్ అకౌంట్ ఓపెన్ చేసి బాలికా విద్యాపీఠ్ ఆదాయం కాజేశారని ఆరోపించింది. రిట్ పిటిషన్‌లో సాక్షాలు ఉన్నప్పటికీ సిఐడి ఈ కేనును సరిగ్గా దర్యాప్తు చేయకుండా ఇన్నాళ్లూ ఆలస్యం చేసిందని కోర్టు గమనించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News