Sunday, April 28, 2024

ఎన్‌టిఆర్ భవన్‌లో టిటిడిపి నేతల సంబరాలు

- Advertisement -
- Advertisement -

టపాకాయల మోత.. పలువురికి మిఠాయిల పంపిణీ

మన తెలంగాణ / హైదరాబాద్ : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరైన సందర్బంగా హైదరాబాద్ ఎన్‌టిఆర్ భవన్‌లో తెలుగుదేశం నాయకులు భారీ ఎత్తున సంబరాలు చేశారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి. మల్లి కార్జునరావు తీర్పు వెల్లడించడంతో ఆ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువరించడంతో కార్యకర్తలు, పార్టీ నేతలు హుటాహుటిన పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌కు చేరుకుని భారీగా బాణాసంచాలను కాలుస్తూ, డప్పు వాద్యాలతో నృత్యాలు చేస్తూ స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని తెలియజేశారు.

చంద్రబాబు వెంటే మేము అంటూ ఏపీ సర్కారుపై పోరాడండని.. బాబూ.. సంఘర్ష్ కరో హమ్ తుమారే సాథ్ హై అంటూ నినాదాలు చేశారు. బాణా సంచా పేల్చి పార్టీ నేతలకు, కార్యకర్తలకు జోష్ నింపడమే కాకుండా.. బంజారాహిల్స్ ప్రధాన రహదారి మీదుగా వెళ్లున్న ప్రయాణికులకూ వారి వాహనాలు ఆపి మరీ మిఠాయిలు పంచారు. ఈ సమయంలో టపాకాయల సంబరాలతో ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్ దద్దరిల్లి పోయింది. ఈ సందర్భంగా ఆ దారి గుండా వెళ్తున్న పలు వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొద్ది సేపు ఆగి టిడిపి సంబరాలను వీక్షించాయి. అయితే ఇదే సమయంలో పోలీసులు టపాకాయలు లోపల కాల్చుకోండంటూ కాస్త ముందుకు ఆ టపాకులను తోసేశారు. అయితే అటు టిడిపి నేతలు, ఆ దారిన వెళ్లున్న ప్రయాణికులు పోలీసులను వారించి బాణా సంచా పేల్చుకోనివ్వండని చేతులెత్తి దండం పెట్టడంతో పోలీసులు చేసేది లేక మిన్నకుండి పోయారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త కంభంపాటి రామమోహన్‌రావు, పోలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు, జాతీయ పార్టీ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన,తెలుగు మహిళ అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు శ్రీనివాసులు నాయుడు, డా. ఏ.ఎస్.రావు, బుగిడి అనూప్, రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు పోలంపల్లి అశోక్, బీసీ సెల్ అధ్యక్షులు శ్రీపతి సతీష్, మేడ్చల్ పార్లమెంట్ అధ్యక్షులు అశోక్ గౌడ్, నల్గొండ పార్లమెంట్ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్‌రెడ్డి, ప్రొ.తిరునగరి జ్యోత్స్న, తదితర నాయకులు పాల్గొన్నారు.

సత్యం గెలిచింది..అసత్యంపై యుద్ధం మొదలవబోతోంది : నారా లోకేష్
సత్యం గెలిచింది..అసత్యంపై యుద్ధం మొదలవబోతోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబుకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఏపి హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై లోకేష్ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

చంద్రబాబు పై పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు, జగన్ కోసం జగన్ వ్యవస్థల ద్వారా బనాయించిందని బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైందన్నారు. ‘సత్యమేవజయతే’ నినాదం మరోసారి నిరూపితమైందన్నారు. ఆలస్యమైనా సత్యమే గెలిచిందని పేర్కొన్నారు. జగన్ కనుసన్నల్లోని వ్యవస్థల మేనేజ్మెంటుపైనే సత్యం గెలిచిందన్నారు. చంద్రబాబు నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం మరోసారి సమున్నతంగా తల ఎత్తుకుని నిలబడిందన్నారు. నేను తప్పు చేయను, తప్పు చేయనివ్వను అని బాబు ఎప్పుడూ చెప్పేదే మరోసారి నిజమైందన్నారు. బాబును అరెస్టు చేసి 50 రోజులకి పైగా జైలులో పెట్టినప్పటికీ,  ఇప్పటి వరకు కనీసం ఒక్క ఆధారం కూడా ఇప్పటికీ కోర్టు ముందు ఉంచలేకపోయారంటే..వారి తప్పుడు కుట్రలు న్యాయం ముందు బద్దలయ్యాయన్నారు.

కేసులో ఆరోపించినట్టు షెల్ కంపెనీలు అనేవి లేవని తేలిపోయిందని, తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయనేది పచ్చి అబద్ధమని అన్నారు. వాట్సాప్ మెసేజ్ చాట్ అంతా కూడా బూటకమని స్పష్టమైందని లోకేష్ తెలిపారు. చంద్రబాబుకి రూపాయి కూడా రాని స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చారనేది అవాస్తవమని న్యాయస్థానమే తేల్చేసిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీంని స్కాంగా మార్చేసి చంద్రబాబు 45 ఏళ్ల క్లీన్ పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి జగన్ అండ్ కో పన్నాగమని దేశమంతటికీ తెలిసిందన్నారు. హైకోర్టు వ్యాఖ్యలతో కడిగిన ముత్యంలా తమ బాబు ఈ కుట్రకేసులన్నింటినీ జయిస్తారని, సత్యం గెలిచింది, జగన్ అనే అసత్యంపై యుద్ధం ఆరంభం కానుందని నారా లోకేష్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News