Tuesday, March 5, 2024

24గం. గడువిస్తున్నా…

- Advertisement -
- Advertisement -

Center is making anti-farmer decisions:KCR

వడ్ల సేకరణపై రైతుల డిమాండ్‌ను అంగీకరిస్తే సరే..
లేకుంటే కేంద్రం సంగతి చూస్తా

మోడీజీ, నన్ను భయపెట్టుడు కాదు, నేనేందో మీరు తెలుసుకునేలా చేస్తా
రైతులతో పెట్టుకున్నావ్.. ఇక మీకు కాలం చెల్లినట్టే
సిఎంని జైల్లో వేస్తానంటారా? దమ్ముంటే రండి ఊరికే మొరగడం సరికాదు త్వరలోనే ఢిల్లీ వస్తా, మీ ప్రభుత్వానికి ప్రకంపనలు కలిగే రీతిలో అమ్ములపొదిలోని అన్ని అస్త్రాలను బయటకు తీస్తా
రైతుల కోసం తాడోపేడో తేల్చుకుంటా
అందరిలో రగులుతున్న జ్వాల నా హృదయంలోనూ రగులుతోంది మిమ్మల్ని నాశనం చేస్తుంది
కేంద్రం నిర్ణయాలను ప్రశ్నించినా, ఎదురు తిరిగినా సిబిఐ, ఇడి, ఐటి కేసులు పెడుతారా?, వాటికి నేను భయపడతానని అనుకున్నారా? మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు వెనుకాడను, హిట్లర్‌కే దిక్కులేదు

కేంద్రం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నది
మోడీ పాలనలో రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు
రైతులు పండించిన ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తోంది, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరాడడ మంటే కేంద్రానికి అంతకంటే సిగ్గుచేటు మరోటి ఉండదు

మన తెలంగాణ/హైదరాబాద్ : ధాన్య సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అపసవ్య విధానాన్ని టిఆర్‌ఎస్‌పార్టీఅధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారంనాడు ఢిల్లీలో తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ప్రధాని మోడీని ఉద్దేశించి రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. మోడీజీ! నన్ను భయపెట్టుడు కాదు… నేనేందో మీరు తెలుసుకునేలా చేస్తా! రైతులతో పెట్టుకున్నావు… రైతు కన్నీటికి కారుకుడయ్యవు….ఇక మీకు (బిజెపి) కాలం చెల్లినట్లే . ముఖ్యమంత్రిని జైల్లో వేస్తామంటారా? దమ్ముంటే రండి! అంటూ సవాల్ విసిరారు. ఊరికే మొరగడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి 24 గంటల గడువు ఇస్తున్నా…. రైతులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే సరేసరి….లేదంటే కేంద్రం సంగతి చూస్తామని కెసిఆర్ కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. మళ్లీ ఢిల్లీ వస్తా… కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. రైతు పండించిన ధాన్యాన్ని కేంద్రం సేకరించడంతో పాటు ధాన్యం సేకరణలో సమగ్ర జాతీయ విధానాన్ని అవలంబించాలనే డిమాండ్‌తో సిఎం కెసిఆర్ అధ్యక్షతన, టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీ తెలంగాణ భవన్‌లో సోమవారం భారీ ఎత్తున నిరసన, ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు.

కేంద్రం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించినా, ఎదురు తిరిగినా సిబిఐ, ఇడి, ఐటి (ఆదాయ పన్ను)కేసులు పెడతారా?వాటికి కెసిఆర్ భయపడతారని అనుకుంటున్నావా?అని నిలదీశారు. లెక్కలేనన్ని కేసులు పెట్టుకోండి! నేను మాత్రం మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు వెనకడుగు వేసేది లేదు అని అన్నారు. కేంద్రంపై తాము తలపెట్టిన ధర్మ పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు. తెలంగాణ నుంచి సుమారు 2 వేల కిలోమీటర్ల దూరం వచ్చి దీక్ష చేస్తున్నాం….. ఇంత దూరం వచ్చి ఢిల్లీలో ఆందోళన చేయడానికి కారణమెవరని ప్రశ్నించారు. ఎవరితోనైనా గొడవ పడొచ్చు కానీ రైతులతో పడొద్దని కేంద్రానికి ఆయన హితవు పలికారు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరన్నారు.

తెలంగాణ ప్రజలను నూకలు తినడం అలవాటు చేసుకోమని చెప్పడం కేంద్ర మంత్రి పీయూష్ అనడం మర్యాదేనా? ఇదే భారత ప్రభుత్వ విధానమా ? న్యాయసమ్మతమైన డిమాండ్‌తో వచ్చిన మంత్రుల బృందం పట్ల ఇలా వ్యవహరిస్తారా? అని నిలదీశారు. అతను ఏమనుకుంటాడో అర్థం కాదు. అర్థపర్థంలేని మాటలు మాట్లాడుతాడు అని మండిపడ్డారు.. దేశంలోని మారుమూల ప్రాంతాల గురించి ఆయనకేం తెలుసో తనకు అర్థం కావడం లేదన్నారు. దేశానికి ఒక కొత్త వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని తాము కోరుతున్నామన్నారు. మీకు చేతకాకపోతే చెప్పండి…రానున్న కాలంలో మిమ్మల్ని తొలగించి, కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వంతోనైనా భారతదేశ సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించుకుంటామన్నారు.

హిట్లర్, నెపోలియన్ వంటి వారే కాలగర్భంలో కలిశారు హిట్లర్, నెపోలియన్ వంటి అహంకారులే కాలగర్భంలో కలిసిపోయారు….మీరెంత? అని మోడీ, అమిత్ షా, పీయూష్ గోయల్‌పై సిఎం కెసిఆర్ ధ్వజమెత్తారు. ప్రజలను, రైతులను అవమానించిన ఏ ప్రభుత్వం నిలిచినట్లు చరిత్రలో లేదన్నారు. త్వరలోనే మీరు పారిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కేంద్రం అధికార మదంతో వ్యవహిస్తోందని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకునేందుకు మోడీ ప్రభుత్వానికి మనస్సు రాదు కానీ….కార్పొరేట్ సంస్థలకు మాత్రం అన్ని దోచిపెడుతుందా? అని కెసిఆర్ మండిపడ్డారు. ఇదే రైతుల పట్ల మోడీకి ఉన్న నీతి? అని నిలదీశారు. రైతుల గోసను పట్టించుకోదు….రాష్ట్రాధినేతగా తాను చేసిన విజ్ఞప్తులను పట్టించుకోదా? అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కోనుగులు కేంద్రంతో చర్చించడానికి వచ్చిన మంత్రుల బృందాన్ని అవమానిస్తదా? రైతుల పక్షాన తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు మాత్రమే చేయమంటున్నామన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేని శక్తి లేనప్పుడు రాష్ట్ర బిజెపి నాయకులతో ఎందుకు స్టేట్‌మెంట్లు ఇప్పించారు? అని ప్రశ్నించారు. కనీసం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి సోయి లేకపోతే…. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఏమైందన్నారు.

బిజెపిలో అంతా సత్యహరిశ్చంద్రులే ఉన్నారా?

విపక్షాలపై ఇడి, సిఐబి, ఐటి అధికారులతో దాడులు చేయిస్తున్నా కేంద్రం…మరి బిజెపి నాయకులపై ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఆ పార్టీలో అంతా సత్యహరిశ్చంద్రులే ఉన్నారా?అని నిలదీశారు. వాళ్ల దగ్గరికి సిబిఐ, ఇడి, ఐటి ఎందుకు వెళ్ళవని ప్రశ్నించారు. అసలు బిజెపి అంటేనే పైన పటారం …లోన లొటారం పార్టీ అని విమర్శించారు. వారు బయటకు చెప్పేది ఒకటి…చేసేది మరోటి అని విమర్శించారు. ఓట్లు…సీట్ల కోసం ఏ స్థాయికైనా బిజెపి దిగజారుతోందని మండిపడ్డారు. కేవలం ఎన్నికలప్పుడే మోడీ ప్రభుత్వానికి రైతులు గుర్తుకువస్తారన్నారు. ఆ తరువాత అంతా కార్పొరేట్ సంస్థలే మోడీకి కనిపిస్తాయని మండిపడ్డారు.

ఆదుకోవాల్సింది పోయి….అవమానిస్తారా?

దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తే ప్రశంసించేది పోయి కేంద్రం అవమానిస్తోందని కెసిఆర్ దుయ్యబట్టారు. ఎన్నో కష్ట నష్టాలు పడి రాష్ట్రాన్ని సాధించుకుని కోటి ఎకరాల్లో పంట పండిస్తూ ముందుకెళతున్నామన్నారు. అంటువంటి రాష్ట్రాన్ని ఆదుకోవాల్సింది పోయి. అవమానించమేంటని? ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పంట మార్పిడి చేయమందని తాము రైతులకు చెబితే రాష్ట్ర బిజెపి నేతలు మాత్రం వరి వేయమని కర్షకులను రెచ్చగొట్టారన్నారు. రైతుల పక్షాన ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రులను ఎలా అవమానిస్తారని కెసిఆర్ మండిపడ్డారు. అన్నం పెట్టే రైతులు భిక్షగాళ్లు కాదన్నారు.

తికాయత్‌ను అవమానించింది

కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన తికాయతును కూడా ఎన్నో రకాలుగా మోడీ ప్రభుత్వం అవమానించిందని కెసిఆర్ మండిపడ్డారు. తికాయత్‌ను దేశ ద్రోహి, ఉగ్రవాది అన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కర్షకుల కోసం ఎన్నో అవమానాలకు. మరెన్నో కష్టాలను భరిస్తూనే ఆయన ముందుకు సాగుతున్నారని కెసిఆర్ ప్రశంసించారు.తెలిపారు. తెలంగాణ ప్రజానీకం, టిఆర్‌ఎస్ శ్రేణులు తికాయత్‌వెంట ఉంటాయని మాటిచ్చారు. రాష్ట్ర ప్రజానీకంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన అవమానకర వ్యాఖ్యలను గుర్తుపెట్టుకుంటామన్నారు. కాగా టిఆర్‌ఎస్ దీక్షకు సంపూర్ణ మద్దతిచ్చేందుకు వచ్చిన తికాయత్‌కు ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమకారులను ఖలిస్తానీలు… ఉగ్రవాదులుగా పేర్కొన్నదన్నారు. ఏదేదో అన్నది…. ఎన్నో కష్టాలు పెట్టిందన్నారు. నల్ల చట్టాలపై తికాయత్ 13 నెలల పాటు నిరాటంకంగా చేపట్టిన ఉద్యమం బహుశా ప్రపంచంలోనే మరెక్కడా జరగలేదన్నారు. వారు చేపట్టిన ఆందోళనతో సాక్షాత్తు ప్రధానమంత్రే రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందన్నారు. మన ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పడంలో దిట్ట అని…. ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినపుడు క్షమాపణ చెబుతారన్నారు. ఇంతకుముందు కూడా కొందరికి క్షమాపణ చెప్పారని.. భవిష్యత్‌లో కూడా క్షమాపణ చెప్తారేమోననిపిస్తోందన్నారు.

అనేక సంస్కరణలు తీసుకొచ్చాం

రాష్ట్రం వచ్చాక రైతుల కోసం అనేక సంస్కరణలు తెచ్చామన్న కెసిఆర్…. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించామన్నారు. రైతులకు ఇరవైనాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన నీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నామన్నారు. సాగుకు సరిపడా నీటిని అందిస్తున్నామన్నారు. కోటి ఎకరాల భూమి సాగులోకి వచ్చిందన్నారు. ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్‌లో విద్యుత్ కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా సిఎం గుర్తు చేశారు.

ఒకనాడు కేంద్రం తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన తర్వాత ఎన్నో బాధలు పడాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ కోసం చేపట్టిన ప్రాజెక్టుల ప్రయోజనాలు తమకు దక్కలేదన్నారు. ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులను దశాబ్దాల దాకా నిలిపివేశారన్నారు. కాలువలు, చెరువుల ద్వారా నీరు లభించకపోవటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో భూగర్భ నీటి వనరుల పై ఆధారపడ్డాం. దేశవ్యాప్తంగా ఎక్కడా లేనంతగా 30 లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు. రైతులు తమ రక్తం, చెమట చిందించి వీటిని తవ్వించుకున్నారన్నారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తరువాత మోటార్, విద్యుత్ తీగలు, బోర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో సాగు రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని గుర్తు చేశారు. తెలంగాణ రైతుల ఆత్మహత్యలు భారీగా ఉండేవన్నారు. 6 దశాబ్దాలపాటు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడామన్నారు. రాష్ట్ర సాధనలో వందలాది మంది యువత బలిదానాలు చేసిందని స్మరించుకున్నారు.

ఆయన గోల్‌మాల్ గోయల్

కేంద్రమంత్రి పియుష్ గోయల్‌పై సిఎం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పియుష్ కాదు…. పియుష్ గోల్‌మాల్ అని కెసిఆర్ విమర్శించారు. ఆయనకు వ్యవసాయంపై సంపూర్ణ అవగాహన కూడా లేదన్నారు. రాష్ట్ర రైతులను ఉద్దేశించి కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమైనవని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలని పియుష్ గోయల్ చెప్పారన్నారు. అసలు తాము గోయల్ వద్ద అడుక్కోవడానికి వచ్చామా? అని మండిపడ్డారు. ఇంత అహంకారం ఆయనకు ఎక్కడి నుండి వచ్చిందన్నారు.

కొంచమైనా సిగ్గుతెచ్చుకోండి!

కొంమైనా సిగ్గు తెచ్చుకోండి! సిగ్గులేని బిజెపి పార్టీ అని కెసిఆర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో వారు ఎందుకు ధర్నా చేస్తున్నారు. ఏ కారణంచేత ధర్నా చేస్తున్నారని నిలదీశారు. కేంద్రం సహకరించకపోయినా రైతులను గంగలోకి నెట్టేంత బలహీన ప్రభుత్వం తమది కాదన్నారు. . రైతులను వందశాతం రక్షించుకుంటామన్నారు. మోడీ ప్రభుత్వం కుట్రల ప్రభుత్వమన్నారు. తెలంగాణ ప్రజల ఓట్లు కావాలిగానీ… ధాన్యం వద్దా? అని ఎద్దేవా చేశారు. ఇక నుంచి మోడీ కుట్రలు దేశంలో నడవవన్నారు. ఈ విషయంపై తిరిగి వచ్చి ఢిల్లీలో కూర్చోని సర్కార్ విధానమేంటో తేలుస్తామన్నారు. అందరు రాజకీయనాయకులను ఏకం చేస్తామన్నారు. దేశ రైతులకు రాజ్యాంగరక్షణ లభించేదాకా, రాజ్యాంగపరంగా మద్దతుధర లభించేదాకా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఈ ధర్నాలో మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, వివిధ కార్పొరేషన్ సంస్థల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ తికాయత్
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సిఎం కెసిఆర్ రైతుకోసం కేంద్రంపై చేస్తున్న పోరాటానికి జాతీయ రైతుసంఘం నేత రాకేశ్ సింగ్ తికాయత్ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కేంద్రం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని ధ్వజమెత్తారు. మోడీ పాలనలో దేశ రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారన్నారు. అసలు దేశంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు.రైతులు పండించిన ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ వచ్చి ధర్నా చేస్తోందన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరాడడం అంటే కేంద్రానికి అంతకన్న సిగ్గుచేటు మరోటి ఉండదన్నారు. ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలన్నారు. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుందన్నారు. సాగుచట్టాల రద్దు కోసం ఢిల్లీలో కొన్నాళ్ళ క్రితం 13 నెలల పాటు ఉద్యమించామన్నారు. కేంద్రం ఏడాదికి 3 విడతలుగా రైతులకు రూ. 6 వేలు ఇస్తోందని…. ఏడాదికి రూ. 6 వేలు ఇస్తూ రైతులను ఉద్ధరిస్తున్నట్లు కేంద్రం మాట్లాడుతోంది అని ఎద్దెవా చేశారు. సిఎం కెసిఆర్ రైతులకు మద్దతుగా ఈ ఆందోళన చేస్తున్నారన్నారు. ఆయన చేస్తున్నది రాజకీయ ఉద్యమం కాదని అని తికాయత్ స్పష్టం చేశారు. రైతుల కోసం ఆయన చేస్తున్న పోరాటం అభినందనీయమని తికాయత్ ప్రశంసలు కురిపించారు.రైతుల కోసం మమతా బెనర్జీ కూడా ఆందోళన చేస్తున్నారు. రైతుల పక్షాన కెసిఆర్ చేస్తున్న ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. కెసిఆరే కాదు… రైతుల కోసం పోరాటం ఎవరు చేసినా వారికి మద్ధతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

జై కెసిఆర్ నినాదాలతో దద్దరిల్లిన ప్రాంగణం
ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లోని ధర్నా ప్రాంగణానికి చేరుకున్న సిఎం కెసిఆర్ ముందుగామహత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించారు. అనంతరం జై కెసిఆర్ నినాదాలతో ధర్నా ప్రాంగతం అంతా దద్దరిల్లింది. కాగా ధర్నాలో కేంద్రం వడ్లు కొనాలని ప్రదర్శించిన ప్లకార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘తెలంగాణ వరికి ఉరి వేస్తున్న ప్రధాని మోడీ‘ అనే నినాదంతో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వినూత్న పద్ధతిలో వరి ధాన్యం తో జరిపిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అలాగే స్టేజ్ మీద వడ్ల రాశి, వడ్ల బస్తాలతో నింపడం సభికులను అమితంగా ఆకర్షించింది. ఇక తెలంగాణ భవన్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లు సైతం అందరిని ఆకట్టుకున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News