Monday, July 22, 2024

వరి మద్దతు ధర పెంపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం వరిధాన్యానికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ని క్వింటాలుకు రూ 117 చొప్పున పెంచింది. ఖరీఫ్ సీజన్‌కు పెంచిన ధర 5.38 శాతంగా ఉంది. ఇక సాగు వ్యయంతో పోలిస్తే ఇది ఒక్కటిన్నర శాతం ఎక్కువ. పెంచిన ధరలతో ఇకపై వరి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ 2,300 అవుతుంది. కాగా నాణ్యమైన ఎ గ్రేడ్ వరికి క్వింటాలుకు రూ 2320 ఖరారు అయింది. ఇక ఖరీఫ్ సీజన్‌లోనే ఇతర 14 పంటలకు కూడా కనీస మద్దతు ధరలను పెంచారు. వీటిలో పత్తి ఎంఎస్‌పిని సాధారణ రకానికి క్వింటాలుకు రూ 7,121గా ఖరారు చేశారు. మరో రకానికి ధరను రూ 7521 చేశారు. ఇది ఇంతకు ముందటి ధరలతో పోలిస్తే రూ 510 ఎక్కువ. జొన్నల కనీస మద్దతు ధరను రూ 3371 , రాగులల ధరలను రూ 4290, సజ్జల ధరలను రూ 2625గా ఖరారు చేయగా, మొక్కజొన్న ధరను క్వింటాలుకు రూ 2,225గా నిర్ణయించారు. పప్పు ధాన్యాల మద్దతు ధరలను కూడా పెంచారు.పెసర ధరలను క్వింటాలకు రూ 8,682, కంది పప్పు ధరను రూ 7550గా , మినపపప్పు ధరను రూ 7400గా నిర్ణయించారు. ఇందులో భాగంగా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాల వివరాలను ఆ తరువాత సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు తెలిపారు.

పొద్దుతిరుగుడు, పల్లీ మద్దతు ధరలను కూడా పెంచారు. మోడీ ప్రభుత్వం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ రైతాంగ ప్రయోజనాల కోణంలోనే వ్యవహరిస్తుందన్నారు. ఇప్పుడు పెంచిన ధరలతో వరి, ఇతర ప్రధాన పంటల రైతుకు వెన్నుదన్ను అవుతుందని మంత్రి వివరించారు. గత ఏడాది ఖరీఫ్ కాలంతో పోలిస్తే రైతాంగానికి మొత్తం మీద రూ 35000 కోట్ల మేర ప్రయోజనం కల్గుతుందని ఆయన అధికారిక లెక్కలు వెల్లడించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ 3.0 కేబినెట్ తొలి భేటీ ఇదే . బుధవారం జరిగిన మంత్రి మండలి ఎక్కువగా రైతాంగ విషయాలపై దృష్టి సారించినట్లు తెలియచేయడానికి యత్నించింది. 2024 2025 ఖరీఫ్ పంట మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ఈ పెంపుదల ప్రకటించారు. ఇప్పటికే అదనపు బియ్యం నిల్వల విషయంపై కేంద్రం నిర్ణయం జాప్యంలో ఉంది. అయితే వరి పండించే మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ధాన్యం మద్దతు ధర పెంచినట్లు వెల్లడైంది. వ్యవసాయ సాగు, ధరల కమిషన్ (సిఎసిపి) సిఫార్సుల మేరకు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని కనీస మద్దతు ధరలను పెంచినట్లు మంత్రి తెలిపారు.

ఎంఎస్‌పి అనేది సాగు వ్యయంతో పోలిస్తే ఒక్కటిన్నర శాతం అధికంగా ఉండాలనేదే మోడీ ప్రభుత్వ ఆలోచనా విధానం అని 2018 కేంద్ర బడ్జెట్‌లో కూడా ఈ పాలసీని స్పష్టం చేశారని తెలిపారు. చట్టబద్ధమైన మద్దతు ధరల ఖరారు అనేది రైతాంగ చిరకాల డిమాండ్‌గా ఉంది. దీనికోసమే ఉద్యమాలు సాగాయి. రైతులకు మోడీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఈ క్రమంలో ఇప్పటి నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి వివరించారు. ఖరీఫ్ సీజన్ ఆరంభ దశలో తొలిసారిగా భేటీ అయిన కేబినెట్‌లో ఈ నిర్ణయాలు ఖరారు అయ్యాయని చెప్పారు. కేబినెట్ భేటీలో మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు.
మహారాష్ట్ర వాధావన్‌లో గ్రీన్‌ఫీల్డ్ మేజర్ పోర్టు
రూ 76,200 కోట్లప్రాజెక్టుకు కేబినెట్ ఓకె
మహారాష్ట్రలోని వాధావన్‌లో వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే రీతిలో గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్టు అభివృద్ధికి రూ 76,200 కోట్ల కేటాయింపుల ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. నిర్మాణ బాధ్యతలను వివిపిఎల్ కంపెనీకి అప్పగించారు. ఇటువంటి పోర్టు ప్రపంచంలో పది అగ్రస్థాయి ప్రామాణిక పోర్టులలో ఒక్కటిగా ఉంటుంది. వారణాసి ఎయిర్‌పోర్టు అభివృద్థికి రూ 2869 కోట్లు కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తీర ప్రాంత గాలిమరల ప్రాజెక్టుకు రూ 7453 కోట్లు కేటాయింపుల ప్రతిపాదనకు అంగీకారం దక్కింది.ఇందులో ఒక్కటి గుజరాత్‌లో ఉంటుంది. విజిఎఫ్ స్కీం పరిధిలో దీనిని చేపడుతారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News