Monday, June 24, 2024

చంద్రయాన్-3 ఆవిష్కరణలు

- Advertisement -
- Advertisement -

భారత్ పంపిన చంద్రయాన్- 3 మిషన్ స్పేస్ క్రాఫ్ట్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు చంద్రుడిపై 10 రోజుల పాటు డేటా, ఫోటోల సేకరణ జరిపి వాటిని పరిశీలన కోసం భూమికి పంపాయి. ల్యాండర్- రోవర్‌లు పని చేయడానికి అవసరమైన బ్యాటరీలు ఛార్జ్ అవడానికి సూర్యరశ్మి అవసరం. దక్షిణ ధ్రువంపై పగటి సమయం ముగియడంతో గత ఏడాది సెప్టెంబర్ తొలి వారంలో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను ఇస్రో స్లీప్ మోడ్‌లోకి పంపింది. తిరిగి సెప్టెంబర్ 22వ తేదీన సూర్యోదయం అయ్యే సమయాన రెండూ తిరిగి యాక్టివ్ అవుతాయని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశించారు. ల్యాండర్ చంద్రుడిపై దిగిన క్షణం నుంచి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు తీసిన చిత్రాలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్రో సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అందజేసింది. ఈ చిత్రాలు చాలా మంది భారతీయుల్లో సరికొత్త ఆసక్తిని రేకెత్తించాయి.

కొంత మంది మాత్రం ఈ సమాచారం ప్రాముఖ్యత ఏంటి, అవి ఎందుకు ఉపయోగపడతాయని ఆన్‌లైన్‌లో పరిశోధనలు ప్రారంభించారు. దీంతో నాసా పూర్వపు శాస్త్రవేత్త, ఢిల్లీకి చెందిన స్పేస్ ఎడ్యుకేషన్ సంస్థ కో ఫౌండర్ మిలా మిత్రా జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. ప్రజ్ఞాన్ రోవర్‌ను స్లీప్ మోడ్‌లోకి పంపే కొన్ని గంటల ముందు ప్రజ్ఞాన్ రోవర్ 100 మీటర్లు (328 అడుగులు) పైగా ప్రయాణించింది. ఇంకా కొనసాగుతోంది అని ఇస్రో ట్వీట్ చేసింది. ప్రజ్ఞాన్ సెకనుకు 1 సెంటీ మీటర్ వేగంతో 6 చక్రాలతో చాలా దూరమే ప్రయాణించింది. దీని ప్రాముఖ్యాన్ని మిత్రా వివరిస్తూ, ఎవరూ ఎక్కువగా అన్వేషించని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సంచరిస్తూ, బిలాల్లో పడిపోకుండా సురక్షితంగా రోవర్ ప్రయాణం చేసింది అని వెల్లడించారు. ఈ సందర్భంగా రోవర్‌కు అమర్చిన చక్రాలకు సంబంధించిన ప్రత్యేక అంశాలను మిత్రా వివరించారు. రూకర్ బూగీ అని పిలిచే మెకానిజాన్ని ఇందులో వినియోగించారు. అంటే ఆరు చక్రాలు ఒకేసారి కదలవు. దీని వల్ల రోవర్‌పైకి కిందకు కదిలేందుకు వీలవుతుంది. కానీ, ఒకవేళ లోతైన బిలంలో పడిపోతే పైకి రాలేకపోవచ్చు. అందువల్ల రోవర్‌ను నేలపై ఉన్న బిలాల చుట్టూ వెళ్లేలా చేయడం, లేదంటే దిశ మార్చుకునేలా చేయడం ముఖ్యం. కమాండ్ సెంటర్ నుంచి శాస్త్రవేత్తలు రోవర్‌కు అమర్చిన కెమెరాల ద్వారా, అక్కడ నేలపై ఏముందో గమనిస్తూ రోవర్‌ను ముందుకు నడిపించారు. రోవర్ ఆటోమేటెడ్ కాదు. అది పంపే చిత్రాలను ఆధారం చేసుకుని, కమాండ్ సెంటర్ నుంచి నియంత్రించారు. రోవర్ పంపే ఫోటోలు కమాండ్ సెంటర్‌ను చేరుకోవడంలో కాస్త ఆలస్యం అవుతుంది.

ఎందుకంటే ప్రజ్ఞాన్ రోవర్ సమాచారాన్ని మొదట విక్రమ్ ల్యాండర్‌కు పంపుతుంది. ల్యాండర్ దానిని ఆర్బిటర్‌లోకి పంపుతుంది. ఆర్బిటర్ భూమికి చేరవేస్తుంది అని ఆమె తెలిపారు. కాబట్టి, ఆదేశాలు రోవర్‌ను చేరే సమయానికి అది బిలానికి కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉంది.అయితే ప్రజ్ఞాన్ రోవర్ రెండు బిలాల మధ్య నుంచి సురక్షితంగా ప్రయాణం చేసి, కమాండ్ సెంటర్‌కు వేగంగా సమాచారం పంపిందని మిత్రా వివరించారు. ల్యాండర్ విక్రమ్‌కు అమర్చిన ప్రోబ్ చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టితో పాటు, 10 సెంటీమీటర్ల లోతులో ఉన్న మట్టిని కూడా పరిశీలించింది. ఆ తరువాత తొలి దశ సమాచారాన్ని సేకరించి కమాండ్ సెంటర్‌కు పంపింది. ఈ సమాచారంలో చంద్రుడి ఉపరితలంపైనా, నేలలోపలఉన్న ఉష్ణోగ్రతల్లో గణనీయమైన వ్యత్యాసాలు కనిపించాయి. ఉపరితలంపై ఉష్ణోగ్రత 60 డిగ్రీలు ఉండగా, లోతుకు వెళ్లే కొద్దీ భారీగా పడిపోయింది.80 మిల్లీమీటర్ల లోతున ఉష్ణోగ్రత -10 డిగ్రీలకు పడిపోయింది. చంద్రుడిపై ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయని నాసా ఇంతకు ముందే ప్రకటించింది.

ఆ ప్రకారం పగటిపూట చంద్రుడి భూమధ్య రేఖ సమీపాన ఉష్ణోగ్రత 120 డిగ్రీల సెల్సియస్, రాత్రి వేళ -130 డిగ్రీలు సెల్సియస్ పడిపోతుంది. శాశ్వతంగా సూర్మరశ్మి పడని బిలాల్లో ఉష్ణోగ్రత 250 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో ఉన్న ఈమార్పు చాలా కీలకమైనది మిత్రా అన్నారు. లూనార్ రిగోలిత్గా పిలిచే ఈ చంద్రుడి మీది మట్టిని మంచి ఇన్సులేటర్‌గా చెప్పవచ్చని అన్నారు. దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చంటే వేడి, చలి, రేడియేషన్లను నిరోధించేందుకు ఈ మట్టిని ఉపయోగిస్తూ స్పేస్ కాలనీలను నిర్మించవచ్చు. అంతేకాకుండా, నేలలోపల నీటి ఉనికి ఉందనడానికి ఇది ఒక సూచన అని అన్నారు.చంద్రుడి దక్షిణ ధ్రువపు ఉపరితలంలో ఉన్న మూలకాల ఉనికిని తెలుసుకునేందుకు రోవర్ లేజర్ డిటెక్టర్‌ను అమర్చారు. ఈ లేజర్ డిటెక్టర్ ద్వారా ఉపరితలంలో అల్యూమియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్, ఆక్సీజన్ మూలకాలు ఉన్నాయని గుర్తించారు. అన్నిటికన్నా ముఖ్యమైనది సల్ఫర్ ఉనికిని నిర్ధారించడమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 

తొలిసారిగా చంద్రుడి ఉపరితలంలో సల్ఫర్ ఉనికిని గుర్తించామని ఇస్రో పేర్కొంది. చంద్రుడిపై సల్ఫర్ ఉనికి గురించి 1970లలోనే తెలుసు. అయితే, రోవర్ చంద్రుడి నేలపై ఉన్న ఖనిజం లేదా స్ఫటికంలోని భాగంలో ఉన్న సల్ఫర్‌ను కాకుండా, చంద్రుడి ఉపరితలంపైనే సల్ఫర్ ఉన్నట్లు గుర్తించడం అద్భుతమైన విషయంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మట్టిలో సల్ఫర్ ఉనికిని కనుక్కోవడం వివిధ కోణాలలో కీలకమైన అంశం. సాధారణంగా అగ్నిపర్వతాలనుంచే సల్ఫర్ వెలువడుతుంది. దీనిని బట్టి మనకు చంద్రుడి ఆవిర్భావం, భౌగోళిక పరిస్థితులు, పరిణామక్రమంపై సమాచారం తెలుస్తుందిఅని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది మాత్రమే కాకుండా సల్ఫర్ కనిపించడమంటే చంద్రుడి ఉపరితలంపై నీటి ఉనికికి ఒక సూచిక.సల్ఫర్ సహజ ఎరువు. ఇక్కడ మరో మంచి విషయం ఏంటంటే చంద్రుడిపై సహజంగా మొక్కలు పెరగడానికి సల్ఫర్ పని కొస్తుంది.

ప్రకంపనలను రికార్డు చేసి విశ్లేషించే సామర్థ్యం ఉన్న ఇల్సా (ILSA) అనే పరికరాన్ని విక్రమ్ ల్యాండర్‌లో అమర్చారు. ఇది విక్రమ్ ల్యాండర్‌తో పాటు, రోవర్ కదలికలు, కార్యకలాపాల సమాచారాన్ని కూడా విశ్లేషిస్తుంది. చంద్రుడి నేలలోని మార్పులను గమనించే ఇల్సా పరికరం ఒక విశేషమైన ఘటనను రికార్డు చేసింది. అదే చంద్రుడిపై ప్రకంపనలకు ప్రధాన కారణం.ఈ సంఘటనకు చాలా ప్రాధాన్యత ఉంది.దీనికి చాలా వివరణలు, విశ్లేషణలు కూడా చాలా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బహుశా అంతరిక్ష శిథిలాలు, గ్రహకలం, ఉల్క వంటివి చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీ కొట్టడం వల్ల ఈ ప్రకంపనలు ఏర్పడి ఉండొచ్చు. లేదంటే సహజంగానే ఏర్పడి ఉండవచ్చు. 1970ల తర్వాత నమోదైన తొలి ప్రకంపనగా దీన్ని భావించవచ్చు. చంద్రుడి ఉపరితలం కింద ఏముంది? భౌగోళిక స్థితి ఎలా ఉంది? అన్న విషయాలను పరిశోధించేందుకు ఇది ఉపయోగపడవచ్చు.

 

వివి వెంకటేశ్వర రావు
6300866637

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News