Tuesday, April 30, 2024

చందమామ వస్తున్నాం..

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోట : ఇంతకాలం చందమామరావే అంటూ వచ్చాం, ఇప్పుడు మనమే ఆ మామ వద్దకు వెళ్లుతున్నాం. భారతదేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ 3 ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంసిద్ధం అయింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) లోని రెండవ ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు అత్యంత విశ్వాసపాత్రమైన బాహుబలి రాకెట్ జియో సింక్రోనస్ లాంఛ్ వెహికల్ జిఎస్‌ఎల్‌వి (ఎంకె3) దూసుకువెళ్లనుంది. దీని ద్వారా సంబంధిత చంద్రయాన్ అంతరిక్ష నౌకను ముందుగా నిర్ణీత కక్షలోకి పంపిస్తారు. ఆగస్టు 23 లేదా ఆగస్టు 24 తేదీలలో చంద్రుడిపై ఈ స్పేస్‌క్రాఫ్ట్ వాలుతుంది. ఈ చంద్రయాన్ క్యాప్సూల్‌లో ల్యాండర్, రోవర్ అనుసంధానం అయ్యి ఉన్నాయి. దీనికి సంబంధించిన సన్నాహాక దశ అయిన 25 గంటల కౌంట్‌డౌన్ గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు ఆరంభం అయింది.

ఈ 24 గంటలు ఇస్రో సైంటిస్టులకు, సాంకేతిక సిబ్బందికి, భారతదేశ అంతరిక్ష పరిశోధనలకు అత్యంత కీలకం కానుంది. చంద్రుడిలోని రహస్యాలను, ప్రత్యేకించి మానవాళి ఉనికికి లేదా ఇతరత్రా ప్రయోజనాలకు చంద్రుడు ఎంత మేరకు ఉపయుక్తం అవుతాడనేది తెలుసుకోవడానికి ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్‌ను చేపట్టింది. చంద్రయాన్ సీరిస్‌లో ఇది మూడో ప్రయోగం. చంద్రయాన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ల్యాండర్, రోవర్ ప్రొపల్షన్ మాడ్యూల్‌తో అనుసంధానించారు. సుమారు 3,48,000 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత చంద్రుని నుంచి వందకిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి చేరుతుంది. తరువాత దక్షిణ ధృవపు నిర్ణీత ప్రదేశంలో దిగుతుందని ఇస్రో తెలిపింది. ఇప్పుడు ల్యాండర్, రోవర్‌తో వెళ్లుతున్న చంద్రయాన్ నౌక ఇప్పటికే చంద్రయాన్ 2 దశలో ప్రయోగించిన ఇప్పటికీ చంద్రుడి కక్షల్లో తిరుగుతున్న ఆర్బిటర్‌ను వాడుకుంటుంది. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనాలు తమ వాహకనౌకలను చంద్రుడిపై దింపగలిగాయి.

ఇప్పుడు ఇండియా ఈ లక్షంలో విజయం సాధిస్తే ప్రపంచంలో ఈ క్రమంలో నాలుగో దేశం అవుతుంది. పైగా చంద్రుడి అత్యంత కీలకమైన దక్షిణ ధృవం ఆవిష్కరించిన తొలి దేశం అవుతుంది. 2008లో భారతదేశం తొలిసారిగా చంద్రయాన్ 1ను చేపట్టింది. ఇది ఆర్బిటర్, ఇంపాక్టర్‌లతో ల్యాండర్ లేకుండా చేపట్టన ప్రయోగం. చంద్రయాన్ 2ను 2019లో చేపట్టారు. అప్పట్లో చంద్రుడి ఉపరితలంపై సవ్యంగా దిగడంలో విఫలం అయింది. అప్పటి లోపాలను విశ్లేషించుకుని ఇప్పుడు పలు విధాలైన శాస్త్ర సాంకేతిక దిద్దుబాట్లతో ఈ చంద్రయాన్ 3ని చేపట్టారు. మూడో ప్రయత్నం సఫలీకృతం అయితే ఇక చంద్రుడిపై భారతీయ ఖ్యాతి జెండా రెపరెపలాడుతుంది. ఇంతకు ముందటి లోపాలను విశ్లేషించుకుని ఇప్పుడు దీనిని అధిగమించేందుకు ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ చంద్రయాన్3ని రూపొందించారు. ఇంతకు ముందులాగా కాకుండా ఈసారి చంద్రుడిపై దిగేందుకు విశాలమైన ప్రాంతాన్ని ఖరారు చేసుకున్నారు. ఈసారి ఇంధన పరిణామాన్ని పెంచారు దీనితో ఈసారి అవాంతరాలు ఎదురైతే ఇది వేరే చోటుకు విజయవంతంగా చేరుకునే శక్తిని సంతరించుకుంటుంది.
సూర్యుడిపై ప్రయోగాల ఆదిత్యా ఎల్ 1 ఆగస్టులో
ఇస్రో ఛైర్మన్ వెల్లడి ..ఇప్పుడు జోరుగా సన్నాహాలు
చంద్రుడి ప్రయోగం తరువాతి దశలో సూర్యుడి రహస్యాల పరిశోధనలకు ఉద్ధేశించిన తొలి ఆదిత్యా ఎల్ 1 మిషన్ ఆగస్టులో ఉంటుంది. ఈ విషయాన్ని శ్రీహరికోటలో విలేకరులతో ఇస్రో ఛైర్మన్ తెలిపారు. ఇప్పుడు సంబంధిత శాటిలైట్‌కు అత్యంత సంక్లిష్ట పరీక్షలు జరుగుతున్నాయి. ఫలితాలు విజయవంతం అయితే ఆగస్టు 10 దరిదాపుల్లో ఆదిత్యా ప్రయోగం ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News