Sunday, April 28, 2024

29 మంది మంత్రులతో బొమ్మై కేబినెట్

- Advertisement -
- Advertisement -

Chief Minister Bommai cabinet with 29 ministers

ఉప ముఖ్యమంత్రులు లేరు
యడియూ కుమారుడికి దక్కని చోటు
పాత వారిలో కొందరు ఔట్

బెంగళూరు: కర్నాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారధ్యపు మంత్రివర్గ విస్తరణ జరిగింది. బుధవారం రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్ రాజ్‌భవన్‌లో 29 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్నం ఈ కార్యక్రమం జరిగింది.ప్రమణస్వీకారానికి ముందు బొమ్మై విలేకరులతో మాట్లాడారు. ఇంతకు ముందు కేబినెట్‌లో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. అయితే ఈసారి ఉపముఖ్యమంత్రి ఎవరూ ఉండరని, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని సిఎం తెలిపారు. కేబినెట్‌లో మాజీ సిఎం బిఎస్ యడియూరప్ప చిన్న కుమారుడు, రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు బివై విజయేంద్రకు మంత్రి పదవి దక్కలేదు. తాను ఢిల్లీలో కేబినెట్ విస్తరణ విషయంలో పూర్తిస్థాయిలో చర్చలు జరిపినట్లు, గత రాత్రి తుది దఫా చర్చల తరువాత ఈ రోజు ఉదయమే మంత్రివర్గ జాబితా ఖరారు అయినట్లు బసవరాజ్ బొమ్మై బుధవారం ఇక్కడ చెప్పారు.

ఆయన ఇక్కడికి రాగానే హుటాహుటిగా మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరిగాయి. కేబినెట్ అనుభవం, నూతన శక్తి కలయికగా ఉంటుందన్నారు. కేబినెట్‌లో ఏడుగురు ఒబిసిలు, ముగ్గురు ఎస్‌సిలు, 1 ఎస్‌టి, ఏడుగురు ఒక్కలింగలు , ఎనిమిది మంది లింగాయత్‌లు, ఒక్క రెడ్డి కులస్తుడు, ఓ మహిళ ఉన్నారు. ఇక బ్రహ్మణ వర్గానికి చెందిన వారు ఇద్దరు ఉన్నారు. ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా సమగ్రమైన ఆలోచన తరువాత పార్టీ నేతలతో సమగ్ర చర్చల తరువాత మంత్రివర్గ ఎంపిక జరిగిందని సిఎం తెలిపారు. యడియూరప్ప కుమారుడు విజయేంద్రకు స్థానం కల్పించకపోవడాన్ని ప్రస్తావిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా నేరుగా యడియూరప్పతో మాట్లాడారని, ఇక కర్నాటక వ్యవహారాల బిజెపి ఇన్‌చార్జీ అరుణ్ సింగ్ విజయేంద్రతో మాట్లాడారని, ఇప్పటి జాబితాలో ఆయన పేరు లేదనే విషయాన్ని తప్ప ఇతర విషయాలేమీ చెప్పలేనని అన్నారు. ప్రజా హిత అధికార యంత్రాంగ కల్పనకు, రాబోయే ఎన్నికలకు సరైన ప్రతిష్ట దిశలో కేబినెట్ ఏర్పాటు అయినట్లు, ఇదంతా కూడా ప్రధాని మోడీ , హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షులు జెపి నడ్డా ఆదేశాల మేరకు జరిగినట్లు తెలిపారు.

దశలవారిగా మంత్రివర్గ విస్తరణ

కర్నాటక కేబినెట్‌లో మొత్తం 34 మంది మంత్రులను తీసుకునేందుకు అధికారిక అవకాశం ఉంది. ఇప్పటికీ కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా సిఎం బసవరాజ్ స్పందిస్తూ ఇది నిజమేనని దశలవారిగా విస్తరణ ఉంటుందని, ఇక ముందు అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంటుందని, దీనిని అంతా గుర్తించాల్సి ఉంటుందన్నారు. గత కేబినెట్‌లోని కొందరు మంత్రులను ఇప్పుడు తీసుకోకపోవడంపై సిఎం స్పందించారు. వ్యవస్థాగత అనుభవం ఉన్న సీనియర్ నేతలు కొందరికి ఈసారి పార్టీ పరంగా బలోపేత బాధ్యతలు అప్పగిస్తారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News