Tuesday, May 7, 2024

నీతిమాలిన రాజకీయం!

- Advertisement -
- Advertisement -

Chirag Paswan who deceived at hands of central leadership

 

అధికారాన్ని సాధించుకోడం, అది చేజారిపోకుండా చూసుకోడం కోసం సాగించే క్రీడకు ఊపిరి పచ్చి స్వార్థమే. దానికి ఉచితానుచితాలు ధర్మాధర్మాల విచికిత్స, విచక్షణ ఉండవు. దేశ సేవ, ప్రజాహితం అనే వాటికి బొత్తిగా చోటుండదు. అవసరమైతే ఏరు దాటి తెప్ప తగలేయడానికి కూడా వెనుకాడరు. ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల క్రితం జరిపిన కేంద్ర మంత్రివర్గ భారీ మార్పులు, చేర్పుల్లో ఇది స్పష్టంగా రుజువైంది. వచ్చే ఏడాదిలో జరగనున్న కీలకమైన ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తన సమ్మోహన శక్తి అనే కత్తి మొద్దుబారిపోకుండా అమోఘంగా పని చేసేలా చూసుకోడానికి ఈ మంత్రివర్గ భారీ మార్పుచేర్పుల కళను రక్తికట్టించారన్నది అందరికీ అవగతమే. అయితే తగినంత రాజకీయ అనుభవం లేక కేవలం భవిష్యత్తు మీద పేరాశతో బీహార్‌లో బిజెపికి అసాధారణ స్థాయిలో ఉపయోగపడిన లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) వ్యవస్థాపక సారథి రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు కమలం పార్టీ కేంద్ర నాయకత్వం చేతిలో పట్టిన దుర్గతి ఈ సందర్భంగా ప్రత్యేకించి గమనించదగినది.

చిరాగ్ పాశ్వాన్‌ను అతడు నమ్ముకున్న బిజెపియే ఈ విధంగా అధోగతి పాలు చేయనున్నదనే విషయం కొన్ని రోజుల క్రితం ఎల్‌జెపిలో ఏర్పడిన చీలిక నాడే స్పష్టపడిపోయింది. ఆ పార్టీలో గల ఆరుగురు ఎంపిలలో ఐదుగురిని చిరాగ్ దగ్గరి బంధువు పరాశ్ పాశ్వాన్ తన వైపు లాక్కొని తనదే అసలైన ఎల్‌జెపి అని ప్రకటించుకోడం, లోక్‌సభలో ఆ వర్గాన్నే స్పీకర్ గుర్తించడం జరిగిపోయాయి. మంత్రి వర్గ మార్పులు, విస్తరణలో భాగంగా పరాశ్ పాశ్వాన్‌ను ఎకాఎకీ కేంద్ర కేబినెట్ పదవి వరించడంతో చిరాగ్ కథ పరిపూర్ణంగా దుఃఖాంతమైపోయింది. బీహార్ ఎన్‌డిఎలో చిరకాలంగా తాను తలగా ఉండి తనను తోకగా చేసి ఆడిస్తూ వచ్చిన నితీశ్ కుమార్ గాలి తీసేయడానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి చిరాగ్ పాశ్వాన్‌ను బలమైన పావుగా వాడుకున్న విషయం బహిరంగ రహస్యమే. అందు కోసం ఆ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ చెలరేగిపోయి నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసి దుమ్ము రేపాడు. ఆయనను వ్యక్తిగతంగా దూషించి ప్రజల్లో ఆయన పట్ల ప్రతికూల అభిప్రాయాన్ని గట్టిపరిచాడు. జెడి(యు) అభ్యర్థులున్న చోట తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టి దాని ఓట్లను భారీగా చీలాడు.

పర్యవసానంగా జెడి(యు) 2015లో గెలుచుకున్న 71 స్థానాల నుంచి ఈ ఎన్నికల్లో 43కి మహా పతనమైంది. కనీసం 32 స్థానాల్లో జెడి(యు) పరాజయానికి చిరాగ్ కారకుడయ్యాడని అంచనాలు నిర్ధారించాయి. బిజెపి అనూహ్యంగా 74 స్థానాలు గెలుచుకొని ఆ రాష్ట్ర ఎన్‌డిఎలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అంతేగాక ముఖ్యమంత్రి పదవిని నితీశ్‌కే కట్టబెట్టి తన దయాదాక్షిణ్యాల మీద మాత్రమే ఆయన మళ్లీ అధికారంలో కి వచ్చాడని చాటింది. అది నితీశ్ కుమార్ గుండెల్లో గునపంగా దిగింది. దానిని భరించలేక చిరాగ్ పాశ్వాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని నితీశ్ కుమార్ నిర్ణయించుకున్నాడు. ఎన్‌డిఎ సమావేశాలకు చిరాగ్‌ను ఆహ్వానిస్తే తాను హాజరు కాబోనని బిజెపి నాయకత్వానికి చెప్పి ఆ రకంగా జరిపించాడు. ఈ అవమానాలు భరిస్తూ వచ్చిన చిరాగ్‌కు నెత్తి మీద పిడుగులా పడిన పరాశ్ పాశ్వాన్ వెన్నుపోటు వెనుక బిజెపి జెడి(యు)ల ఉమ్మడి దన్ను ఉందని కూడా వార్తలు చెబుతున్నాయి. తన మిత్రుడనుకున్న బిజెపి, శత్రువు నితీశ్ కుమార్ కలిసి తనకు రాజకీయ భవితవ్యం లేకుండా చేసిన పరిణామాన్ని చూసి చిరాగ్ బిత్తరపోయాడు.

మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లడం ద్వారా, పార్టీ పై పట్టును కోర్టు సహాయంతో సాధించుకునే ప్రయత్నం చేయడం ద్వారా తిరిగి నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. పార్టీ వ్యవస్థాపకుడు రామ్‌విలాశ్ పాశ్వాన్ కేంద్ర మంత్రిగా ఉండగానే చనిపోయాడు. ఆయన కుమారుడైన చిరాగ్ పాశ్వాన్‌కు ఆ పదవి దక్కడం న్యాయం. కాని అలా జరగలేదు. ప్రధాని మోడీ 12 మంది మంత్రులచేత రాజీనామా చేయించి, 36 మంది కొత్త వారిని తీసుకొని బ్రహ్మాండమనిపించిన భారీ మంత్రివర్గ మార్పుచేర్పులు కుప్పకూలిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి లేపడానికో లేక ఆత్మీయులను కోల్పోతూ తీరని దుఃఖంలో మునుగుతున్న దేశ ప్రజలకు కరోనా ప్రళయం నుంచి రక్షణ కల్పించడానికో చేసినవి కాదని, కొవిడ్ రెండవ అలను ఎదుర్కోవడంలో చెందిన ఘోర వైఫల్యం నుంచి జాతి దృష్టిని బలంగా మళ్లించి తద్వారా తన ప్రతిష్ఠకు కలిగిన కళంకాన్ని తుడుచుకోవాలని చేసినవేనని వెల్లడవుతున్నది. ఆ క్రమంలో ఆయన ఇష్టావిలాసంగా నిర్ణయాలు తీసుకున్నారు. తాను తలచుకుంటే ఏదైనా చేయగలనని చాటుకోడానికి మంత్రివర్గ ప్రక్షాళన మార్గాన్ని ఎంచుకున్నారు. కాని దేశ హితం కోసం చేపట్టవలసిన మంచిని మాత్రం చేసే సంకల్పం వహించలేకపోతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News