భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెండూల్కర్-ఆండర్సన్ సిరీస్ డ్రాగా ముగిసింది. ఈ సిరీస్‌లో ప్రతీ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. తమ తమ జట్లను గెలిపించుకొనేందుకు ప్రతీ ఆటగాడు తీవ్రంగా కృషి చేశారు. కానీ, ఓ ఇద్దరు మాత్రం తమ జట్టు కోసం అత్యంత సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. అందులో ఒకరు భారత ఆటగాడు రిషబ్ పంత్ కాగా, మరొకరు ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ (Chris Woakes). రిషబ్ పంత్ కాలికి గాయమైనా సరే బ్యాటింగ్ వచ్చి అర్థ శతకం సాధించి.. జట్టుకు విలువైన పరుగులు అందించాడు. ఇక క్రిస్ వోక్స్ భుజం ఫ్రాక్చర్ అయినా సరే ఐదో టెస్ట్‌లో చివరి వికెట్‌గా వచ్చి జట్టును గెలిపించేందుకు పోరాడాడు. ఈ క్రమంలో వోక్స్‌ని భారత ఆటగాళ్లు అభినందించారు. అయితే తనకు భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ నుంచి సందేశాలు వచ్చాయని వోక్స్ తాజాగా వెల్లడించాడు.
నొప్పితోనే బ్యాటింగ్‌కి వచ్చినందుకు గిల్ తనను అభినందించాడని వోక్స్ (Chris Woakes) తెలిపాడు. ‘‘ఐదో టెస్ట్ ముగిసిన తర్వాత గిల్‌తో మాట్లాడాను. తనకు ఇది గొప్ప సిరీస్‌గా నిలిచిపోతుందని చెప్పాను. జట్టు కోసం బాగా ఆడావని.. జట్టును ముందుండి నడిపించావని చెప్పాను’’ అని వోక్స్ తెలిపాడు. ఇక క్రిస్ వోక్స్ బౌలింగ్‌లోనే రిషబ్ పంత్‌కు గాయమైన విషయం తెలిసిందే. రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించడంతో బంతి పంత్ కాలికి తగిలి తీవ్ర గాయమైంది. దీంతో నొప్పితో విలవిలలాడుతున్న అతన్ని గోల్ఫ్ కార్ట్‌లో తీసుకెళ్లారు. కానీ, ఆ తర్వాత కొంత సమయానికే బ్యాటింగ్‌కి వచ్చి అర్థశతకం పూర్తి చేసుకున్నాడు.
ఈ విషయంపై వోక్స్ మాట్లాడుతూ.. ‘‘నా ఫోటోకు రిషబ్ పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్యూట్ ఎమోజీ పెట్టాడు. నేను థాంక్యూ అని చెప్పి.. పాదం బాగానే ఉందని అనుకుంటున్నా అని రిప్లై ఇచ్చాను. దానికి పంత్ వాయిస్ మెసేజ్ పంపించాడు. ‘అంతా మంచే జరగాలని ఆశిస్తున్నా. త్వరగా కోలుకోవాలి. తప్పకుండా మనం ఏదో ఒక రోజు కలుద్దాం’ అని అన్నాడు. నేను అతని పాదం అలా దెబ్బ తిన్నందుకు సారీ చెప్పాను’’ అని వోక్స్ అన్నాడు. ఇక జట్టుకు 100 పరుగులు అవసరం ఉన్నా.. బ్యాటింగ్‌కు వచ్చే వాడినని.. అందుకు తనకు ఎలాంటి బాధ లేదని అన్నాడు. కానీ, చివరకు జట్టు ఓడిపోవడం తనకు బాధ కలిగించిందని.. తన లాగే ఇతర జట్ల ఆటగాళ్లూ ఇదే చేస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు.