Thursday, May 2, 2024

చేసేది కారు డ్రైవింగ్.. చెప్పేది సిఎం గన్‌మెన్

- Advertisement -
- Advertisement -

CM fake gunmen who cheated the unemployed

 

ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న
నకిలీ ఎస్సై అరెస్టు
నిందితుడు గతంలో ఉద్యోగం కోసం డబ్బుల ఇచ్చి మోసపోయాడు

మనతెలంగాణ, హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి గన్‌మెన్‌గా పనిచేస్తున్నానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన నకిలీ ఎస్సైని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి నకిలీ ఐడి కార్డు, మొబైల్ ఫోన్, సఫారీ డ్రెస్, బొమ్మ పిస్తోల్, రూ.25,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని రేతిబౌలి, ఇందిరా నగర్, కాదర్ బాగ్‌కు చెందిన నందికొండ సంతోష్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇంటర్ వరకు చదువుకున్న సంతోష్ కొద్ది రోజులు ఎలక్ట్రిషన్‌గా పనిచేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. చేస్తున్న ఉద్యోగంలో వస్తున్న డబ్బులు కుటుంబ అవసరాలకు సరిపోవడంలేదు. తాను ఎస్సైగా ప్రగతిభవన్‌లో సిఎం గన్‌మెన్‌గా పనిచేస్తున్నానని పలువురికి చెప్పేవాడు.

అంతేకాకుండా నకిలీ ఐడి కార్డులు తయారు చేసుకున్నాడు. ఒకదాంట్లో సంతోష్‌గా, మరో దాంట్లో మహంకాళీ ప్రకాష్‌గా ఐడి కార్డులు తయారు చేయించుకున్నాడు. తనకు డిపార్ట్‌మెంట్‌లో చాలా పరపతి ఉందని కోర్టుల్లో, వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపధికన అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురు అమాయకుల వద్ద డబ్బులు తీసుకున్నాడు. కారును అద్దెకు తీసుకుని తన సొంత వాహనంగా చెప్పేవాడు. బ్యాంక్ ఉద్యోగాలు వచ్చాయని చెప్పి అమాయకులకు మెసేజ్‌లు పంపించేవాడు. ఉద్యోగం వచ్చిందో లేదో తెలుసుకునేందుకు 6309575304కు ఫోన్ చేయాల్సిందిగా మెసేజ్ పెట్టేవాడు.

కాగా నిందితుడు కూడా గతంలో బ్యాంక్ ఉద్యోగం కోసం చేగూరి నరేందర్ అనే నిందితుడికి రూ.30,000 ఇచ్చిమోసపోయాడు. జనగాం జిల్లా, పాలకుర్తికి చెందిన ముసిరెడ్డి మహేందర్ రెడ్డికి కోర్టులో సిస్టం ఆపరేటర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.90,000 తీసుకుని మోసం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్సై రంజిత్‌కుమార్,ముజఫర్ అలీ తదితరులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News