Sunday, April 28, 2024

12న ధాన్యం ధర్నాలు

- Advertisement -
- Advertisement -

పెట్రోల్, డిజీల్‌పై కేంద్రం సెస్ పూర్తిగా తగ్గించుకునేంత వరకూ పోరాటం ఆగదు
సూటిగా సమాధానం ఇవ్వలేని బండి మీడియా సమావేశాల్లో సొల్లు పురాణాలు చెబుతున్నాడు
ఆయనకు తల మెదడు లేదు అలాంటోడు కెసిఆర్ మెడలు వంచుతానని పగటి కలలు కంటున్నాడు
నేను కన్నెర్రచెస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చూపించమంటావా? 
నీ బండి మాటలు ఢిల్లీలో ఎవరూ లెక్కబెట్టరు
నేను అడిగిన ప్రశ్నలకు ముందుగా కేంద్ర మంత్రులను అడిగి తెలుసుకొని మాట్లాడు
మన భూభాగాన్ని రక్షించుకోవాలనడం తప్పా? దేశద్రోహమా?

రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బిల్లులకు మద్దతు తెలిపినప్పుడు దేశ ద్రోహులం కామా? 
బిజెపి నాయకులు దేశద్రోహి, అర్బన్ నక్సలైట్ అనే రెండు, మూడు స్టాంపులు తయారుచేసి పెట్టుకున్నారు
నచ్చనివారిపై ఆ స్టాంపులు వేస్తారు 
ఏ రాష్ట్రంలో లేనివిధంగా గొర్రెల పథకాన్ని అమలు చేస్తున్నాం 
దానిపై కూడా చిల్లరమల్లరగాళ్లు అడ్డం మాట్లాడుతున్నారు
ఈ పథకంలో కేంద్రం ఒక్క రూపాయి పెట్టినట్టు రుజువు చేస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా
సిఎం అయిన తర్వాత సిద్దిపేటలోని పాత ఇల్లును అమ్ముకున్నాను
రూ.16 వస్తే అందులో కొంత మొత్తంతో ఫాంహౌస్‌లో ఇల్లు కట్టుకున్నా
నాదంతా బహిరంగమే బిజెపిలా దొంగ లెక్కలు చేతకాదు: మీడియాతో ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా చేయడానికి ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్దఎత్తున రైతు ధర్నాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు. దీనికి రైతులు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పండించిన వరి ధాన్నాన్ని కేంద్రం కొంటదా? కొనదా? అనే అంశంపై స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు కేంద్రాన్ని వెంటాడుతా…వేటాడుతానని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. అలాగే పెట్రోల్, డిజిల్‌పై విధించిన సెస్‌ను కేంద్రం తగ్గించేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు. దీని కోసం ఎంతదూరమైన వెలుతామని…ఎవరినైనా ఎదిరిస్తామన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే తనను ద్రోశ ద్రోహులుగా చిత్రీకరించే యత్నం బిజెపి నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు. చైనా దురాక్రమణల గురించి దేశాన్ని కాపాడమని చెప్పినందుకా తనపై ఈ నిందలు అని నిలదీశారు. అయినా బిజెపి తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తి కెసిఆర్ కాదన్నారు. చావునోట్లోకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బాగుండాలన్నదే తన ప్రధాన లక్షమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ గొర్రెల పథకాన్ని అమలు చేస్తుంటే…దానిపై కూడా కొందరు చిల్లరమల్లర గాళ్లు అడ్డు, పొడవునా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఈ పథకంలో కేంద్రం నుంచి ఒక్క రూపాయి వచ్చినట్లుగా బిజెపి నాయకులు రుజువు చేస్తే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమేనని సిఎం కెసిఆర్ సవాల్ విసిరారు. త్వరలోనే ఖాళీగా ఉన్న పదవుల భర్తీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నదన్నారు.
సోమవారం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్ మరోసారి కేంద్రం ప్రభుత్వంతో పాటు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఆయన ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. అడ్డం..పొడువు మాట్లాడితే తగు రీతిలో బుద్దిచెబుతామని హెచ్చరించారు. తన పరిధి ఏమిటో బండి సంజయ్ చెబితే నేర్చుకునే పరిస్థితుల్లో లేనని ఘాటుగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో పండించే ధానాన్ని కేంద్రం కొనుగులు చేస్తుందా? లేదా? అని స్ట్రెయిట్‌గా అడిగితే సమాధానం చెప్పలేని బండి…మీడియా సమావేశాల్లో సొల్లు పురాణాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆయనకు తలలేదు…మొదడు లేదని అన్నారు. అలాంటోడో కెసిఆర్ మెడలు వంచుతానని పగటి కళలు కంటున్నారని ధ్వజమెత్తారు. తాను కన్నెర్ర చేస్తే…పరిణామాలు ఎలా ఉంటాయో చూపించామంటావా? బండి సంజయ్ అంటూ ప్రశ్నించారు. నీ (బండి) మాటలు ఢిల్లీలో ఎవరు లెక్కపెట్టరన్నారు. నిన్ను ఎవరూ అక్కడ దేఖరు. తాను అడిగే ప్రశ్నలకు ముందుగా కేంద్ర మంత్రులను అడిగి తగు సమాధానం తెచ్చుకుని మాట్లాడు అని సూచించారు. వడ్లను కేంద్రం కొంటుందా కొనదా? తేల్చిచెప్పాలన్నారు. . తనకు సమాధానం కావాలని సమాధానం చెప్పేవరకు బిజెపిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

కేంద్రాన్ని వదలిపెట్టం
రాష్ట్రంలో పండే ధాన్యాన్ని కేంద్రం కొనే వరకు వదిలేది లేదని కెసిఆర్ పునరుధ్ఘాటించారు. రాష్ట్రంలో పండే ధాన్యం కొనకుంటే…. కేంద్రం విధానం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు నిరసనగానే తాను వచ్చే శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చామన్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు ఎక్కడ కనిపించినా ధాన్యం కొంటారో…లేదో నిలదీయాలన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి ఎటువంటి స్పష్టత రాని కారణంగా యాసంగిలో వరి వేయొద్దని రైతులకు మరోసారి సూచించారు. ప్రపంచంలో పెద్ద సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. సీడ్ కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందం ఉన్న రైతులు యాసంగిలో వరి పండించుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో పత్తికి ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉందని వెల్లడించారు. ఇందులో వన్‌టైమ్ పిక్ చేసే పద్దతిని కూడా త్వరలో తీసుకరాబోతున్నామన్నారు.
ఒక్క రూపాయి వచ్చినట్లుగా నిరూపిస్తే సిఎం పదవికి రాజీనామా
గొర్రెల పథకానికి కేంద్రం నుంచి రూపాయి ఇచ్చినట్లు చూపిస్తే సిఎం పదవికి రాజీనామా చేస్తానని కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ పథకానికి కేంద్రం నుంచి నిధులు వస్తే…బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఈ పథకం లేదని ప్రశ్నించారు. కేవలం తెలంగాణకే కేంద్రం నిధులు ఇస్తుందా? అని నిలదీశారు. దీనిపై కేంద్రం నుంచి ఒక ప్రకటన ఇప్పించే దమ్ము బండి సంజయ్‌కు ఉందా? అని కెసిఆర్ మండిపడ్డారు. గొర్రెల కోసం రుణం తీసుకున్నామని…దానిని బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తుందన్నారు.
సెస్‌ను ఉపసంహరించాల్సిందే
అసత్య ప్రచారంతో పెట్రోలియం ఉత్పత్తులపై విధించిన సెస్‌ను వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాల్సిందేనని కెసిఆర్ డిమాండ్ చేశారు. దీని కోసం ఎంతదూరమైన పోతామన్నారు. 2014లో ఉన్న క్రూడాయిల్ ధరల కంటే ప్రస్తుతం ధరలు చాలా తక్కువగా ఉందన్నారు. అయినప్పటికీ కేంద్రం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచిందన్నారు. మొత్తం పదహారు సార్లు పెంచి ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ లీటర్ ధరను వంద రూపాయలకు తీసుకెళ్లిన ఘనత బిజెపిదేనని ఆయన మండిపడ్డారు. ఈ సెస్ ఉపసంహరించుకుంటే లీటర్ పెట్రోల్ రూ.70కే వస్తుందన్నారు. సెస్ తగ్గించకుండా కేంద్రం రాష్ట్రాలపై పడి ఏడవటమేంటి? అని కెసిఆర్ మండిపడ్డారు. ప్రజలపై ప్రేమ ఉంటే సెస్ మొత్తాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు. లేనిపక్షంలో కేంద్రం దిగివచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
కరోనా సమయంలో ప్రైవేటు పాఠశాలల సిబ్బందిని ఆదుకున్నది దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని కెసిఆర్ అన్నారు. స్వాతంత్య్ర పోరాటం తర్వాత అతిపెద్ద విషాదం కరోనా వలస కూలీల మరణాలన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు వలస కూలీలను విస్మరిస్తే తమ ప్రభుత్వం వలస కూలీలను ఆదుకుందన్నారు. 160 స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేయడంతో పాటు కనీస అవసరాల కోసం రూ.500ల చొప్పున కూడా ఇచ్చామన్నారు. భోజనం పెట్టి మరి వారి గ్రామాలకు సురక్షితంగా పంపామన్నారు. దేశంలో విలేకరులకు రూ.100 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. అలాగే న్యాయవాదుల సంక్షేమానికి రూ100 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా? అని వ్యాఖ్యానించారు. జూనియర్ న్యాయవాదుల కోసం ప్రత్యేకంగ రూ.25 కోట్లు కూడా ఇచ్చామన్నారు.

ఫామ్ హౌజ్ కాదు… ఫార్మర్ హౌజ్
తనది ఫామ్‌హౌజ్ కాదని…ఫార్మర్ హౌజ్ (వ్యవసాయ క్షేత్రం)అని సిఎం కెసిఆర్ అన్నారు. తన నియోజకవర్గంలో ఉన్న ఈ క్షేత్రానికి తాను వెలితే తప్పా అంటూ నిలదీశారు. కెసిఆర్ క్షేత్రాన్నే దున్నుతా అంటావా? నువ్వు తన ట్రాక్టర్ డ్రైవర్ వా? దమ్ముంటే అక్కడికి రా? అని సవాల్ విసిరారు. తన వ్యవసాయ క్షేత్రాన్ని గేటును దాటుకుని వస్తే….అప్పుడు కాని భయం అంటే ఎలా ఉంటుందో బండికి తెలిసివస్తుందన్నారు. అందరు చేసినట్లుగా తన వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండించుకుంటుంటే…ఎందుకు వారికి మంట అని నిలదీశారు. వారిలా తనకేమి మనీ ల్యాండరింగులు బోండరింగులు లేవన్నారు. అలాగే తమకెలాంటి వ్యాపారాలు లేవు…అక్రమ దందాలు లేవు. మమ్మల్నేం చేయలేరన్నారు. అనవసర ప్రయత్నాలు చేస్తే బూమరాంగ్ అవుతుందన్నారు. అది రివర్స్ తగులుందని… దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని జాగ్రత్త అని సిఎం కెసిఆర్ హెచ్చరించారు. ఆయన పిట్ట బెదిరింపులకు ఎవరూ భయపడరని.. ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని సిఎం మరోసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నిజాయితీగా ఉండు…అహంకారం మంచిది కాదన్నారు.ఫామ్ హౌజ్‌లో తాగిపడుకున్నా అని మాట్లాడే బండి….నీవేమైనా మందు పోశావా? అని ప్రశ్నించారు.

దేశ ద్రోహులు ఎవరో తేలుద్దాం రా!
దేశాన్ని కాపాడమని చెప్పాం అది తప్పా అని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. మన భూభాగం కాపాడుకోవాలని చెప్పడం దేశ ద్రోహమా అన్నారు. దేశాన్ని కాపాడమన్నోడు దేశద్రోహా దేశాన్ని వదిలేసినోడు దేశద్రోహా? అన్నారు. దేశ ద్రోహులు ఎవరో తేలుద్దాం ముందుకు రావాలన్నారు.
కేంద్రాన్ని తాను నిలదీస్తే బిజెపి నాయకులు దేశ ద్రోహి అంటున్నారని కెసిఆర్ విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికలతో పాటు అలాగే పలు బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో కేంద్రానికి తాము మద్దతిచ్చినపుడు అప్పుడు దేశ ద్రోహులం కాదా? అని ప్రశ్నించారు. అప్పుడు కనిపించని దేశద్రోహం…ఇప్పుడు ఎలా కనిపిస్తోందన్నారు. కేంద్రంపై ఎవరు గట్టిగా మాట్లాడితే వారు దేశ ద్రోహులా? ప్రశ్నించిన వారు ఒక్క రాత్రిలోనే దేశ ద్రోహులవుతారా?అంటూ మండిపడ్డారు. అంటే బిజెపి ఈ దేశంలో దేశద్రోహం తయారు చేసే ఫ్యాక్టరీనా? గట్టిగా ఎవరు మాట్లాడితే వాళ్లు దేశద్రోహులను చేస్తుందాయ? అని ప్రశ్నించారు. ఇదే ఇప్పుడు బిజెపి విధానంగా మారిందని దుయ్యబట్టారు. బిజెపి నాయకులు రెండు, మూడు స్టాంపులు తయారు చేసి పెట్టుకున్నారన్నారు. అందులో ఒకటి దేశద్రోహి స్టాంపు. మరొకటి అర్బన్ నక్సలైట్ స్టాంపు అని ఎద్దేవా చేశారు. తమకు నచ్చకపోతే ఈ స్టాంపులు వేస్తారన్నారు.సాగు చట్టాలపై మాట్లాడిన బిజెపి నేత వరుణ్ గాంధీ, మేఘాలయ గవర్నర్ కూడా దేశద్రోహేనా? అని కెసిఆర్ ప్రశ్నించారు. పైగా తాను సంపాందించిన డబ్బును చైనాలో దాచుకున్నట్లుగా ఆ పార్టీ నేతలు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాల మీద బతికే పార్టీ బిజెపి అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

దొంగలే భయపడతారు
ఇడి, ఆదాయపు పన్ను దాడులకు దొంగలే భయపడతారని కెసిఆర్ అన్నారు. వాటికి మేమెందుకు భయపడతామన్నారు. సిద్దిపేటలో ఉన్న తన పాత ఇళ్లును ముఖ్యమంత్రి అయిన తరువాత అమ్ముకున్నానని అన్నారు. దాని ద్వారా రూ.16 కోట్ల ఆదాయం వస్తే…అందులో కొంతమొత్తాన్ని వ్యవసాయ క్షేతంలోని ఇంటి నిర్మాణానికి వెచ్చించినట్లు సిఎం కెసిఆర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పక్కా లెక్కలు ఆదాయ పన్ను అధికారుల వద్ద ఉన్నాయన్నారు. తన ఎన్నికల అఫిడవిట్‌లో కూడా చూసుకోవచ్చునని అన్నారు. తనది అంత బహిరంగమేనని అన్నారు. వారిలా (బిజెపి) దొంగ లెక్కలు చెప్పడం తనకు చేతకాదన్నారు.తాము వందకు వంద శాతం నిటారుగా ఉన్నామని.. ఎలాంటి తప్పులు చేయలేదు…ఎవరిని దోచుకోలే దన్నారు. అలాగే అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన విధంగా తమకు విరాళాలు వచ్చాయన్నారు. ఈ విషయాన్ని ప్రతిసారి పార్టీ ప్లీనరీ సమావేశాల్లో వెల్లడించిన విషయాన్ని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. ఆ మొత్తం ఫిక్స్‌డ్ నగదు రూపంలో బ్యాంకులో సుమారు రూ. 450 కోట్ల మేర ఉన్నాయన్నారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం పలువురికి సూట్‌కేసులు ఇచ్చినట్లు బిజెపి నాయకులు చేస్తున్న ఆరోపణలపై కెసిఆర్ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే వారు నిరూపించాలని సవాల్ విసిరారు. ఇలాంటి సంస్కృతి ఆ పార్టీ నేతలకే ఉందన్నారు. సూట్‌కేసులు ఇచ్చేది మీరేనని అన్నారు. దేశంలో ఎన్నికల్లో అధికంగా డబ్బులు ఖర్చు పెట్టేది కూడా ఆ పార్టీయేనని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదని…ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని అన్నారు.

మంత్రివర్గంలో అందరూ ఉద్యమకారులే ఉంటారా?
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తమది ఫక్తు రాజకీయ పార్టీ అని స్పష్టంగా చెప్పినట్లు సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. రాజకీయ చాణక్యం చాకచక్యం చూపిస్తామని కుండబద్దలు కొట్టి మరీ చెప్పినట్లు తెలిపారు. ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇతర పార్టీ నాయకులను మంత్రివర్గంలోకి తీసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జ్యోతిరాదిత్య సింధియాను బిజెపిలోకి తీసుకుని మంత్రి పదవి ఎలా ఇచ్చారని ఈ సందర్భంగా కెసిఆర్ నిలదీశారు. ఆ పార్టీ చేస్తే సంసారం… ఇతర పార్టీలు చేస్తే వ్యభిచారమా? అంటూ విమర్శించారు. కర్నాటక, మధ్యప్రదేశ్‌లో ఆ రాష్ట్ర ప్రజలు బిజెపికి అధికారం ఇవ్వకపోయినప్పటికీ దొడ్డిదారిన ఆ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందో దేశవ్యాప్తంగా అందరికి తెలిసిందేనని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో అందరూ ఉద్యమకారులే ఉంటారా? అన్ని వర్గాలకూ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఇతర పార్టీల్లోని నుంచి వచ్చిన సీనియర్ నేతలకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే తప్పేంటి అని నిలదీశారు. 20 ఏళ్లు పదవిలో ఉంటానన్న చంద్రబాబును పిడికెడు మందితో ఢీకొన్నానని పేర్కొన్నారు. తాను ఎంతో మంది ఎంపిలు, ఎంఎల్‌ఎలను, ఎంఎల్‌సిలను సృష్టించానని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మొదటగా ఎస్‌సిని సిఎం చేస్తానన్నానని…కానీ అనేక కారణాల వల్ల చేయలేకపోయానని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. అది వాస్తవం…నూటికి నూరుశాతం నిజమన్నారు. ఎస్‌సిని సిఎం చేయకుండానే రెండోసారి సిఎం అయ్యానన్నారు. తన నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు ప్రజలు ఆమోదించారన్నారు. మొదటి సారి కంటే రెండవ సారి అధిక మెజార్టీతో ప్రజలకు తమకు అధికారం కట్టబెట్టారన్నారు.

అది జోక్ ఆఫ్ ది మిలీనియం
తెలంగాణకు కెసిఆర్ ఏం చేశారని బండి సంజయ్ అడగడాన్ని జోక్ ఆఫ్ ది మిలీనియంగా కెసిఆర్ అభివర్ణించారు.రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను సాక్షాత్తు కేంద్రమంత్రులే ప్రశంసించారన్నారు. ఈ విషయాలను వారు పార్లమెంటులోనే చెప్పిన విషయాన్ని ఒక్కసారి బండి సంజయ్‌కు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్రం సాధించిన ప్రగతిని ఆర్‌బిఐ కూడా మెచ్చుకుందన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతిని దేశంలో ఏ ఒక్క బిజెపి పాలిత రాష్ట్రమైనా ఉందా? అని ప్రశ్నించారు. మిషన్ భగరీథ ద్వారా రాష్ట్రంలోని ఇంటింటికి తాగు నీరు అందించామన్నారు. అలాగే మిషన్ కాకతీయ ద్వారా సుమారు నలభై వేల చెరువులను తిరిగి పునరుద్దరించుకున్నామన్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఆగిపోయిన ప్రాజెక్టులన్నింటిని మిషన్ మోడ్‌లో పనులను పూర్తి చేశామన్నారు. రాష్ట్రానికి వరప్రదాయని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడున్నర సంవత్సరాల్లో ప్రజా వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. ఇలాంటి ప్రాజెక్టును దేశంలో ఏ రాష్ట్రమైనా నిర్మించిందా? అని కెసిఆర్ ప్రశ్నించారు. అందుకే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పండలు పండుతున్నాయన్నారు. పండిన పంటలను కొనలేని అసమర్థ ప్రభుత్వం బిజెపి అని ఆయన మండిపడ్డారు. నీరు..నిధులు..నియమకాలపై ఏర్పడిన తెలంగాణలో ఇప్పటి వరకు లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మరో 70వేలు ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయబోతున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే జోనల్ చట్టం కూడా తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం ఉద్యోగులను సర్దుబాటు జరుగుతోందన్నారు. దీని కారణంగానే జోనల్ విధానం అమలు కారణం కాస్త ఆలస్యమవుతోందన్నారు. అయితే తాము చేయగలిగిందే చెబుతామన్నారు. కేంద్రం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి ఉన్న ఉద్యోగాలే ఊడగొట్టిందని విమర్శించారు. కొత్త జోనల్ విధానంతో 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ వారికేనని సిఎం కెసిఆర్ తెలిపారు. త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇక ప్రతి ఏడాది ఎంప్లాయిమెంట్ క్యాలెండర్ విడుదల చేస్తామని, పారదర్శకంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని అన్నట్టు బండి సంజయ్ నిరూపిస్తాడా? అని కెసిఆర్ ప్రశ్నించారు.

యథాతదంగా దళిత బంధు
దళిత బంధు పథకం యథాతదంగా అమలవుతుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. హూజూరాబాద్ నియోజకవర్గంలో కూడా సంపూర్ణంగా ఈ పథకం అమతుందన్నారు. దీంతో పాటు ఎంపిక చేసిన నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో కూడా దళిత బంధు పథకం అమలు చేస్తామన్నారు. దీనిపై కూడా కొందరు కిరికిరిగాళ్లు…ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు దళిత బంధు గురించి బండి సంజయ్‌కు ఏం తెలుసన్నారు. ఆయనకు అసలు కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. ఏ బ్యాంకు బాదరబందీ లేకుండా, తిరిగి చెల్లించేటువంటి కిస్తీల కిరికిరి లేకుండా ఇచ్చే డబ్బుతో దళితులు పైకి రావాలన్నదే పథకం యొక్క ఉద్దేశం అని సిఎం కెసిఆర్ తెలిపారు. ప్రపంచలోనే ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు. అణగారిన జాతులను ఆదుకోవడానికి రాష్ట్రంలో గొప్ప ప్రయత్నం జరుగుతుందన్నారు. తరతరాలు దోపిడికి గురైన జాతిని ఆదుకోవాలన్నదే తమ తాపత్రయమన్నారు. హుందాతనం ఉంటే ఇంత మంచి పనిలో కేంద్రం భాగస్వామి అవ్వాలన్నారు. 100 శాతం చెప్పింది చెప్పినట్టు దళిత బంధు స్కీమ్ అమలవుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరి మాటలు నమ్మొద్దని దళితజాతిని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ముగిసేసరికి హుజూరాబాద్లో ప్రతి కుటుంబానికి దళిత బంధు డబ్బులు ఇస్తామన్నారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా 100 కుటుంబాలకు దళిత బంధు డబ్బు మార్చిలోపు అందజేస్తామని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించబోతున్నామని దీనివల్ల 2 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని సిఎం తెలిపారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ పెంచుకుంటూ పోతామని వివరించారు. నాలుగైదు సంవత్సరాల్లో అందరికి నగదు అందేలా ప్రణాళిక ఉందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కనీసం కనీసం 4, 5 లక్షల కుటుంబాలకు అందేలా చూస్తామన్నారు. చివరలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు వర్తింప చేస్తామన్నారు. అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రభుత్వ రిజర్వేషన్ల విషయంలో దళితులకు రిజర్వేషన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సిఎం స్పష్టం చేశారు.

చేపల పులుసు తింటే తప్పా
పక్క రాష్ట్రానికి వెళ్లి చెపల పులుసు తింటే తప్పా అని కెసిఆర్ ప్రశ్నించారు. రాయలసీమకు వెళ్లి నీరు కావాలని చెప్పిన మాట వాస్తవం అని కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అప్పుడు కాదు… ఇప్పుడు కూడా చెబుతున్నానని అన్నారు. ఎపి సిఎంను హైదరాబాద్ పిలిపించుకుని మరీ సీమకు నీళ్లు ఇవ్వాలని చెప్పానన్నారు. నీటి వాటాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య బేసిన్లు, బేషజాలు ఉండొద్దని చెప్పానని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రాల్లో ఎన్నికలను బట్టి నీటి రాజకీయాలు చేస్తుంటాయని విమర్శించారు. కేవలం ఎన్నికలప్పుడే కృష్ణా, గోదావరి, కావేరి నదుల అనుసంధానాన్ని తెరపైకి తీసుకరావడం…అనంతరం విస్మరించడం బిజెపికి అలవాటేనని మండిపడ్డారు. మొన్న తమిళనాడు ఎన్నికల ముందు నధుల అనుసంధానంపై మాట్లాడిన బిజెపి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని కెసిఆర్ నిలదీశారు.

ఇకపై రోజూ ప్రెస్‌మీట్
యాసంగిలో వడ్లు వేయాలని బండి సంజయ్ చెప్పిన మాట తప్పా? కాదా? అని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలో పండే వరి చూపించేందుకు 6 హెలికాప్టర్లు పెడతానన్నారు. హెలికాప్టర్లలో వెళ్లి వరి చూసేందుకు బండి సంజయ్, కేంద్ర ప్రతినిధులు రావాలన్నారు. ఈ విషయంలో బండికి కేంద్ర మంత్రుల నుంచి అక్షింతలు పడ్డాయని చెప్పారు. వడ్ల విషయం తప్ప ఏమైనా మాట్లాడుకో అని బండి సంజయ్‌కు ఆ పార్టీ హైకమాండ్ పెద్దలు చెప్పారని కెసిఆర్ అన్నారు. కేంద్రం కథతో పాటు బిజెపి నేతల కథ తేల్చేదాకా రోజూ మాట్లాడతానని… తన మీడియా సమావేశం ఇకపై రోజూ ఉంటుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో హనుమాన్ గుడి లేని ఊరులేదని, అలాగే టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా కెసిఆవ చెప్పారు.

పదవులను చిత్తు కాగితాల్లో విసిరికొట్టాం
తెలంగాణ ఉద్యమ సమయంలో పదవులను చిత్తు కాగితాల్లో విసిరికొట్టామని కెసిఆర్ తెలిపారు. అప్పటి రాజకీయ జెఎసి నిర్ణయం మేరకు టిఆర్‌ఎస్ శాసనసభ్యులంతా రాజీనామాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటిది తాము పదవులకు భయపడతామా అన్నారు. ఉద్యమ సమయంలో బిజెపికి కేవలం ఇద్దరు శాసనసభ్యులు ఉంటే అందులో ఒకరు లక్ష్మీనారాయణ రాజీనామా చేశారన్నారు. కానీ ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అప్పట్లో రాజీనామా చేయకుండా పారిపోయారని విమర్శించారు. మేం దద్దమ్మలమా? ప్రపంచ ఉద్యమాలకే పాఠం చెప్పిన ఘనత తెలంగాణ ఉద్యమానిది అని సిఎం కెసిఆర్ అన్నారు.

దేశంలో సంస్కరణలు రావాలి
దేశంలో పెద్దఎత్తున సంస్కరణలు రావాల్సిన అవసముందని సిఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. అందులో కొత్త పుంతలు తొక్కాలన్నారు. కొత్త ఆర్ధిక విధానం రావాలని అభిలాషించారు. అద్భుతమైన ఆవిష్కరణ జరగాలన్నారు. ఇతర దేశాలను చూసి నేర్చుకోవాలన్నారు. మన దేశంలో సహజ సిద్దమైన వనరులకు ఢోకా లేకపోయినప్పటికీ సరైన విధానాలు లేని కారణంగా అని ప్రజలకు అందడం లేదన్నారు. 1980 వరకు మన దేశ జిడిపిలో చాలా తక్కువ స్థాయిలో ఉన్న చైనా…. ప్రస్తుతం ప్రపంచంలోనే అభివృద్ధిలో అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. మెరుగైనా విధానాలను అవలంభించడం ద్వారానే చైనాకు అది సాధ్యమైందన్నారు. కానీ మన దేశంలో సరైన ఆర్ధిక, పన్నుల విదానం లేదన్నారు. దీని కారణంగానే దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా… అందులో సగం కూడా వినియోగించుకోలేని దుర్భరమైన స్థితిలో దేశం ఉందని కెసిఆర్ అన్నారు. అలాగే దేశంలో 65 వేల టిఎంసి నీరు అందుబాటులో ఉండగా 30వేల టిఎంసి నీటిని కూడా వినియోగించలేకపోతున్నామన్నారు. ఫలితంగా చాలా నీరు వృధాగా సముద్రం పాలు అవతోందన్నారు. వీటిపై అప్పటి నుంచి మొదలుకుని ఇప్పటి బిజెపి ప్రభుత్వం వరకు సరైన ఆలోచన, విధానాన్ని అవలంభించలేకపోతున్నాయని కెసిఆర్ విమర్శించారు. ఈ విధానాల్లో సంస్కరణలు వచ్చినప్పుడే దేశపురోభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.

CM KCR Press Meet at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News