Sunday, April 28, 2024

‘కకా’లకు నో

- Advertisement -
- Advertisement -

KCR

 

కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన
నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు
నిరుద్యోగం అంతటా ఉన్నదే
ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు
నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు
ప్రజలకు పరిస్థితి చెప్పి
విద్యుత్ ఛార్జీలు పెంచుతాం
ప్రభుత్వరంగంలో లక్ష కొలువులిచ్చాం
ఐటిలో 7 లక్షల ఉద్యోగాలొచ్చాయి
మీ (టిడిపి-కాంగ్రెస్) హయాంలో కొలువులెన్ని ఇచ్చారు?
వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం
నేను బతికున్నంతవరకు రైతులకు నిరంతర విద్యుత్
2023లోగా 25వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి
అన్ని రీ-ఇంజినీరింగ్ ప్రాజెక్టుల పూర్తి
రైతుబంధు-రైతు బీమా ఆగవు
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే 57 ఏళ్ల వారికి పెన్షన్
ఇంగ్లీష్ మీడియం కావాలంటున్నారు
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై చర్చిద్దాం
కేంద్రం నుంచి జిఎస్‌టి బకాయిలు ఇంకా రావాల్సి ఉంది
టిఆర్‌ఎస్ ఎంపిలు గోల చేస్తే వెయ్యి కోట్లే ఇచ్చారు
సిఎఎపై అసెంబ్లీలో కచ్చితంగా చర్చ జరగాలి
మన మనోభావాలు కేంద్రానికి తెలియాలి
సభలో ఎవరు చెప్పినా విందాం.. తీర్మానం చేసి కేంద్రానికి పంపుదాం
డబ్బు రాజకీయం ఎవరిదో అందరికీ తెలుసు
కాంగ్రెస్ నేతల్లో ఏకాభిప్రాయం లేదు
బంజారాహిల్స్‌లో తాగే నీళ్లు తండాల్లో తాగుతున్నారు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కరోనా వస్తే మాస్క్‌లు ఇచ్చే పరిస్థితి లేదంటూ విపక్ష నేతలు కొందరు మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో కరోనా లేనప్పుడు మాస్క్‌లు ఎందుకని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై సిఎం కెసిఆర్ బదులిచ్చారు. అలాగే రాష్ట్రంలో సిఎఎ (కా)ను కూడా రానివ్వమని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. దేశాన్ని కుదుపేస్తున్న ఈ పౌరసత్వ సవరణ చట్టంపై అసెంబ్లీలో కూలంకషంగా చర్చిద్దామన్నా రు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అసెంబ్లీలో ఒక తీ ర్మానం చేద్దామన్నారు. అప్పులు చేసి కరెంట్ తీసుకువస్తున్నారని అంటున్నారని, అయితే పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ ఛార్జీలు పెం చుతామని తెలిపారు. ఆరేళ్లలో ఒకసారి స్వల్పంగా ఇటీవల ఆర్‌టిసి ఛార్జీలు పెంచామని, అవసరమైతే ఒక శాతం, రెండు శాతం మళ్లీ పెంచుతామన్నారు.

అయితే ఏం చేసినా ప్రజలకు సరైన పద్ధతిలో వివరిస్తామని సిఎం స్పష్టం చేశారు. సంస్థలు కూడా బతకాలి కదా అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గతంలో చెప్పినవే మళ్లీ ఇప్పుడు ప్రస్తావించారని విపక్ష సభ్యులు అంటున్నారని, తాము సత్యమే చెప్పదలుచుకున్నామన్నారు. బడ్జెట్‌లో గృహ నిర్మాణంకు సంబంధించి ఆర్థిక మంత్రి ప్రకటన చేస్తారని తెలిపారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు, వేతన సవరణపై హామీ ఇచ్చామని, తగిన సమయంలో వాటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పోడు భూముల సమస్యలపై త్వరలోనే ప్రజా దర్భార్ పెడుతామన్నారు. త్వరలోనే సిఎస్‌తో పాటు తాను, మంత్రులు, ఎంఎల్‌ఎలందరూ పోడు భూములకు క్షేత్ర పర్యటన చేస్తామని చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ కొనసాగిస్తామని, రైతులు ఎంతైనా వరి వేసుకోవచ్చునని స్పష్టం చేశారు.

మూసీనదిని క్లీన్ వాటర్‌గా ఈ టర్మ్‌లో పూర్తి చేస్తామని తెలిపారు. 2020-21లో 9.50 లక్షల కోట్లు జిఎస్‌డిపి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు జిఎస్‌డిపి రూ.4 లక్షల కోట్లు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత జిఎస్‌డిపి రూ.8.66 లక్షల కోట్లు దాటిందన్నారు. సిఎఎ దేశ గౌరవానికి సంబంధించిన విషయమని, తనకే బర్త్ సర్టిఫికేట్ లేదని ఇంకా మా నాన్న వివరాలు ఎక్కడి నుంచి తీసుకువస్తానని సిఎం ప్రశ్నించారు. సభలో ఏదీ పడితే అది మాట్లాడకుండా ఏదైనా నియమం చేయాల్సి ఉందన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక ఇంకోలా ఉండే పద్ధతికి స్వస్తి పలకాలన్నారు. ఆర్‌టిసి ఛార్జీలు పెంచితే ఉదయం నాలుగు గంటలకే డిపోల ముందు ధర్నాకు కూర్చుంటారన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక ఎవరైనా ఛార్జీలు తగ్గించారా అదీ లేదన్నారు. తాను కూడా ఛార్జీలు పెంచినపుడు డిపోల ముందు ధర్నా చేశానని సిఎం అనగానే సభలో నవ్వులు విరిసాయి.

కరోనాకు పారాసిటమాల్ చాలన్నారు…
ఇటీవల తనకో సైంటిస్ట్ ఫోన్ చేశారని, కరోనా గురించి హైరానా పడాల్సిన అవసరం లేదన్నారని సిఎం తెలిపారు. జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా వేసుకొనే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందన్నారని చెప్పారు. ఎవరికి వస్తుందో ఏం సంగతో గానీ.. మన తెలంగాణకు మాత్రం ఈ సమయంలో అసలు రాదన్నారన్నారు. ఎందుకు రాదంటే.. 22 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కరోనా వైరస్ బతకదని చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణలో ఉష్ణోగ్రత ఇప్పటికే 30 డిగ్రీలు దాటుతోందని చెప్పారు. దేశంలో 130 కోట్ల జనాభాకి కరోనా కేసులు 31 మాత్రమే. రాష్ట్రానికి కరోనా వైరస్ రాదు.. మేం రానివ్వం అన్నారు. రూ. వెయ్యి కోట్లు పెట్టి అయినా అడ్డుకుంటామన్నారు. రాష్ట్రంలో కరోనా వస్తే, మాస్క్‌లు లేకుండానే పనిచేస్తామన్నారు. కరోనాపై అసత్యా లు, దుష్ప్రచారాలు చేయకండి అని విజ్ఞప్తి చేశారు. చైనాలో పుట్టిందని, దరిద్రానికి అటు వెళ్లొచ్చిన ఒక వ్యక్తి మన దగ్గరకు రావడంతో ఒకే ఒక్క కేసు నమోదైందన్నారు. ఎంఎల్‌ఎలు అందరం మాస్క్‌లు కట్టుకోకుండానే పనిచేస్తామన్నారు. ప్రజలకు లేని మాస్క్ మాకేందుకని సిఎం వ్యాఖ్యానించారు.

వినే ఒపిక లేక పారిపోయారు
తన ప్రసంగం వినే ఒపిక లేక కాంగ్రెస్ సభ్యులు పారిపోయారని సిఎం పేర్కొన్నారు. కొందరు అభిప్రాయాలు, కొందరు ఆక్రోశాలు వెళ్లగక్కరాన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సర్వ సాధారణమన్నారు. శాశ్వాతంగా ఎవరూ ఉండరని, అలా అనుకున్న వాళ్లంతా దెబ్బతిన్నారని సిఎం పేర్కొన్నారు. ఇలాంటివి దేశంలో, రాష్ట్రంలో చాలా చూశామని, ఇందిరా గాంధీ నాడు రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయిందని, ఎన్‌టిఆర్ పార్టీ చాలా కాలం పాలించిన తరువాత కూడా ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. గెలుపోటములకు సహనం ఉండాలని తెలిపారు. కాంగ్రెస్ నిస్పృహలో ఉందని, నానాటికి ఆదరణ కోల్పోతున్న దుస్థితి కనిపిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా అలాగే ఉందని తెలిపారు. ఢిల్లీలో 15 ఏళ్లు పాలించినా, మొన్న 4 శాతం ఓట్లే వచ్చాయన్నారు. అయినా ఆ పార్టీలో రియలైజేషన్ కనిపించడం లేదన్నారు. ప్రజా జీవితంలో ఉండటం అదృష్టమని, అయితే అధికారమే పరమావధిక ఉండొద్దన్నారు. అసత్య ఆరోపణలు, గొంతు ఉంది కదా అని అరిస్తే నియంత్రిస్తామన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం దేశాన్ని కుదిపేస్తోంది
దేశాన్ని కుదిపేస్తున్న పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై చర్చ ఒక రోజుతో పూర్తి అయ్యేది కాదని, దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలన్ని తాను కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. దీనిని తెలంగాణలో రానివ్వమని అన్నారు. ప్రస్తుతం సిఎఎపై దేశంలో ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉందన్నారు. దీనిపై అన్ని పార్టీల సభ్యులు మాట్లాడ వచ్చునని, ఎవరి పార్టీ అభిప్రాయాలను వారు వెల్లడించవచ్చునని అన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమని సిఎం కెసిఆర్ వ్యాఖఆనించారు. దీనిపై పార్లమెంట్‌పై జరిగిన చర్చ సందర్భంగా టిఆర్‌ఎస్ విధానాన్ని స్పష్టం చేశామని, సిఎఎను తాము వ్యతిరేకించామన్నారు. అలాగే అసెంబ్లీలోనూ అన్ని పార్టీల సభ్యులు మాట్లాడిన తరువాత ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామన్నారు.

సిఎఎపై దేశవ్యాప్తంగా ఐదారు అసెంబ్లీల్లో చర్చ జరిగిందన్నారు. రాష్ట్రాల అభిప్రాయాన్ని కేంద్రం అంగీకరిస్తుందా? లేదా? అన్నది తర్వాత చూడాలన్నారు. సిఎఎకు వ్యతిరేకంగా దేశంలో 40- నుంచి 50 మంది చనిపోయిన సీరియస్ అంశంపై కచ్చితంగా చర్చ జరగాలని సిఎం అన్నారు. మన మనోభావాలు కేంద్రానికి తెలియజేయాల్సిన అవసరముందన్నారు. సభలో ఎవరు ఏం చెప్పినా విందామన్నారు. అనంతరం దీనిపై సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమన్నారు. ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టం దేశాన్ని కుదిపేస్తోందన్నారు. దీనిపై చర్చ ఒకరోజుతో అయ్యేది కాదని సిఎం పేర్కొన్నారు. సిఎఎపై చర్చ అంటే అంతర్జాతీయ స్థాయిలో దేశభవిష్యత్ గురించి మాట్లాడటమేనని అన్నారు. బిజెపి శాసనసభ్యుడు కూడా తన వాదన వినిపించవచ్చునని అన్నారు. సిఎఎపై అందరి సభ్యులకు అవకాశం కల్పించాలని తాను స్పీకర్‌ను కోరుతున్నానని తెలిపారు. రెండు మూడు గంటలైనా సభలో చర్చిద్దామని. సభ అంతిమ ఉద్దేశాన్ని కేంద్రానికి తెలియజేద్దామన్నారు.

నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు
సిఎఎ, ఎన్‌పిఆర్ విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళన ఉంది. దేశగౌరవానికి, రాజ్యాంగానికి సంబంధించిన విషయం. నేను పల్లెటూరిలో నా ఇంట్లో పుట్టిన. నాకు బర్త్ సర్టిఫికేట్ లేదు. నేను ఎలా ఎవరు అని చెప్పుకోవాలి. జన్మనామం అని రాసేది అదే నాప్రూఫ్, నా వైఫ్ దగ్గర ఉంటదని సిఎం వ్యాఖ్యానించారు. జన్మనామం అయ్యగార్లు ఇస్తరు. నాకే బర్త్ సర్టిఫికేట్ దిక్కు లేదు. ఇంకా మా నాన్నది ఎక్కడి నుంచి తెస్తా. 580 ఎకరాలుండే మాకు. నాకే లేదంటే, దళితులు, ఎస్‌టిలు, నిరుపేద ప్రజలు ఎక్కడి నుంచి సర్టిఫికేట్లు తెస్తరు. నేషనల్ ఐడెంటి తీసుకురావాలి. ముఖ్యంగా రాజ్యాంగంలోనే రాసుకున్నాం. మతం పేరుతో ఒక వర్గాన్ని మినహాయించడం ఏంటి ? పరువు పోతుంది. యూఎన్‌లో చర్చ కూడా జరుగుతోంది. మేమేం భయపడం. మాకో సిద్ధాంతం ఉంది. చర్చ చేద్దాం అది ప్రజల్లోకి పోవాలని సిఎం వ్యాఖ్యానించారు.

ఏది పడితే అది మాట్లాడకూడదు..
‘శాసనసభలో ఏది పడితే అది మాట్లాడకూడదనే నియమం పెట్టాలి. పనిచేసే ప్రభుత్వాలపై ఆరోపణలు చేస్తే ఊరుకోకూడదు. ఆక్రోశాల వేదిక కాదు. వీరంగాలు చేస్తే ఊరుకోం. నాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గవర్నర్ ప్రసంగంలో మైక్ విసిరితే బహిష్కరించినం. ఈ ఆరాచకం మంచిది కాదు. గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఆరోపణ చేస్తే రుజువు చేయాలి. సింగపూర్‌లో ప్రూవ్ అండ్ పెరిష్ ఉంది. అలాంటిదేమైనా అవకాశం ఉంటే తీసుకురావాలి అని సభాపతిని సిఎం కోరారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలపై ఏదైనా చర్య తీసుకోవాలన్నారు. 2014 ఎన్నికల సమయంలో భట్టి విక్రమార్క ఈ ప్రభుత్వం ఉండదు కూలిపోతుందని వ్యాఖ్యానించారని సిఎం గుర్తు చేశారు. అలాగే, 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు ఇవిఎంలు గోల్‌మాల్ చేశామంటూ గోలగోల చేశారన్నారు.

మాదేమైనా కేంద్ర ప్రభుత్వమా, ఇసి మా పరిధిలో ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లుగెలిస్తే చక్కగా గెలిచినట్టు.. మేమైతే డబ్బులు పెట్టి గెలిచినట్టా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవిఎంలు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తమకు తెలియదన్నారు. బ్యాలెట్ పద్ధతిలో పంచాయతీ రాజ్ ఎన్నికలు నిర్వహిస్తే 32కు 32 జిల్లా పరిషత్‌లలో టిఆర్‌ఎస్‌దే హవా అన్నారు. ఏ ఎన్నిక వచ్చినా తమ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లు బిజెపితో కుమ్మక్కయ్యారనీ.. లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకున్నారన్నారు. మణికొండ, మక్తల్ మున్సిపాలిటీల్లో ఎలా గెలిచారో తెలియదా అన్నా రు.

అక్బరుద్దీన్ వ్యాఖ్యలను సమర్ధిస్తున్నా..
కేంద్రం నుంచి రాష్ట్రానికి జిఎస్‌టి బకాయిలు రావడం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో ప్రకటించారు. ఈ విషయంలో ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని సిఎం చెప్పారు. దీనిపై పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ ఎంపిలు గోలచేస్తే కేవలం రూ.1000 కోట్లు వచ్చాయన్నారు.- ఇంకా రాష్ట్రానికి పెద్దఎత్తున నిధులు రావాల్సి ఉందని సిఎం తెలిపారు.

డబ్బుల రాజకీయం ఎవరిదో అందరికీ తెలుసు
నల్లగొండ రాజకీయ చరిత్రలో అతి ఎక్కువ డబ్బులు ఎవరు పెడ్తారో, డబ్బుల మీద రాజకీయ చెలాయించెదవరో అందరికి తెలుసునని సిఎం వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం అసత్యం అని రాజగోపాల్ రెడ్డి మాటాలు రికార్డుల్లో నుంచి తీసేవేయాలని స్పీకర్‌ను సిఎం కోరారు. విమర్శ చేసి కాంగ్రెసోళ్లు పారిపోయారన్నారు. ఇదే రాజగోపాల్ రెడ్డి అన్న కోమటి రెడ్డి రుణం ఇచ్చే సంస్థకు నిధులు ఇవ్వొద్దని తన అధికార లెటర్ రిస్తారు. పార్లమెంట్‌లో ప్రశ్నలు వేస్తారు. హైకోర్టులో పాలమూరు ప్రాజెక్టుపై కేసులు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. పాలమూరు మీద నిరంతరం కేసులు వేస్తుంటే దిండికి నీల్లు ఎట్ల వస్తయ్. మా సభ్యులు మర్రి జనార్ధాన్, నిరంజన్ రెడ్డి తండ్లాడుతున్నరు. కేసులు వేసేది వాళ్లే కాళేశ్వరంలా పాలమూరు స్పీడ్‌గా చేస్తాలేరనేది వాళ్లేనన్నారు. ఇది ఎట్లుందంటే వరదలు వచ్చినాయ్ అని హెలికాప్టర్‌లో చూడానికిపోతే గంత లక్షలు ఖర్చు పెట్టుకుని హెలికాప్టర్‌లో పోవుడు అవసరమా అంటరు. అదే కారులో పోతే హెలికాప్టర్‌లో పోవచ్చుగా అంటారని సిఎం వ్యాఖ్యానించారు.

ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు కావచ్చు…
తెలంగాణ ఏర్పాటయ్యాక 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ నేతలు కొందరు వద్దని అంటే.. మరికొందరు నేతలు కొత్త జిల్లాలకు డిమాండ్ చేశారని.. వాళ్లలో వాళ్లకే బేధాభిప్రాయాలున్నాయని సిఎం ఎద్దేవా చేశారు. ములుగు జిల్లా కావాలని సీతక్క అడిగారని గుర్తు చేశారు. గద్వాల జిల్లా చేయకపోతే జూరాల ప్రాజెక్టులో దుంకుతా, దీక్ష చేసింది కాంగ్రెస్ వాళ్లేనన్నారు. ములుగు జిల్లా ఏర్పాటు చేసే సమయంలో చత్తీస్‌గడ్ సిఎంతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. భారతదేశ చరిత్రలో అన్ని రాష్ట్రాలూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాయనీ.. పశ్చిమబెంగాల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే చేయలేదన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 33 జిల్లాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తెలంగాణను చూశాకే ఎపి ప్రభుత్వం కూడా జిల్లాలు చేసే యోచనలో ఉందన్నారు. ఎపి సిఎం జగన్ తనతో మాట్లాడిన దాన్నిబట్టి, తనకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 25 జిల్లాలు ఏర్పాటుచేసే అవకాశం ఉందని తెలిపారు.

‘బంజరాహిల్స్‌లో తాగే నీళ్లు.. తండాలో తాగుతున్నారు. మిషన్ భగీరథ అద్భుతమైన పథకం. 11 రాష్ట్రాలు ఇంజనీర్లు పంపమని అడిగారని, కేంద్రం కూడా ఈ స్కీమ్‌ను స్ఫూర్తిగా తీసుకుందన్నారు. 2024 కల్లా అందరికీ తాగునీటి అందుబాటులోకి తీసుకోస్తామని చెప్పిందని గుర్తు చేశారు. నల్లగొండలో ఫ్లోరోసిస్ బంద్ అయిందని, జల్‌శక్తి శాఖ, వైద్య నిపుణుల బృందమే చెప్పింది. మిషన్ భగీరథ నీళ్లు తాగి వెళ్లారు. ఇంత ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. సోయితో ఉన్నాం.

రాష్ట్రంలోని 12,752 గ్రామ సర్పంచ్‌ల నుంచి మిషన్ భగీరథ నీళ్లు అందాయని తీర్మానాల కాపీలు తెప్పించుకున్నామన్నారు. ఏ పథకం కోసమైనా గ్రామాల నుంచి తీర్మానాలు తెప్పించుకున్న దాఖలాలు ఉన్నాయా ? ఉట్టిగానే ఇస్తారా తీర్మానాలు అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో 334 హ్యాబిటేషన్స్‌కు నీళ్లు పోయాయన్నారు. ఎంఎల్‌ఎగా ఆయన సంతకం కూడా ఉందన్నారు. రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామన్నారని, అంత ఖర్చు చేయలేదన్నారు. రూ.41 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. మరో రూ.3 వేల కోట్లకు టెండర్లు పిలిచినాట్లు చెప్పారు.

పాతబస్తీకి మెట్రో.. యుద్ధప్రాతిపదికన పనులు
పాతబస్తీకి మెట్రోపై ఎల్ అండ్ టితో మాట్లాడామని, గతంలో ఆలైన్‌మెంట్ ఎంఐఎం కూడా అబ్జెక్షన్స్ చెప్పిందన్నారు. ఇప్పుడు అన్ని ఇబ్బందులు పూర్తయ్యయాని, యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తామని కెసిఆర్ ప్రకటించారు. అసెంబ్లీ, సెక్రటేరియేట్ నిర్మాణాలు చేయకుండా కేసులు వేస్తున్నారని సిఎం మండిపడ్డారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంకు పేరు రావొద్దనే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాజాసింగ్ ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో గుడుంబా తయారీ దారులకు ప్రత్నామ్నాయ ఉపాధికి రూ.125.99 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ నేతలు టిఆర్‌ఎస్‌లో చేరడంపై సిఎం మాట్లాడుతూ.. ‘చట్టబద్ధంగా కాంగ్రెస్ నేతలు టిఆర్‌ఎస్‌లో విలీనమయ్యారు. దేశంలో ఏ పార్టీ అయినా చీలివస్తే వద్దని చెప్తారా?’ అని అన్నారు. ఒకరిద్దరు వస్తా అంటే ముందు తానే వద్దు అని చెప్పినట్లు తెలిపారు. ఎంఎల్‌ఎలకు క్యాంపు కార్యాలయాల నిర్మాణాలు ఎక్కడా లేవని, ఇక్కడే ఉన్నాయన్నారు.

చరిత్రలో కనివీని ఎరుగని రీతిలో ఈ యాసంగిలో 38.19 లక్షల ఎకరాల వరి సాగైంది. వర్షకాలంలో 40 లక్షల ఎకరాలకుపైగా వరి సాగైందన్నారు. రైస్ మిల్లర్లకు ఎగుమతి అవకాశాలు ఇవ్వడం వంటి వాటిపై అధ్యయనం చేస్తామన్నారు. 24 గంటలు కరెంట్ కొనసాగిస్తామన్నారు. సన్న బియ్యం ఎక్కువ పండించాలి. షుగర్ ఫ్రీ రైస్ సోనా పండించాలని సూచించారు. దీనిపై విరివిగా ప్రచారం చేయాల్సి ఉందన్నారు. రైతులు వరి సాగు ఇంకా చేసుకోవచ్చునన్నారు. తమ ప్రభుత్వంలో అందరికీ అవకాశాలు కల్పిస్తున్నామని స్థానిక ఎన్నికల్లో కూడా సామాజిక సమతూకం పాటిస్తూ పదవులు పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు.

విఫల ప్రయోగం చేయాలనుకున్నారు
రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తరవాత ఎపికి, తెలంగాణకు వేరు వేరుగా ఎన్నికలు పెట్టాలని కోరాం. అయినా పెట్టలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతైంది. ఆ తరువాత వచ్చిన బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని ఏడు మండలాలను ఎపికి ఇచ్చేసిందన్నారు. సీలేరు పవర్ ప్లాంట్ లాగేసుకున్నారన్నారు. అందుకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటును విఫల ప్రయోగంగా చూపెట్టాలని చూశారని, ప్రజలు, భగవంతుని దయ, పార్టీ నాయకుల కృషితో ఆగమ్య గోచరంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని కూర్చి ఇంత వరకు వచ్చామన్నారు. అభివృద్ధికి, సంక్షేమానికి థర్డ్ పార్టీ సర్వే గీటు రాయి అని అదే విధంగా ప్రజలు పెట్టే పరీక్ష ఎన్నికల్లో నెగ్గడమేనని తెలిపారు. 2014లో 63 మంది గెలిస్తే, 2018 డిసెంబర్‌లో 88 మంది గెలుచుకున్నామన్నారు. ప్రజలు ఇంకో 25 సీట్లు అధికంగా ఇచ్చారని తెలిపారు. తప్పు చేసి ఉంటే, ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేకపోతే అసెంబ్లీ రద్దు ఎందుకు చేస్తామని ప్రశ్నించారు.

కాళ్లు మొక్కినా  కిడ్నాప్ చేయం

కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కిడ్నాప్ వ్యాఖ్యాలపై సిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డిసిఎంఎస్ డైరెక్టర్‌ను మేమేందుకు కిడ్నాప్ చేస్తాం. దండం పెట్టినా, కాళ్లు మొక్కినా కిడ్నాప్ చేయం. సింగిల్ విండో ఛైర్మెన్‌లు 94 శాతం గెలుచుకున్నాం. నేనే ఆశ్చర్యం వ్యక్తం చేసినా. ఇదేం గెలుపయ్యా.. దిష్టి తాకేటట్లు ఉందని పార్టీ నాయకులతో చెప్పినా. కాంగ్రెస్ వాళ్ల అంచనాలు, ఆలోచన సరళి తప్పు, ఇంత వరకు ఆత్మ పరిశీలన లేదు. ప్యాక్స్, డిసిసిబి, డిసిఎంఎస్, టెస్కాబ్ అన్నింటిలోనూ టిఆర్‌ఎస్ మద్ధతుదారుల ఎన్నిక లాంఛనమేనని పత్రికలే రాశాయి. లోకం కోడై కూసింది. కిడ్నాప్ ఏం అవసరం అని అన్నారు.

ఇంటికో ఉద్యోగమని చెప్పలేదు
గత ప్రభుత్వాల హయాంలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారంటూ సిఎం విపక్షాలను నిలదీశారు. కాంగ్రెస్, టిడిపి పాలనలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాలు వేలల్లో ఉంటే.. ప్రైవేట్ ఉద్యోగాలు లక్షల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఇవ్వలేని ఉద్యోగాలను ఇస్తామని ఎందుకు చెప్పాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తానని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఆ విషయాన్ని మా మేనిఫెస్టోలో పెట్టలేదు. లక్ష ఇళ్లకు ఉద్యోగాలు వస్తాయని మాత్రమే చెప్పాం’ అని కెసిఆర్ వివరించారు. హైదరాబాద్ చుట్టుపక్కలనే ప్రైవేట్‌లో 20 లక్షల నుంచి 30 లక్షల మంది పనిచేస్తున్నారన్నారు. అయినా ఇప్పటికే 60 వేల ఉద్యోగాల వరకు ఇచ్చినం. ఇంకా కొన్ని ప్రాసెస్‌లో ఉన్నాయి.

పోలీసు ఉద్యోగాలే 80 ల వరకు ఇచినట్లు చెప్పారు. నిరక్షరాస్యతకు గత ప్రభుత్వాలు కారణం కాదా అని ప్రశ్నించారు. సమగ్ర సర్వేలో 7 లక్షల ఇండ్లు నిర్మిస్తే సరిపోతుందని తేలిందన్నారు. కాంగ్రెస్, టిడిపిలు లక్షల ఇండ్లు నిర్మించిన తరువాత కూడా ఇంకా నిర్మించాల్సిన అవసరం ఎందుకు వస్తుందన్నారు. ఐటిలో సూపర్ డూపర్ ఉన్నామన్నారు. శాంతి భద్రతలు కూడా బాగున్నాయన్నారు. 2004 నుంచి 2014 వరకు తెలంగాణలో మూలధన పెట్టుబడి రూ.59 వేల కోట్లు మాత్రమేనన్నారు. గత ఐదేళ్లలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్టిన క్యాపిటల్ ఎక్స్‌పెండేచర్ రూ.1.60 లక్షల కోట్లుగా ఉందన్నారు.

 

CM KCR said no Corona virus in state
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News