Sunday, April 28, 2024

తెలంగాణ వరదాయని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  బిఆర్‌ఎస్ ప్రభుత్వ కృషి ఫలిచింది. ముఖ్యమంత్రి కెసిఆర్ దూర దృష్టితో రూపొందించిన ప్రణాళికలు ..పట్టుదలతో సాధించిన పరిపాలనపరమైన అనుమతులు ..నిర్మాణ పనులకు తగ్గట్టుగా నిధుల కేటాయింపులు దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజల దశబ్ధాల కళను నెరవేర్చాయి. పాతాళంలో ఉన్న కృష్ణానదీ జలాలు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఉబికి రానున్నాయి. లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. వందలాది గ్రామాలకు తాగునీటి దూపతీరనుంది. కృష్ణనదీజలాల ఆధారంగా పారిశ్రామిక రంగం కూడ పరుగులు తీయనుంది. నీటిపారుదల రంగం చరిత్రలో అత్యంత వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముస్తాబవుతోంది. ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ పథకాన్ని ప్రజలకు అంకితం చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు సాధన వెనుకు ప్రభుత్వం చేసిన కృష్టిని ముఖ్యమంత్రి కార్యాలయ ఒఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే సోదహరంగా వివరించారు.

తెలంగాణ ప్రభుత్వ కృషి :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే చేసిన మొదటి పని… అటక మీద దుమ్ముపట్టిపోయిన పాలమూరు రంగారెడ్డి దస్త్రాన్ని బయటకు తీసి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) వారి అధీనంలో పని చేస్తున్న ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఇఎస్‌సిఐ) వారిచే సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేయించడానికి 5.71 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ జి ఓ నంబరు 69 ని తేదీ 2014 ఆగస్ట్ ఒకటిన న జారీ చేసింది. 6 నెలల తర్వాత ఇస్కీ వారు తయారు చేసిన ముసాయిదా నివేదికలోని ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభుత్వ సలహాదారు దివంగత ఆర్ విద్యాసాగర్ రావు, సాగునీటి శాఖ సీనియర్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఎస్కీ ఇంజనీర్లతో కూలంకషంగా సమీక్ష జరిగింది. ప్రాజెక్టు తొలి ప్రతిపాదనలు ,వాటికి సంబంధించిన సాంకేతిక అంశాలను సమగ్రమంగా చర్చించి సాధ్యాసాధ్యాలను క్షున్నంగా పరిశీలించారు. ప్రాజెక్టుకు రీడిజైన్ చేశారు.
రీ డిజైన్ తర్వాత ప్రాజెక్టు వివరాలు :
రీ డిజైన్ తర్వాత ప్రాజెక్టు ప్రతిపాదనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధానమైన మార్పులు..1. నీటి సొర్స్ జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి మార్చడం,2. ఆరు కొత్త జలాశయాలను ప్రతిపాదించచడం,3. ఆయకట్టు 10 లక్షల ఎకరాల నుంచి 12.30 లక్షల ఎకరాలకు పెంచడం 4. గతంలో కంటే ముంపు గణనీయంగా తగ్గించడం జరిగింది.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలు,రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలు.. మొత్తం 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి, మొత్తం 70 మండలాల్లో 1226 గ్రామాలకు తాగునీరు అందించడానికి ప్రతిపాదనలు తుది రూపం తీసుకున్నాయి. నార్లాపూర్ వద్ద 8.51 టిఎంసిలు, ఏదుల వద్ద 6.55 టిఎంసిలు, వట్టెం వద్ద 16.74 టిఎంసిలు, కరివెన వద్ద 17.34 టిఎంసిలు, ఉద్దండాపూర్ వద్ద 15.91 టిఎంసిలు, లక్ష్మిదేవిపల్లి వద్ద 2.80 టిఎంసిలు నిలువ సామర్థ్యంతో 6 జలాశయాలను ప్రతిపాదించినారు. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 67.97 టిఎంసిలు. అన్ని జలాశయాల్లో కలిపి ముంపు మొత్తం 49 వేల ఎకరాలు, ప్రభావితం అయ్యే గ్రామాలు 3, తండాలు 20, ఆవాసాలు 2,781 మాత్రమే. పై గణాంకాలను పరిశీలిస్తే రీ డిజైన్ తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ముంపు గణనీయంగా తగ్గిపోయిందని అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనల్నిఆమోదించడంతో ప్రభుత్వం 2016 జూన్ 10న జిఒ ద్వారా ప్రాజెక్టుకు రూ. 35,200 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.ముఖ్యమంత్రి ప్రాజెక్టుకు .2015 జూన్ 11న కరివెన గ్రామం వద్ద శంకు స్థాపన చేసిన తర్వాత ప్రాజెక్టు పనులని 18 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చెయ్యడం జరిగింది. పనులు ప్రారంభమయినాయి. ప్రాజెక్టుపై వేసిన కోర్టు కేసుల కారణంగా పనులను రెండు దశలలో పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. మొదటి దశలో తాగునీటి సరఫరా పనులు, రెండో దశలో సాగునీటి సరఫరా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.తాగునీటి సరఫరా పనులు పూర్తి అయ్యే దశకు చేసుకున్నాయి. నార్లాపూర్ పంప్ హౌజ్ లో మొదటి పంపు (145 మే వా) డ్రై రన్ కూడా ఆగస్ట్ 3 న విజయవంతం అయ్యింది. సెప్టెంబర్ 16 న ప్రాజెక్టు ప్రారంభం కాబోతున్నది.
కేంద్ర ప్రభుత్వ గజిట్ నోటిఫికేషన్ :
పరిస్థితులు ఈ రకంగా ఉన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం 2020జులై 15 న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధులను నిర్దేశిస్తూ గజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇందులో రెండు నదీ బేసిన్ లలో కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాను పొందు పరచింది. అందులో కృష్ణ బేసిన్ లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా చేర్చినారు. ఈ ప్రాజెక్టులకు 6 నెలల్లో కేంద్ర సంస్థల నుంచి అనుమతులు పొందాలని ఆదేశించింది. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం నుంచి, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు పొందడానికి డిపిఆర్ లు సిద్దం చేయమని ముఖ్యమంత్రి సాగునీటి శాఖను ఆదేశించారు. గోదావరి బేసిన్ లో ఇప్పటి వరకు 9 ప్రాజెక్టుల డి పి ఆర్ లు సమర్పించి అనుమతుల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నది. అందు కోసం దిల్లీలో ఎగ్జిగ్యూటివ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో పనిచేసే ఒక కార్యాలయాన్ని నెలకొల్పింది. కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు లేవు. పాలమూరు సహా అన్ని ప్రాజెక్టులు.. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎలిమినేటి మాధవరెడ్డి, ఆర్ విద్యాసాగర్ రావు డిండి ..కూడా వరద జలాల కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులే. పాలమూరు, డిండి మినహా మిగతా మూడు ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రం ప్రారంభించినవే. వరద జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం కానీ, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ కానీ అనుమతులు ఇవ్వడానికి నిబంధనలు లేవు.
పాలమూరు డిపిఆర్ పరిశీలనలో వివక్ష :
ఆంధ్ర ప్రదేశ్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రత్యేకమైన కేసు వేసింది. అందులో వారు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నీటి కేటాయింపుల జి ఒ పై ఆక్షేపణలు చేసినారు. అయితే ఆ నీటిలోతమకు కూడా హక్కు ఉందని కానీ, తమకు కూడా వాటా కావాలని కానీ కోరలేదు. ఎందుకంటే ఈ నీటిని నాగార్జునసాగర్ ఎగువన వాడటానికి కృష్ణా బేసిన్ లో తమకు ప్రాజెక్టులు లేవని వారికి తెలుసు. కేంద్ర జల సంఘం వారు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న న్యాయ విచారణ పరిధిలో ఉంది (సబ్‌జ్యుడిస్) అన్న కారణాన్ని చూపి, తెలంగాణ వాదనలు గాని, సాక్ష్యాలు కానీ పరిగణనలోకి తీసుకోకుండా పాలమూరు ప్రాజెక్టును పరిశీలించలేమని వెనక్కి పంపుతూ లేఖ రాసింది. ఈ లేఖపై తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా స్పందించింది. కేంద్ర జల సంఘం కర్ణాటక అప్పర్ భద్రా ప్రాజెక్టు పట్ల ఒక రకంగా, తెలంగాణ పాలమూరు ప్రాజెక్టు పట్ల మరో రకంగా వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆక్షేపించింది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో .. కర్ణాటక రాష్ట్రం అప్పర్ భద్రా ప్రాజెక్టుకు ఏ పద్దతులు అనుసరించి తమ వాటా నుంచే నీటి కేటాయింపులు జరుపుకున్నదో అవే పద్దతులను అనుసరించి తెలంగాణ కూడా తన వాటా నుంచే పాలమూరు ప్రాజెక్టుకు నికర జలాల కేటాయింపులు చేసుకున్నదని తెలిపింది. అప్పర్ భద్రా వివాదం కూడా సుప్రీం కోర్టు ముందు ఉన్నది. మరి ఇది న్యాయ విచారణ పరిధిలోని విషయం ఎట్లా కాకుండా పోయింది? తెలంగాణకుఒకన్యాయం, ఇతరరాష్ట్రాలకుమరోన్యాయమా? అనిప్రశ్నించింది. 2021 జూలై 15తేదీనకేంద్ర ప్రభుత్వంవిడుదలచేసినగెజిట్ ప్రకారం.. అనుమతిలేని ప్రాజెక్టులజాబితాలోపాలమూరు-రంగారెడ్డినిచేర్చారని, ఆరునెలల్లోగాఅనుమతులుపొందాలనిచెప్పారన్నారు. ఈ ఆదేశాలమేరకేఅనుమతులకోసండీపీఆర్ ను 2022సెప్టెంబర్ లో సమర్పించినట్టుతెలిపారు. అప్పటినుంచిఆరునెలల్లోగాడీపీఆర్ నుపరిశీలించి, అనుమతులుఇచ్చేబాధ్యతకేంద్రానిదేననిగుర్తుచేశారు. ఇప్పటికే 6 నెలలు కాలాయాపన చేసి న్యాయ పరిధిలోని అంశం అన్న సాకు చూపించి వెనక్కి పంపడం సమంజసం కాదు కాబట్టిడీపీఆర్ నుపరిశీలించి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్
తుదితీర్పునకులోబడి అనుమతులు మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు. డి పి ఆర్ పరిశీలన కొనసాగించాలని, త్వరగా అనుమతులు మంజూరు చేసే విధంగా కేంద్ర జల సంఘాన్నిఆదేశించాలని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ను రాష్ట్ర సాగునీటి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర జల సంఘం లేవనెత్తిన అంశాలు అన్నిటికీ సవివరమైన సమాధానాలు సమర్పించామని రజత్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ స్పందించి పాలమూరు డి పి ఆర్ పరిశీలన కొనసాగించాలని కేంద్ర జల సంఘాన్ని ఆదేశించింది. కేంద్ర జల సంఘం ప్రాజెక్టు నివేదిక పరిశీలన కొనసాగిస్తుది. ఇప్పటికే ప్రాజెక్టుకు ఆరు అనుమతులు సాధించడం విశేషం.
ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించిన అనుమతులు :
1. అటవీ అనుమతి :
ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 12.3 లక్షల ఎకరాలకు సాగు నీరు, వెయ్యి కి పైగా గ్రామాలకు తాగు నీరు అంధించే పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ తుది అటవీ అనుమతులను మజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రవణ్ కుమార్ వర్మ 2019 జనవరి 25న లేఖ రాశారు. ప్రాజెక్టు నిర్మాణానికి నాగర్ కుర్నూల్ జిల్లా అచ్చంపేట అటవి డివిజన్ లో ఉన్న 205.4811 హెక్టార్ల అటవీ భూమిని నీటిపారుదలశాఖకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి 2017 మే నెలలో లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధనని ఫారెస్ట్ అడ్వైసరీ కమిటీ (ఎఫ్‌ఏసి ) పరిశీలించి 2018 ఏప్రిల్ నెలలో మొదటి దశ అటవీ అనుమతిని మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం విధించిన అన్నీ విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసిన కారణంగా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ ప్రాజెక్టు కు తుది అటవీ అనుమతిని మంజూరు చేసింది.వీటిలో కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సిఈఏ) అనుమతి 2023 మార్చి 17న లభించింది. సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ అనుమతి : తేదీ 2023 జూన్ 5న లభించింది. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి 2023 జులై 17న లభించింది. కేంద్ర భూగర్భ జల బోర్డు అనుమతి 2023జులై 28న లభించింది.
పర్యావరణ అనుమతికి ఈఏసి సిఫారసు :
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం పబ్లిక్ హియరింగ్ జరిపి పర్యావరణ మంత్రిత్వ శాఖకు డి పి ఆర్ ను సెప్టెంబర్ 2022 లో సమర్పించడం జరిగిగింది. మంత్రిత్వ శాఖ కోరిన విధంగా పర్యావరణ నష్టాలను అంచనా వేసి సమర్పించడం జరిగింది. జూన్ 26 న సాగునీటి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజ కుమార్ పర్యావరణ సలహా కమిటి ముందు సోదాహరణంగా ప్రాజెక్టు కరువు పీడిత, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు ఇవ్వడానికి ఉమ్మడి రాష్ట్రమే అనుమతి ఇచ్చిందని. తెలంగాణ ప్రభుత్వం దాని నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నదని చెప్పారు. పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కోరినారు. ఆ తర్వాతనే సాగునీటి సరఫరా కోసం కాలువలు తవ్వ గలుగుతామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధుల వివరణలకు సంతృప్తి చెందిన పర్యావరణ సలహా కమిటి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి జారీ చేయాలని 2023 ఆగస్ట్ 10న కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి పత్రాన్ని జారీ చేయడం ఇక లాంఛనమే. పర్యావరణ అనుమతి జారీ అయినాక సాగు నీటి సరఫరా పనులు చేపట్టడానికి ఉన్న అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా సన్నాహాలు చేసుకుంటున్నది. అన్ని అడ్డంకులను అధిగమించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడం శుభ సూచకం. 6 దక్షిణ తెలంగాణ జిల్లాలకు, 19 నియోజకవర్గాలకు, 70 మండలాల్లో 1226 గ్రామాలకు ప్రాజెక్టు వరదాయనిగా మారబోతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన 60 ఏండ్ల నీటి గోసకు తెర పడుతూ ఈ ప్రాజెక్టు ఒక పరిష్కారంగా 16 సెప్టెంబర్ న జాతికి అంకితం కానున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News